‘రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమ పథకాలు పోటీ పడుతున్నాయి. ప్రజలకు ఈ రెండూ చేరువయ్యాయి. గాంధీజీ కలలు కన్నట్లుగా అన్ని వర్గాల ఉద్ధరణ జరుగుతున్నది. వ్యవసాయంలో పురోగతి సాధించాం. పలు పథకాలతో దళితులు ఆర్థిక పురోభివృద్ధి సాధిస్తున్నారు. మొత్తం మీద స్వాతంత్య్ర, స్వరాష్ట్ర ఫలాలు ప్రతి కుటుంబానికీ అందుతున్నాయి. ప్రభుత్వం చేపడుతున్న అనేక కార్యక్రమాలతో పేదలు సంతోషంగా జీవిస్తున్నారు. జిల్లాలో కృష్ణా, గోదావరి, మూసీ జలాలతో పంటల సాగు గణనీయంగా పెరిగింది.’
-సూర్యాపేట పరేడ్ గ్రౌండ్లో మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి
సూర్యాపేట, ఆగస్టు 15 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమ పథకాలు పోటీ పడుతున్నాయని, గాంధీజీ కలలు కన్నట్లుగా అన్ని వర్గాల ఉద్దరణ జరుగుతుందని, వ్యవసాయ పురోగతి సాధించామని, దళితోద్ధరణ జరుగుతుందని, వ్యవసాయం పండుగలా మారిందని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి అన్నారు. 77వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని సూర్యాపేటలోని పోలీస్‌పరేడ్ గ్రౌండ్లో మంత్రి జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం జిల్లా కలెక్టర్ వెంకట్రావు, ఎస్పీ రాజేంద్రప్రసాద్‌తో కలిసి పోలీస్ గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం రాష్ట్ర ప్రభుత్వం ప్రజా సంక్షేమం కోసం జిల్లాలో అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల ప్రగతిని వివరించారు.
మహనీయులు కలలు గన్న గ్రామ స్వరాజ్యాన్ని నిజం చేయడంలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రజల సంక్షేమం కోసం జిల్లాలో అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల ప్రగతిలో భాగంగా జిల్లాలో 2,67,573 మంది రైతులకు 6,30,468 ఎకరాలకు 2019 నుంచి నేటి వరకు రూ.2,964 కోట్లు పంపిణీ చేసినట్లు చెప్పారు. రుణమాఫీ ద్వారా 2014, 2018లో రెండు విడుతలుగా జిల్లాలోని 1,75,492 మంది రైతులకు రూ. 751కోట్లు మాఫీ చేయగా, మూడో విడత ముమ్మరంగా కొనసాగుతుందన్నారు. రైతుబీమా ద్వారా 2018 నుంచి 2022 వరకు 3,577మందికి రూ.178.80 కోట్లు నామినీ ఖాతాల్లో జమ చేశామన్నారు. నేటి వరకు వ్యవసాయశాఖకు రూ.3,941.18కోట్లు మంజూరు చేశామన్నారు.
నీటి పారుదల, ఆయకట్టు అభివృద్ధికి..
జిల్లాలో మిషన్ కాకతీయ నాలుగు ఫేజుల ద్వారా 880 చెరుల్లో రూ.351.60కోట్లతో పనులు చేయగా 4 మినీ ట్యాంక్‌బండ్‌లకు రూ.42.15కోట్లు మంజూరు చేసినట్లు మంత్రి చెప్పారు. 15,230 ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందిస్తున్న మూసీ కాల్వల ఆధునీకరణకు రూ.65.56కోట్లు మంజూరు కాగా ఇప్పటి వరకు రూ. 38.20కోట్ల పనులు జరిగాయన్నారు. 2,13,176 ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందిస్తున్న ఎస్సారెస్పీ కాల్వల లైనింగ్ కోసం రూ.400 కోట్లతో ప్రభుత్వ ఆమోదానికి పంపినట్లు చెప్పారు. 2,29,961 ఎకరాల ఆయకట్టుకు సాగు నీరు అందిస్తున్న నాగార్జునసాగర్ ఎడమ కాల్వలను రూ.178.50కోట్లతో ఆధునీకరించినట్లు చెప్పారు. మిషన్ భగీరథతో రూ.917 కోట్లతో ఇప్పటి వరకు రూ.669.59కోట్లు ఖర్చు చేసినట్లు చెప్పారు.
మెరుగైన ఆరోగ్యమే ప్రభుత్వ లక్ష్యం
ప్రతి ఒక్కరికి ఉచిత మెరుగైన వైద్యం అందించడమే ప్రభుత్వ లక్ష్యమని, ప్రస్తుతం అదే అమలు చేస్తున్నామని మంత్రి జగదీశ్‌రెడ్డి చెప్పారు. వైద్య ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ ద్వారా జిల్లాలో 110 ఆరోగ్య ఉప కేంద్రాల భవన నిర్మాణాలకు రూ.22కోట్లు, 16 ఆరోగ్య కేంద్రాల మరమ్మతులకు రూ.2.63కోట్లు, మునగాల మండల కేంద్రంలో నూతన ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి రూ.1.30కోట్లు ఖర్చు చేశామన్నారు. జిల్లా జనరల్ ఆసుపత్రిలో మాతా శిశు సంరక్షణ కేంద్రం, ప్రభుత్వ నర్సింగ్ కళాశాల, బీసీయూ కేంద్రం, రక్తనిధి కేంద్రం, డయాలసిస్ కేంద్రం ఏర్పాటుతోపాటు ఇతర పనులకు రూ.15.33కోట్లు మంజూరు చేశామన్నారు. జిల్లాలో 94,47,124 కంటి పరీక్షలు నిర్వహించగా 2,85,240మందికి ఉచిత కండ్లద్దాలు, మందులు పంపిణీ చేసినట్లు చెప్పారు.
