అమ్మ తరువాత అంతటి సేవలు అందిస్తున్న ఘనత సమాజంలో నర్సింగ్ సిబ్బందిదేనని, వైద్య రంగం, ఆరోగ్య రక్షణలో వారిది కీలకపాత్ర అని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి అన్నారు. శుక్రవారం సూర్యాపేట ప్రభుత్వ మెడికల్ కళాశాల ఆడిటోరియంలో అంతర్జాతీయ నర్సింగ్ డే వేడుకలను నిర్వహించారు. మంత్రి ముఖ్య అతిథిగా హాజరై ఫ్లోరెన్స్ నైటింగేల్ చిత్రపటానికి పూల మాల వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఆస్పత్రికి వచ్చిన రోగికి ధైర్యాన్నిచ్చి వైద్యానికి కావాల్సిన అన్ని ఏర్పాట్లు చేసేది నర్సులేనన్నారు. ఒక రోగికి తనకు వైద్యం అందించే డాక్టర్ తెలువకపోవచ్చేమో కానీ నర్సు కచ్చితంగా తెలుస్తుందన్నారు. కరోనా సమయంలో నర్సుల సేవలు ఎనలేనివని తెలిపారు. సూర్యాపేట మెడికల్ కళాశాల ఏర్పాటుతో మెరుగైన వైద్యం, వైద్య విద్య చేరువయ్యామని చెప్పారు. ఇప్పటికే ప్రభుత్వ మెడికల్ కళాశాల పక్కా భవనం పూర్తయిందని, త్వరలోనే నర్సింగ్‌తోపాటు ఇతర భవనాలు నిర్మించుకుందామని తెలిపారు.
– సూర్యాపేట, మే 12 (నమస్తేతెలంగాణ)
సూర్యాపేట, మే 12 (నమస్తే తెలంగాణ) : సమాజంలో అమ్మ తర్వాత అంతటి సేవలు అందిస్తున్న ఘనత నర్సింగ్ సిబ్బందిదేనని, వైద్య రంగంలో వారిది కీలకపాత్ర అని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి అన్నారు. స్థానిక ప్రభుత్వ మెడికల్ కళాశాల ఆడిటోరియంలో శుక్రవారం ఏర్పాటు చేసిన అంతర్జాతీయ నర్సింగ్ డే వేడుకకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. వైద్య రంగంలో ప్రధానమైనది నర్సింగ్ వృత్తి అని, ఆస్పత్రికొచ్చిన రోగికి మొదటగా ధైర్యాన్నిచ్చేది నర్సులేనని పేర్కొన్నారు. నర్సింగ్ వృత్తి గొప్పతనం, అవసరం, ప్రాధాన్యం ప్రపంచానికి చాటి చెప్పి వృత్తి పట్ల ప్రజల్లో గౌరవం పెంచేందుకు వృత్తిని స్వీకరించే వారిని ప్రోత్సహించేందుకు ప్రతియేటా నర్సింగ్ డే వేడుకలను నిర్వహిస్తున్నామన్నారు. ఆస్పత్రికొచ్చిన రోగికి ధైర్యాన్నిచ్చి వైద్యానికి కావాల్సిన అన్ని ఏర్పాట్లను సిద్ధం చేసేది నర్సులేనన్నారు. కరోనా సమయంలో నర్సుల సేవలు అమోఘమైనవని ఆ సమయంలో మన సూర్యాపేట వైద్య సేవలు యావత్ దేశానికి ఆదర్శంగా నిలిచాయన్నారు.
సీఎం కేసీఆర్ సూర్యాపేటలో ఏర్పాటు చేసిన మెడికల్ కళాశాలతో మెరుగైన వైద్యం, వైద్య విద్య మరింత చేరువయ్యాయన్నారు. కళాశాల ప్రారంభం నుంచి అద్భుతమైన సేవలు అందిస్తుందని, రాబోయే రోజుల్లో మరింత ఆదర్శంగా తీర్చిదిద్దుకుందామన్నారు. ఇప్పటికే ప్రభుత్వ మెడికల్ కళాశాల పక్కా భవనం పూర్తైందని త్వరలోనే నర్సింగ్‌తో పాటు అన్ని పక్కా భవనాలు నిర్మించుకుందామన్నారు. విదేశాల్లో నర్సింగ్ కోర్సులకు అధిక ప్రాధాన్యం ఉందని సూర్యాపేటలో చదువుతున్న నర్సింగ్ విద్యార్థులు ప్రపంచ వ్యాప్తంగా సేవలు అందించాలని ఆకాంక్షిస్తున్నట్లు తెలిపారు. అందుకోసం అహర్నిశలు కష్టపడి చదివి వారి కుటుంబాలు, కళాశాలకు మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించాలన్నారు. కార్యక్రమానికి ముందు ఫోరెన్స్ నైటింగెల్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో డీఎంహెచ్ఓ కోటాచలం, జడ్పీ వైస్ చైర్మన్ గోపగాని వెంకటనారాయణగౌడ్, మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్ శారద, జనరల్ ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ మురళీధర్‌రెడ్డి, నర్సింగ్ కళాశాల ప్రిన్సిపాల్ అనిత, మెడికల్, బీఆర్ఎస్ జిల్లా నాయకులు ఉప్పల ఆనంద్, కోడి సైదులు, నర్సింగ్ కళాశాల డాక్టర్లు, సిబ్బంది, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
పబ్లిక్ క్లబ్లో విలువిద్య శిక్షణ ప్రారంభం
సూర్యాపేట టౌన్ : సూర్యాపేట పబ్లిక్ క్లబ్ ఆధ్వర్యంలో వేసవి సెలవుల్లో పిల్లలకు విలువిద్య శిక్షణ అందించడం అభినందనీయమని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి అన్నారు. సూర్యాపేట పబ్లిక్ క్లబ్ ఆధ్వర్యంలో స్థానిక పబ్లిక్ క్లబ్ ఆడిటోరియంలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలువిద్య శిక్షణ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించి మాట్లాడారు. విలువిద్య పునాతనమైనదన్నారు. మనిషి తనను తాను రక్షణ, వేటకు విలువిద్యను నేర్చుకునేవాడన్నారు.
మనం ఎంచుకున్న లక్ష్యాన్ని ఎలా గురిపెట్టి సాధించాలో విలువిద్య నేర్పుతుందన్నారు. సూర్యాపేట జిల్లాకు చెందిన పీఈటీలకు విలువిద్యలో శిక్షణ అందించి వారితో అన్ని పాఠశాలల్లోని పిల్లలకు శిక్షణను అందిస్తామన్నారు. తల్లిదండ్రులు తమ పిల్లలకు విలువిద్య నేర్పించడంలో ఆసక్తి కనబర్చాలన్నారు. పబ్లిక్ క్లబ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన విలువిద్య శిక్షణను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అనంతరం మంత్రి జగదీశ్‌రెడ్డి విల్లు ఎక్కుపెట్టి బాణం సంధించారు. కార్యక్రమంలో విలువిద్య జాతీయ క్రీడాకారుడు క్రాంతి, గోల్డ్ మెడలిస్ట్ ప్రసన్న, కోచ్ రవీందర్, పబ్లిక్ క్లబ్ సెక్రటరీ పెద్దిరెడ్డి గణేశ్, ఉపాధ్యక్షులు పెండెం చంద్రశేఖర్, చిలుముల సునీల్‌రెడ్డి, గుండపనేని కిరణ్‌కుమార్, పీఈటీలు వీరయ్య, మల్లేశ్, డేగల కృష్ణ పాల్గొన్నారు.