గత ప్రభుత్వాలు క్రీడలను తీవ్ర నిర్లక్ష్యం చేశాయని, సీఎం కేసీఆర్ విద్యతోపాటు క్రీడలకు ప్రాధాన్యం కల్పించి ప్రోత్సహిస్తున్నారని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి అన్నారు. సూర్యాపేటలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల గ్రౌండ్లో గురువారం 4వ తెలంగాణ రాష్ట్ర స్థాయి ఇంటర్ డిస్ట్రిక్ట్ అండర్ 16 బాల బాలికల బాస్కెట్‌బాల్ చాంపియన్ షిప్ పోటీలను జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ ఆత్మ విశ్వాసం పెంపొందించేందుకు క్రీడలు దోహదం చేస్తాయని, ప్రతి క్రీడాకారుడు ఓటమి నుంచి స్ఫూర్తి పొంది మరో గెలుపునకు నాందిగా ముందుకు సాగాలని సూచించారు.
– బొడ్రాయిబజార్, మే 25
బొడ్రాయిబజార్, మే 25 : ఇటీవలి కాలంలో విద్యార్థుల ఆత్మహత్యలు పెరిగిపోతున్నాయని, అందుకు కారణం వారిలో ఆత్మవిశ్వాసం లోపించడమేనని, అలాంటి వారిలో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించేందుకు క్రీడలు దోహదపడుతాయని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి అన్నారు. సూర్యాపేటలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల ఆవరణలో నిర్వహిస్తున్న 4వ తెలంగాణ రాష్ట్ర స్థాయి ఇంటర్ డిస్ట్రిక్ట్ అండర్-16 బాల, బాలికల బాస్కెట్‌బాల్ చాంపియన్‌షిప్ పోటీలను గురువారం సాయంత్రం ఎంపీ బడుగుల లింగయ్యయాదవ్, ఎమ్మెల్యేలు గాదరి కిశోర్‌కుమార్, బొల్లం మల్లయ్యయాదవ్‌తో కలిసి మంత్రి జ్యోతి ప్రజ్వలన చేసి, క్రీడాజ్యోతిని వెలిగించి ప్రారంభించారు. అంతకుముందు క్రీడాకారుల క్రీడావందనం స్వీకరించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ గత ప్రభుత్వాలు క్రీడలను తీవ్ర నిర్లక్ష్యం చేశాయన్నారు. విద్యార్థుల ఆత్మహత్యలు పెరుగడానికి కార్పొరేట్ కళాశాలలే కారణమని, ఓటమి నుంచి గెలుపునకు నాంది పలుకాలని క్రీడా స్ఫూర్తిని పిల్లల్లో నింపకపోవడమే అందుకు ప్రధాన కారణమని అన్నారు.
తమ కళాశాలలకు ర్యాంకు రావడం కోసం విద్యార్థులకు చదువే పరమావధి అనే భావన కల్పిస్తూ నిరాశకు గురిచేయడంతో వారిలో ఆత్మవిశ్వాసం లోపించి అఘాయిత్యాలకు పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దాన్నుంచి బయట పడేందుకు వారిలో ఆత్మ విశ్వాసాన్ని పెంచేందుకు క్రీడా పోటీలు ఉపయోగపడుతాయని తెలిపారు. ఆట ఆడేటప్పుడు ప్రత్యర్థిపై ఎలాంటి మెళకువలు ప్రదర్శిస్తామో అలాంటి మెళకువలను జీవితంలో అన్ని రంగాల్లో ప్రదర్శిస్తే విజయం వరిస్తుందని చెప్పారు. నాణ్యమైన విద్య అందించాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి కేసీఆర్ గురుకుల పాఠశాలలు, కళాశాలలను ఏర్పాటు చేశారన్నారు. అదే రీతిలో రెండింటికీ సమ ప్రాధాన్యమిస్తూ క్రీడాభివృద్ధికి కృషి చేస్తున్నారని తెలిపారు. ప్రతి క్రీడాకారుడు ఓటమి నుంచి పాఠం నేర్చుకొని విజయానికి నాంది పలికేలా క్రీడాస్ఫూర్తిని పెంపొందించుకోవాలని సూచించారు. కార్యక్రమంలో జిల్లా అడిషనల్ కలెక్టర్ పాటిల్ హేమంత్ కేశవ్, బాస్కెట్ బాల్ అసోసియేషన్ రాష్ట్ర చైర్మన్ రావుల శ్రీధర్‌రెడ్డి, జిల్లా ఉపాధ్యక్షుడు పుట్ట కిశోర్, జిల్లా కార్యదర్శి ఫారూఖ్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ నిమ్మల శ్రీనివాస్‌గౌడ్, మున్సిపల్ చైర్పర్సన్ పెరుమాళ్ల అన్నపూర్ణ, డీఎస్పీ నాగభూషణం, రైతుబంధు సమితి జిల్లా అధ్యక్షుడు రజాక్, కౌన్సిలర్ తాహెర్పాషా పాల్గొన్నారు.
