2014కు ముందు సూర్యాపేట ఎట్లుందో, ఇప్పుడెట్లయ్యిందో ప్రజలు కండ్లారా చూస్తున్నారని, చెప్పిన దానికంటే ఎక్కువే అభివృద్ధి చేశామని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి, బీఆర్ఎస్ సూర్యాపేట ఎమ్మెల్యే అభ్యర్థి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి అన్నారు. ఎన్నికల ముందు సీఎం కేసీఆర్ రూపొందించిన మ్యానిఫెస్టోతోపాటు తాను సూర్యాపేట కోసం ప్రత్యేకంగా తయారు చేసిన మ్యానిఫెస్టోలోని హామీలన్నీ అమలు చేశామని తెలిపారు. ఎన్నో ఏండ్లు పాలించిన కాంగ్రెస్‌తోపాటు బీజేపీ నాయకులు ఇక్కడ చేసిన అభివృద్ధి ఏమన్నా కనపడుతున్నదో.. ఆ పార్టీలు కొత్తగా ఇచ్చే హామీలు నెరవేరుతాయన్న నమ్మకం ఉందో.. ప్రజలు ఆలోచించాలన్నారు. సూర్యాపేటలో శనివారం చేపట్టిన భారీ రోడ్‌షోలో మంత్రి ప్రసంగించారు. సిండికేట్ దందాలు, రౌడీ రాజకీయాలను రూపుమాపి ప్రశాంత వాతావరణాన్ని ఏర్పరుచుకున్నామని, మరోమారు అరాచక శక్తులు వస్తున్నాయని, వారికి ఓటుతో బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు.
సూర్యాపేట టౌన్, నవంబర్ 25 : ఉమ్మడి పాలనలో అన్ని విధాలుగా ఆగమైన సూర్యాపేట.. 2014లో ఓట్లేయ్యక ముందు ఎట్ల ఉన్నదో.. బీఆర్ఎస్ పార్టీకి ఓట్లేసి గెలిపించినంక ఎంతటి అభివృద్ధి చెందిందో ప్రజలంతా కండ్లారా చూస్తున్నారని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి, బీఆర్ఎస్ సూర్యాపేట ఎమ్మెల్యే అభ్యర్థి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి అన్నారు. ఎన్నికల ముందు సీఎం కేసీఆర్ రూపొందించిన మ్యానిఫెస్టోతో పాటు తాను సూర్యాపేట కోసం ప్రత్యేకంగా ఇచ్చిన మ్యానిఫెస్టోలోని హామీలన్నీ అభివృద్ధి రూపంలో కనిపిస్తున్నాయని పేర్కొన్నారు. ఎన్నో ఏండ్లు పాలించిన కాంగ్రెస్‌తోపాటు బీజేపీ నాయకులు ఇక్కడి ప్రాంతాలకు చేసిన అభివృద్ధి ఏమన్నా కనబడుతున్నదా.. అటువంటి పార్టీలు కొత్తగా ఇచ్చే హామీలు నెరవేరుతాయన్న నమ్మకముందా? అని ప్రశ్నించారు.
ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు నీచ రాజకీయాలకు పాల్పడుతున్న కాంగ్రెస్, బీజేపీ, ఇతర పార్టీలకు ఓటుతో తగిన బుద్ధి చెప్పి.. నిరంతర అభివృద్ధి పాలన కొనసాగిస్తున్న బీఆర్ఎస్ పార్టీని మరోసారి ఆశీర్వదించాలని కోరారు. సూర్యాపేటలో శనివారం తెల్లవారుజామున మంత్రి జగదీశ్‌రెడ్డి పారిశుధ్య కార్మికులు, మార్నింగ్ వాకర్స్‌తో మాటామంతి నిర్వహించారు. బీఆర్ఎస్కు మద్దతు ప్రకటించేందుకు ఏర్పాటు చేసుకున్న దివ్యాంగుల ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్నారు. అనంతరం పట్టణలో భారీ రోడ్ షో నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి జగదీశ్‌రెడ్డి మాట్లాడుతూ 2014, 2018లో బీఆర్ఎస్ పార్టీకి మీరు వేసిన ఓటు వల్లే రూ.200 పింఛన్ రూ.2వేలు అయ్యిందని, రేపు రూ.5వేలకు పెంచుతామని చెప్పారు. రూ.500 ఉన్న దివ్యాంగుల పింఛన్ రూ.3వేలు చేశామని, దాన్ని 6వేల రూపాయలకు పెంచుతామని హామీ ఇచ్చారు. అడగకుండానే ఆడబిడ్డ పెళ్లికి కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పేరిట మొదట రూ.50 వేలు అందించి లక్ష పదహార్లకు పెంచామన్నారు.