విద్యాభివృద్ధికి ఎనలేని కృషి
మన ఊరు-మన బడి, మన బస్తీ-మన బడి కింద 950 పాఠశాల్లో 329 పాఠశాలను ఫేజ్-1లో ఎంపికవగా రూ.67.14కోట్లు విడుదల చేసినట్లు చెప్పారు. 2016-17 నుంచి 2022-23 వరకు వివిధ పథకాల ద్వారా రూ.187.14కోట్లు మంజూరు చేసినట్లు చెప్పారు. రాష్ట్రం ఏర్పడక ముందు 4 కళాశాలలు ఉంటే 2016-17లో కొత్తగా 4 పాఠశాలలు, 1 మహిళా డిగ్రీ కళాశాలను మంజూరు చేసి 4 ఇంటర్ కళాశాలలను ఉన్నతీకరించేందుకు రూ.162కోట్లు అంచనా వ్యయంగా నిర్ణయించామన్నారు. జిల్లాలోని 4 మైనార్టీ గురుకుల పాఠశాలలను ప్రారంభించామన్నారు. 2019-20లో ఇంటర్మిడియట్ కళాశాలల ఉన్నతీకరణకు రూ.10కోట్లు మంజూరు చేశామన్నారు. గురుకులాలకు నాటి నుంచి నేటి వరకు 183.20 కోట్లు మంజూరు చేసినట్లు చెప్పారు.
విద్యుత్ శాఖ అభివృద్ధికి..
జిల్లాలో 1,47, 607 మంది వ్యవసాయ వినియోగదారులు ఉచిత విద్యుత్‌ను పొందుతున్నట్లు చెప్పారు. జిల్లాలో 33/11కేవీ సబ్స్టేషన్లు 66 ఉండగా రూ.43.62కోట్లతో 33/11 కేవీ సబ్స్టేషన్లు 30 ఏర్పాటు చేసినట్లు చెప్పారు. 128 పవర్ ట్రాన్స్ఫార్మర్లు ఉండగా రూ.43.86 కోట్లతో 87 అదనపు ట్రాన్స్ఫార్మర్లు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. జిల్లాలో విద్యుత్‌శాఖ ద్వారా రూ.1342.28కోట్ల వ్యయంతో అభివృద్ధి పనులు చేశామన్నారు.
సంక్షేమానికి పెద్దపీట
దళితబంధు పథకం ద్వారా మొదటి విడుత 2,568 షెడ్యూల్ కులాల కుటుంబాలకు రూ.256.80 కోట్లు, రెండో విడుత నియోజకవర్గానికి 1100 కుటుంబాలకు రూ.10లక్షల చొప్పున అమలు చేసేందుకు ప్రతిపాదనల ప్రక్రియ పురోగతిలో ఉందన్నారు. 5,883 షెడ్యూల్డ్ కులాల నిరుద్యోగ యువతకు రూ.109.59 కోట్లతో స్వయం ఉపాధి పథకాలు, 46మంది భూమి లేని నిరుపేదలకు 128.13 ఎకరాల భూమిని రూ.6.58 కోట్లతో కొనుగోలు చేసి పంపిణీ చేశామన్నారు. షెడ్యూల్డ్ కులాల అభివృద్ధికి రూ.391.70 కోట్లు మంజూరు చేశామన్నారు. అలాగే 39 వసతి గృహాల్లో 2014-15 నుంచి నేటి వరకు 26,448 మంది విద్యార్థులకు రూ.3.67కోట్ల నిధులు మంజూరు చేశామన్నారు. జిల్లాలోని 6,739 మంది విద్యార్థులకు 80 లక్షలు, 4,998 మందికి 1.24 కోట్ల ప్రీ మెట్రిక్ ఉపకార వేతనాలు మంజూరు చేశామన్నారు. షెడ్యూల్డ్ కులాల అభివృద్ధికి నాటి నుంచి నేటి వరకు 183.78కోట్లు మంజూరు చేయడం జరిగిందన్నారు. వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ద్వారా 1,37,734 మంది బీసీ విద్యార్థులకు రూ. 399.64 కోట్లు ఖర్చు చేసినట్లు చెప్పారు. జిల్లాలో మైనార్టీ సంక్షేమ శాఖ ద్వారా 9,232 మందికి మెస్ చార్జీల కింద రూ.5కోట్లు, బోధన రుసుం కింద 15.27 కోట్లు పోస్ట్‌మెట్రిక్ స్కాలర్‌సిప్ మంజూరు చేశామన్నారు.