క్రీడారంగాన్ని చేస్తున్న సీఎం కేసీఆర్
రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్యయాదవ్
సంపన్నుల ఆటగా పేరుగాంచిన బాస్కెట్‌బాల్ పోటీలను మంత్రి జగదీశ్‌రెడ్డి సహకారంతో సూర్యాపేటలో ఏర్పాటు చేశారని రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్యయాదవ్ అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ అన్ని రంగాలతో సమానంగా క్రీడారంగాన్ని అభివృద్ధి చేస్తున్నారని తెలిపారు. గత ప్రభుత్వాలు విద్య, సంక్షేమాన్ని, క్రీడలను నిర్లక్ష్యం చేశాయని విమర్శించారు. సీఎం కేసీఆర్ పేద విద్యార్థుల కోసం గురుకులాలు ఏర్పాటు చేసి నాణ్యమైన విద్య అందిస్తే ర్యాంకులన్నీ వారికే వస్తున్నాయన్నారు. గ్రామీణ ప్రాంతాల్లోని మట్టిలోని మణిక్యాలను వెలికి తీసేందుకు క్రీడా పోటీలు దోహదపడుతాయని తెలిపారు. క్రీడాకారులు ఇలాంటి పోటీలను సద్వినియోగం చేసుకొని జాతీయ స్థాయిలో రాణించాలని ఆకాంక్షించారు.
మనిషికి గౌరవం, గుర్తింపు తీసుకొచ్చేవి క్రీడలు
ఎమ్మెల్యేలు గాదరి కిశోర్, బొల్లం మల్లయ్యయాదవ్
సమాజంలో మనిషికి గౌరవం, గుర్తింపు తీసుకొచ్చేవి క్రీడలు మాత్రమేనని జిల్లా బాస్కెట్‌బాల్ అసోసియేషన్ అధ్యక్షుడు, తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిశోర్‌కుమార్, కోదాడ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్యయాదవ్ అన్నారు. పుట్టిన ఊరుకు దేశానికి పేరు ప్రతిష్టలు తేవాలంటే క్రీడలతోనే సాధ్యమవుతుందన్నారు. ప్రతి విద్యార్థి చదువుపై ఎంత ఆసక్తి కనబరుస్తారో.. క్రీడలపైనా అంతే ఆసక్తి పెంచుకోవాలని సూచించారు. ప్రతి ఒక్కరూ తాము ఎంచుకున్న క్రీడల్లో రాణించి పుట్టిన ఊరుకు, దేశానికి పేరు తేవాలన్నారు.
మొదటి రోజు విజేతలు వీరే..
రాష్ట్ర స్థాయి బాస్కెట్‌బాల్ యూత్ చాంపియన్‌షిప్‌లో మొదటి రోజు పోటీలు హోరాహోరీగా సాగాయి. బాలుర విభాగంలో మహబూబ్‌నగర్ జిల్లా జట్టుపై హైదరాబాద్, మహబూబాబాద్‌పై నల్లగొండ, కరీంనగర్‌పై ములుగు, హనుమకొండపై వికారాబాద్, నల్లగొండపై రంగారెడ్డి, ఖమ్మంపై మేడ్చల్ మల్కాజ్గిరి, నిజామాబాద్‌పై కరీంనగర్, జగిత్యాలపై వికారాబాద్ జిల్లా జట్టు విజయం సాధించాయి. బాలికల విభాగంలో నల్లగొండపై మహబూబ్‌నగర్, మహబూబాబాద్‌పై నిర్మల్, ఖమ్మంపై మేడ్చల్ మల్కాజ్గిరి, కరీంనగర్‌పై ములుగు, హనుమకొండపై వికారాబాద్, నల్లగొండపై రంగారెడ్డి, మహబూబాబాద్‌పై హైదరాబాద్, కరీంనగర్‌పై సూర్యాపేట, జగిత్యాలపై వికారాబాద్ జిల్లా జట్లు గెలుపొందాయి.