రైతుబీమా తరహాలో కేసీఆర్ బీమా పేరుతో అర్హులైన ప్రతి ఒక్కరికీ రూ.5లక్షల సాధారణ ఇన్సూరెన్స్ సదుపాయం కల్పిస్తున్నట్లు తెలిపారు. రేషన్ కార్డుదారులకు సన్న బియ్యం అందిస్తామని, సౌభాగ్యలక్ష్మి పేరిట అర్హులైన మహిళలకు నెలకు రూ.3వేల గౌరవ వేతనం ఇస్తామని చెప్పారు. రైతుబంధు రూ.10 వేల నుంచి రూ.16 వేలకు పెంపు, రూ.400కే గ్యాస్ సిలిండర్ వంటి అనేక హామీలను సీఎం కేసీఆర్ ప్రకటించారని తెలిపారు. సూర్యాపేటకు స్వతహాగా మ్యానిఫెస్టో విడుదల చేయనున్నట్లు చెప్పారు. కనీసం 3వేల మందికి ఉద్యోగ అవకాశాలు లభించేలా ఐటీ హబ్‌ను విస్తరిస్తామన్నారు. ఇండస్ట్రియల్ పార్కు, డ్రై పోర్ట్‌లు ఏర్పాటు చేసి వేలాది మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించనున్నట్లు తెలిపారు. 2014లో సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీల కంటే ఎక్కువే అభివృద్ధి జరిగిందని, అదే తరహాలో సూర్యాపేటలో ఇచ్చిన హామీల కంటే అదనంగా చేశామని చెప్పారు. 2014కు ముందు ఉన్న సిండికేట్ దందాలు, రౌడీ రాజకీయాలను మార్చి ప్రశాంత వాతావరణాన్ని పెంచుకున్నామన్నారు.
ఒక్క చాన్స్ ఇవ్వాలని తిరుగుతున్న అభివృద్ధి నిరోధకులకు తగిన బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. అన్ని రంగాల అభివృద్ధితో సూర్యాపేటను సుందర పట్టణంగా తీర్చిదిద్ది.. పదేండ్ల పాలనలోనే వందేండ్ల అభివృద్ధితో తెలంగాణను యావత్ దేశానికే ఆదర్శంగా నిలిపిన బీఆర్ఎస్ పార్టీకి ఓటేసి మరోసారి ఆశీర్వదించాలని కోరారు. ప్రచారం నిర్వహిస్తున్న సమయంలో ప్రజలంతా మద్దతు ప్రకటించి బ్రహ్మరథం పట్టారు. వేలాదిగా వచ్చిన దివ్యాంగులు ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేసుకుని పూర్తి మద్దతు ప్రకటించారు.
రోడ్ షోలో వాడవాడలా మహిళలు మంగళ హారతులతో ఘన స్వాగతం పలికారు. కార్యక్రమాల్లో రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్యయాదవ్, బీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి వై.వెంకటేశ్వర్లు, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ నిమ్మల శ్రీనివాస్ గౌడ్, జడ్పీ వైస్ చైర్మన్ గోపగాని వెంకటనారాయణ గౌడ్, మున్సిపల్ చైర్పర్సన్ పెరుమాళ్ల అన్నపూర్ణ, పార్టీ నాయకులు డాక్టర్ రామ్మూర్తి యాదవ్, బండారు ధనుంజయ్‌గౌడ్, గండూరి ప్రకాశ్, షేక్ నయీమ్, మల్లారెడ్డి, రాజేశ్, కౌన్సిలర్లు పాల్గొన్నారు.