సూర్యాపేట టౌన్, ఆగస్టు 21 : ప్రతి ఒక్కరూ తాము చేపట్టిన పనిలో నిమగ్నమై విరామం లేకుండా కష్టపడి పనిచేస్తే అద్భుతమైన విజయాలు పొందడం సాధ్యమవుతుందని, మనం ఎంచుకున్న మార్గానికి లక్ష్యం పెద్దదిగా పెట్టుకుంటేనే అనుకున్న ఫలితం సొంతమవుతుందని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌కు కృతజ్ఞతలు తెలిపేందుకు చిన్నారుల నుంచి వృద్ధుల వరకు లక్షలాదిగా తరలివచ్చి ప్రగతి నివేదన సభను విజయవంతం చేసిన సందర్భంగా సోమవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని సుమంగళి ఫంక్షన్ హాల్లో నియోజికవర్గ బీఆర్ఎస్ ప్రజా ప్రతినిధులు, ముఖ్య నేతలతో విస్తృత స్థాయి సమావేశం ఏర్పాటు చేసి అందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. పట్టుదల, ఐక్యతతో కలిసికట్టుగా ప్రతి అడుగు ముందుకు వేస్తూ అభివృద్ధికి చిరునామాగా నిలిచిన బీఆర్ఎస్ పార్టీకి అన్ని ప్రాంతాల్లో మరింత బలాన్ని చేకూర్చాలని పిలుపునిచ్చారు. భయంతో ఏదీ సాధించలేమని, నిరంతర అభివృద్ధి పాలనతోపాటు ప్రేమతో మాత్రమే ప్రజల హృదయాలు గెలుచుకుందామన్నారు.
సూర్యాపేటలో మహిళా చైతన్యం బాగుందని, గత రెండు ఎన్నికల్లో తనను గెలిపించడంలో మహిళలే ముందు వరుసలో ఉన్నారన్నారు. ఇంకా విపక్షాల మాయమాటల వలలో పడి అరాకొరగా ఆయా పార్టీల్లో ఉన్న నాయకులను మార్చే శక్తి మహిళలకే ఉందన్నారు. బీఆర్ఎస్లో కొత్త, పాత తేడా లేకుండా అంతా కలిసికట్టుగా పనిచేసి సూర్యాపేటను మరింత అభివృద్ధి చేసుకుందామన్నారు. సూర్యాపేటలో బీఆర్ఎస్ కార్యకర్తల సమన్వయంతోనే ప్రగతి నివేదన సభ విజయవంతం అయ్యిందని, అందుకు సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞతలు తెలిపేందుకు లక్షలాదిగా ప్రజలు స్వచ్ఛందంగా తరలిరావడమే నిదర్శనమన్నారు. సమావేశంలో బీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి వెంకటేశ్వర్లు, మున్సిపల్ చైర్పర్సన్ పెరుమాళ్ల అన్నపూర్ణ, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ నిమ్మల శ్రీనివాస్‌గౌడ్, జడ్పీ వైస్ చైర్మన్ గోపగాని వెంకటనారాయణ, మున్సిపల్ వైస్‌చైర్మన్ పుట్ట కిశోర్, పట్టణ అధ్యక్ష, కార్యదర్శులు సవరాల సత్యనారాయణ, బూర బాలసైదులు గౌడ్, ఎంపీపీ రవీంద్‌రెడ్డి, జడ్పీటీసీలు జీడి భిక్షం, సంజీవ్‌నాయక్, మండల పార్టీ అధ్యక్షుడు తూడి నర్సింహారావు, వంగాల శ్రీనివాస్‌రెడ్డి, దొంగరి యుగంధర్‌రావు, నాయకులు మారిపెద్ది శ్రీనివాస్‌గౌడ్, గండూరి ప్రకాశ్, కొణతం సత్యనారాయణరెడ్డి, మామిడి అంజయ్యతోపాటు నియోజకవర్గ వ్యాప్తంగా ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
అభివృద్ధి చేసే పార్టీ బీఆర్ఎస్లోకి వలసలు కొనసాగుతున్నాయని మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి పేర్కొన్నారు. సోమవారం సూర్యాపేట మండలం యండ్లపల్లి గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ ఉప సర్పంచ్ యాదగిరిరెడ్డి, 2వ వార్డు సభ్యుడు మారపాక యాదయ్య, నాయకులు నరేశ్, రామారావుతోపాటు సుమారు 50 మంది కార్యకర్తలు జిల్లా కేంద్రంలో మంత్రి సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. వారికి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా మంత్రి జగదీశ్‌రెడ్డి మాట్లాడుతూ.. కొత్త, పాత తేడా లేకుండా కార్యకర్తలంతా కలిసి బీఆర్ఎస్ను మరింత బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు.
