దళిత సంఘాల సమావేశాలు, వేడుకల నిర్వహణతో పాటు రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ చరిత్రను భావితరాలకు తెలియజేసే ఉద్దేశంతో సూర్యాపేట పట్టణంలో అంబేద్కర్ విజ్ఞాన కేంద్రం నిర్మించేందుకు రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి శ్రీకారం చుట్టారు. ముత్యాలమ్మ దేవాలయం సమీపంలో 1.11 ఎకరాలు కేటాయించి నిర్మాణానికి రూ.4 కోట్లు విడుదల చేశారు. నిర్మాణ ప్రదేశంలో భారీగా మట్టి తవ్వకం, వ్యయం పెరుగడంతో పనులు నిలిచిపోయాయి. విషయం తెలుసుకున్న మంత్రి జగదీశ్‌రెడ్డి తాజాగా ప్రభుత్వం నుంచి మరో 2.84 కోట్లు మంజూరు చేయించారు. మంత్రికి దళిత సంఘాలనాయకులు కృతజ్ఞతలు తెలుపుతున్నారు.
సూర్యాపేట, జూలై 6 (నమస్తే తెలంగాణ) : జిల్లాలో దళితులు ఆత్మ గౌరవంతో తలెత్తుకుని బతికేలా చేస్తున్నారు రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ఎక్కడా లేని విధంగా సూర్యాపేట జిల్లా కేంద్రంలో అంబేద్కర్ విజ్ఞాన కేంద్రం నిర్మాణం చేసి దళితుల కండ్లల్లో ఆనందం నింపుతున్నారు. రాష్ట్రంలో దళితుల సంక్షేమం, వారి అభివృద్ధే ధ్యేయంగా బీఆర్ఎస్ ప్రభుత్వం ముందుకు సాగుతున్నది. ముఖ్యమంత్రి కేసీఆర్ దళితులకు దళిత బంధు పథకంతో పాటు ఎస్సీ కార్పొరేషన్ రుణాలు, దళితులకు ప్రత్యేక గురుకులాలు ఏర్పాటు చేసి వారిని అన్ని విధాల అభివృద్ధి చేస్తున్నారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదర్శాలను అందిపుచ్చుకున్న మంత్రి జగదీశ్‌రెడ్డి అదేకోవలో ముం దుకు సాగుతున్నారు. ఒక జనరల్ స్థానంలో దళి త మహిళను మున్సిపల్ చైర్‌పర్సన్‌గా చేసి నియోజకవర్గంలోని దళితులకు పెద్దపీఠ వేశారు. అలాగే ఎస్సీ నిరుద్యోగులకు జిల్లా కేంద్రంలో స్టడీ సర్కిల్‌ను ఏర్పాటు చేసి ఉచిత శిక్షణ, భోజన వసతి కల్పిస్తూ వారు ఉద్యోగాలు సాధించేందుకు కృషి చేస్తున్నారు. అలాగే దళితులు ఆత్మ గౌరవంతో తలెత్తుకునేలా, చరిత్రలో నిలిచిపోయేలా సూర్యాపేటలో వారికి ఆత్మగౌరవ భవనం ఉండాలని ఆలోచన చేసిన మంత్రి అంబేద్కర్ విజ్ఞాన కేంద్రానికి అంకురార్పణ చేశారు. జిల్లా కేంద్రంలోని శ్రీనగర్ కాలనీ ముత్యాలమ్మ దేవాలయ సమీపంలో సోషల్ ఫారెస్ట్‌కు చెందిన 1.11 ఎకరాల భూమిలో అంబేద్కర్ విజ్ఞాన కేంద్రం ఏర్పాటుకు మంత్రి గతంలో శంకుస్థాపన చేశారు. రాష్ర్టానికి తలమానికంగా ఈ భవనాన్ని నిర్మించేందుకు రూ.4కోట్లు మంజూరు చేసి పనులను ప్రారంభించారు. నాడు మంజూరు చేసిన నిధులు సరిపోక పోవడంతో పనులు నిలిచిపోయాయి. విషయా న్ని దళిత సంఘాల నాయకులు మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. దీంతో స్పందించిన మంత్రి జగదీశ్‌రెడ్డి భవన నిర్మాణానికి అదనంగా మరో రూ.2.84కోట్లు మంజూరు చేయడంతో దళితులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అంబేద్కర్ విజ్ఞాన కేంద్రం నిర్మాణానికి కంకణబద్దులు కావడం పట్ల దళిత సంఘాల నాయకులు హర్షం వ్యక్తం చేస్తూ మంత్రి జగదీశ్‌రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు.
త్వరితగతిన నిర్మాణం పూర్తి చేయాలి
సూర్యాపేట జిల్లా కేంద్రంలో ఎకరం 11 గుంటల భూమిలో అంబేద్కర్ విజ్ఞాన కేంద్రాన్ని ఏర్పాటు చేయడం మంత్రి జగదీశ్‌రెడ్డికే సాధ్యమైంది. ఈ భవనం కోసం గతంలో రూ.4 కోట్లు మంజూరు చేశారు. నిధులు సరిపోకపోవడంతో నిర్మాణ పనుల్లో కొంత ఆలస్యం జరిగింది. ఇదే విషయాన్ని మంత్రి దృష్టికి తీసుకెళ్లడంతో వెంటనే మరో రూ.3 కోట్లు మంజూరు చేయడం ఆనందంగా ఉంది. అధికారులు ప్రత్యేక దృష్టి సారించి ఈ అదనపు నిధులతో భవనాన్ని త్వరితగతిన పూర్తి చేయాలి.
– చింతలపాటి చిన్నశ్రీరాములు, ఎస్సీ విజిలెన్స్ కమిటీ సభ్యులు, సూర్యాపేట
రాష్ర్టానికే తలమానికంగా..
దళితుల ఆత్మ గౌరవాన్ని నిలబెట్టేలా రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి అంబేద్కర్ విజ్ఞాన కేంద్రం ఏర్పాటుకు పూనుకున్నారు. రాష్ర్టానికే తలమానికంగా రూ.7 కోట్లతో ఈ భవనం రూపుదిద్దుకోవడం ఆనందంగా ఉంది. గతంలో ప్రజా ప్రతినిధులు ఎవరూ ఇలాంటి ఆలోచన చేయలేదు. మొదట వచ్చిన రూ.4 కోట్లతో పనులు పూర్తికాకపోవడంతో మంత్రి స్పందించి అదనపు నిధులు మంజూరు చేయడం ఆనందంగా ఉంది. ఈ భవనం దళిత జాతికే గర్వకారణం.
– తలమల్ల హసేన్, మాలమహానాడు రాష్ట్ర అధ్యక్షుడు, సూర్యాపేట