– చండూరు మండల వీఓఏల అధ్యక్షుడు పర్సనబోయిన యాదగిరి
చండూరు, మే 25 : వీఓఏలకు రూ.20 వేల కనీస వేతనం కల్పించాలని వీఓఏల సంఘం చండూరు మండల అధ్యక్షుడు పర్సనబోయిన యాదగిరి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. దీర్ఘకాలికంగా పెండింగ్లో ఉన్న తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ మోకాళ్లపై నిలబడి సోమవారం మండల కేంద్రంలోని తాసీల్దార్ కార్యాలయం ముందు 19 గ్రామ పంచాయతీలకు చెందిన వీఓఏలు గత ఎనిమిది రోజులుగా శాంతియుతంగా నిరవధిక సమ్మె నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రామాల్లో వీఓఏలకు పని ఒత్తిడి అధికమవుతున్న నేపథ్యంలో కనీస వేతనం రూ.20 వేలు ఇవ్వాలన్నారు. అదేవిధంగా వీఓఏలను సెర్ప్ ఉద్యోగులుగా గుర్తించి హెచ్ఆర్ పాలసీ అమలు చేయాలన్నారు.
అర్హులైన వీఓలనుకు సీసీలుగా పదోన్నతి కల్పించాలని పేర్కొన్నారు. వీఓఏలకు సామాజిక ఆరోగ్య బీమా సౌకర్యం కల్పించాలన్నారు. అదేవిధంగా తమ మొబైల్ ఫోన్లలో డేటా ఎంట్రీ చేయాలంటే ఇబ్బందిగా ఉంటుందని కావున ట్యాబ్ సౌకర్యం కల్పించాలని కోరారు. అలాగే జీవో నెంబర్ 58 ను సవరించాలని, ఇంకా పెండింగ్లో ఉన్న సమస్యలను పరిష్కరించాలని ఈ సందర్భంగా ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో చండూరు మండల వీఓఏల సంఘం కార్యదర్శి అహల్య, కోశాధికారి లలిత, వీఓఏలు శశికళ, రాణి, కవిత, లింగయ్య, సులోచన, నాగమణి, విజయలక్ష్మి, నిర్మల, అరుణ, యాదమ్మ, కరుణ, కల్పన, అమృత, అరుణ, రేణుక, వెంకటమ్మ, అనిత పాల్గొన్నారు.