రామగిరి, మార్చి 28 : రైతులు పండించిన పంటలకు కేంద్ర ప్రభుత్వం మద్దతు ధరల చట్టం చేయాలని, అన్ని రకాల వడ్లను రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధరకు కొనుగోలు చేసి వెంటనే బోనస్ చెల్లించాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు, మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి డిమాండ్ చేశారు. శుక్రవారం నాడు ప్రజా సమస్యలను పరిష్కరించాలని కోరుతూ జిల్లా కలెక్టరేట్ ముందు ధర్నా నిర్వహించారు. ముఖ్య అతిధిగా పాల్గొన్న ఆయన మాట్లాడుతూ… వ్యవసాయోత్పత్తులకు కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధరలు రైతాంగ ఆత్మస్థైర్యాన్ని కుంగతీసే విధంగా ఉందని విమర్శించారు. వ్యవసాయోత్పత్తులకు మద్దతు ధరలు పెంచాలని రైతాంగం పెద్ద ఎత్తున చేస్తున్న ఉద్యమాలకు ప్రజలు మద్దతు పలకాలని కోరారు. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన కనీస మధ్దతు ధరలు పుండు మీద కారం చల్లినట్టుగా ఉందన్నారు. ప్రకృతి ఒకవైపు నుండి, పాలకులు ఇంకోవైపు నుండి మార్కెట్ శక్తులు ఇంకొక వైపు నుండి రైతాంగ మూలుగను పీల్చి పిప్పి చేయడానికి పూనుకున్నట్లు విమర్శించారు.
ఎన్నికలకు ముందు వ్యవసాయ ఉత్పత్తులకు స్వామినాథన్ కమిషన్ సిఫార్సుల ప్రకారం మద్దతు ధరలు నిర్ణయించి అమలు చేస్తామన్న మోడీ గారి మాటలు నీటి మూటలయ్యాయని ఎద్దేవా చేశారు. ఉత్పత్తి ఖర్చులకు 50 శాతం కలిపి మద్దతు ధరలు నిర్ణయించాలన్న ప్రతిపాదనను తుంగలో తొక్కి ఉత్పత్తి ఖర్చులకే 21 శాతం తగ్గించి ఎంఎస్పిని నిర్ణయించడంతో రైతాంగం దిగ్బ్రాంతికి గురైందని ఆందోళన వ్యక్తం చేశారు. ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంభాల గురించి కేంద్ర ప్రభుత్వం ప్రస్తావించలేదన్నారు. ఇలాంటి నిర్ణయాలకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున రైతాంగం ఉద్యమించాలని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా రైతు భరోసా నిధులను సాగుచేస్తున్న రైతులందరికి విడుదల చేయాలన్నారు. రూ.2 లక్షల రుణమాఫీని మిగిలిన వారందరికి అమలు చేయాలన్నారు. రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారంటీ పథకాలను ఖచ్చితంగా అమలు చేయాలని, లేనిఎడల ప్రజలు పెద్దఎత్తున ఉద్యమించాలన్నారు. శ్రీశైలం సొరంగం మార్గంలో మృతి చెందిన కుటుంభాలకు ప్రభుత్వం రూ.2 కోట్లు ఎక్స్‌గ్రేషియా చెల్లించి, కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలన్నారు. ఎండాకాలం దృష్టిలో ఉంచుకుని తాగునీటి రిజర్వాయర్లలో నీరు స్టోరేజ్ చేయాలని అన్నారు.
సిపిఎం జిల్లా కార్యదర్శి తుమ్మల వీరారెడ్డి మాట్లాడుతూ.. ప్రభుత్వం ప్రకటించిన రేషన్‌కార్డులు, పించన్లు, ఇందిరమ్మ ఇండ్లు ఎప్పటి వరకు ఇస్తారో నిర్ధిష్టమైన కాలపరిమితి ప్రకటించాలన్నారు. మహిళలకు మహాలక్ష్మి పథకం, కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పెండింగ్‌లో ఉన్నాయన్నారు. ఎండిపోయిన పంటలను పరిశీలించి ప్రభుత్వం నష్టపరిహారం చెల్లించాలని, ధాన్యం కేంద్రాలను ప్రారంభించాలన్నారు. గ్రామీణ అంతర్గత రోడ్ల నిర్మాణం, జాతీయ రహదారుల వెంట సర్వీస్ రోడ్లను వేయాలన్నారు. సీసీ రోడ్లు, మురుగు కాల్వల నిర్మాణం చేపట్టాలన్నారు. ప్రభుత్వం ఆధాయం రాబట్టేందుకు ఎల్ఆర్ఎస్ పథకం పెట్టిందని దుయ్యబట్టారు. డబుల్ బెడ్రూమ్ ఇండ్లను గుర్తించిన లబ్ధిదారులకు వెంటనే అందించాలన్నారు.
పాలడుగు నాగార్జున అధ్యక్షత జరిగిన ఈ కార్యక్రమంలో సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు ముదిరెడ్డి సుధాకర్‌రెడ్డి, నారి అయిలయ్య, జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు బండ శ్రీశైలం, సయ్యద్ హాషం, పాలడుగు ప్రభావతి, సిహెచ్ లక్ష్మినారాయణ, వి. వెంకటేశ్వర్లు జిల్లా నాయకులు గంజి మురళీదర్, పి.నర్సిరెడ్డి, మల్లం మహేశ్, దండెంపల్లి సత్తయ్య, రవి, శశిధర్‌రెడ్డి, వినోద్, శ్రీను, సరోజ, అనురాధ, శంకర్, చంద్రమౌళి, ఆనంద్, నగేశ్, వెంకులు, వెంకన్న, సైదులు, బయ్యన్నపాల్గొన్నారు.