సూర్యాపేట, ఆగస్టు 21 (నమస్తే తెలంగాణ) : ‘ఉమ్మడి నల్లగొండ జిల్లాలో బీఆర్ఎస్ పార్టీ బలానికి నిదర్శనం రాబోయే శాసనసభ ఎన్నికలకు గాను ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన అభ్యర్థుల ప్రకటనే. మళ్లీ ఉమ్మడి నల్లగొండలో 12కు 12 అసెంబ్లీ స్థానాల్లో బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించుకొని సీఎం కేసీఆర్‌కు గిఫ్ట్‌గా ఇస్తాం’ అని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి అన్నారు. సూర్యాపేటలో సోమవారం మీడియాతో మంత్రి మాట్లాడుతూ తనకు సూర్యాపేట ఎమ్మెల్యే అభ్యర్థిగా మూడో సారి, ప్రస్తుత శాసనసభ్యులకు మరోసారి అవకాశం కల్పించిన సీఎం కేసీఆర్‌కు, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు ధన్యవాదాలు తెలిపారు. మంత్రిగా అవకాశం పొందడానికి తనకు సహకరిస్తున్న బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలకు ధన్యవాదాలు తెలిపారు. ఉమ్మడి నల్లగండ జిల్లా కేసీఆర్ ఖిల్లా అని, మరోసారి 12 స్థానాల్లో గులాబీ జెండాను ఎగురవేసి ముఖ్యమంత్రి నమ్మకాన్ని నిలబెట్టుకుంటామని అన్నారు. మరోసారి సూర్యాపేట ప్రజలు ఆశీర్వదిస్తే నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి చేసుకుంటూ నందనవనంగా తీర్చిదిద్దడానికి కంకణబద్ధుడనై పనిచేస్తానని చెప్పారు. రాజకీయాల్లో టిక్కెట్లు ఆశించడం తప్పు కాదని, టికెట్ రానివారు నిరాశపడొద్దని సూచించారు. వచ్చిన వారు సహచర నేతలను కలుపుకొని పనిచేసి పార్టీ, నియోజకవర్గ అభివృద్ధికి కృషిచేయాలన్నారు. రాష్ట్రంలో అత్యధికంగా లాభపడింది ఉమ్మడి నల్లగొండ జిల్లా రైతులేనని, అందుకే రైతాంగమంతా సీఎం కేసీఆర్ పాలన పట్ల విశ్వాసంగా ఉన్నారని తెలిపారు. మరోసారి 12కు 12 స్థానాల్లో బీఆర్ఎస్ అభ్యర్థులు గెలిచి ముఖ్యమంత్రి వద్దకు వెళ్తామన్నారు. విలేకరుల సమావేశంలో బీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి వై.వెంకటేశ్వర్లు, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ నిమ్మల శ్రీనివాస్‌గౌడ్, జడ్పీ వైస్ చైర్మన్ గోపగాని వెంకటనారాయణ, సూర్యాపేట మున్సిపల్ చైర్పర్సన్ అన్నపూర్ణ, ఎంపీపీ బీరవోలు రవీందర్‌రెడ్డి, జడ్పీటీసీ జీడి భిక్షం, నాయకులు పాల్గొన్నారు.