సూర్యాపేట నియోజకవర్గం పరిధిలోని ఓ గ్రామంలో మినరల్ వాటర్ ప్లాంట్ పాడైతే అధికారులెవరూ పట్టించుకోలేదు. తాగునీటి కోసం గ్రామస్తులు గగ్గోలు పెడితే సమస్య వెంటనే పరిష్కారం కావాలని ఆ గ్రామపంచాయతీ కార్యదర్శికి పైనుంచి బెదిరింపులు.. ఆదేశాలు వచ్చాయి. తట్టుకోలేక తన భార్య పుస్తెల తాడు తాకట్టు పెట్టి సుమారు రూ.45వేలతో మరమ్మతులు చేయించాడు. ఇది జరిగి ఐదారు నెలలు అవుతున్నా.. ఇప్పటికీ బిల్లు రాలేదు. ప్రభుత్వం కల్పించిన బదిలీ అవకాశంలో ఆయన మరో చోటుకు వెళితే చేసిన అప్పులు ఎవరు ఇస్తారు? పుస్తెల తాడు కోసం భార్య చేస్తున్న గొడవను ఎవరు తీర్చుతారనేది ప్రశ్నార్థకంగా మారింది. ఇలా అప్పులు చేసి తిప్పలు పడుతున్న పంచాయతీ సెక్రెటరీల పరిస్థితి జిల్లాలో అనేకం.
రాష్ట్ర ప్రభుత్వం కల్పించిన బదిలీల అవకాశంతో ఎప్పటి నుంచో ట్రాన్స్ఫర్ కావాలనుకుంటున్న పంచాయతీ కార్యదర్శులు ఓ పక్క సంతోషంగా ఉండగా.. ఆయా గ్రామాల్లో సమస్యల పరిష్కారం కోసం సొంతంగా చేసిన అప్పులు ఎప్పుడు, ఎవరు ఇస్తారో తెలియని దుస్థితి నెలకొంది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి సెంట్రల్, స్టేట్ నిధులు రాలేదు. దీంతో సర్పంచుల కాలపరిమితి ముగిసిన నాటి నుంచి గ్రామాల్లో నెలకొన్న తాగునీరు, పారిశుధ్యం తదితర సమస్యలను వెంటనే పరిష్కరించాలి. లేదంటే చర్యలు తప్పవంటూ పై అధికారుల నుంచి బెదిరింపులు.. హెచ్చరికలు వస్తుంటే తట్టుకోలేక అప్పులు చేయాల్సి వచ్చిందని పలువురు పంచాయతీ సెక్రెటరీలు చెబుతున్నారు.
ఇప్పటికే మాజీ సర్పంచులకు ఇవ్వాల్సిన బిల్లులు ఇవ్వకపోవడంతో ఆందోళనలు చేస్తుండగా.. గ్రామ పంచాయతీ అవసరాల నిమిత్తం రూ.50వేల నుంచి 3లక్షల రూపాయల వరకు సెక్రెటరీలు అప్పులు చేసి పనులు చేశారు. ఇప్పుడు తాము బదిలీపై వెళ్తే ఆ డబ్బులు ఎలా అని మనోవేదనకు గురవుతున్నారు.
పల్లెలే ప్రగతికి సోపానాలు. అవి బాగుపడితేనే దేశం బాగుపడుతుందని నమ్మిన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తన తొమ్మిదిన్నరేండ్ల పాలనలో వ్యవసాయం మొదలుకుంటే అనుబంధ వృత్తులకు ఊతం ఇచ్చేలా వేల కోట్లు వెచ్చించారు. కేంద్రం నుంచి గ్రామపంచాయతీలకు నిధులు వచ్చినా, రాకున్నా నెలనెలా కోట్లాది రూ పాయలు వెచ్చించి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు.
ఫలితంగా పల్లెలు ఆహ్లాదకరంగా రూపుదిద్దుకున్నాయి.అయితే.. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ఆరు నెలలుగా పల్లెలకు అటు కేంద్రం గానీ, ఇటు రాష్ట్ర ప్రభుత్వం గానీ నయాపైసా విదిల్చలేదు. ఫిబ్రవరి నుంచి సర్పంచులు పోయి ప్రత్యేక అధికారుల పాలన వచ్చింది కానీ.. పనులు చేపట్టేందుకు నిధులు రావడం లేదు. దీంతో బీఆర్ఎస్ హయాంలో వచ్చిన నిధులతో ముమ్మరంగా పనులు చేయించిన పంచాయతీ కార్యదర్శులు.. ఇప్పుడు చిన్న చిన్న పనులు కూడా చేయలేని పరిస్థితి నెలకొంది.
సర్పంచుల పదవీ కాలం పూర్తయిన తరువాత పల్లెల్లో నెలకొన్న సమస్యలను పరిష్కరించాల్సిన బాధ్యత పంచాయతీ కార్యదర్శులపై పడింది. గ్రామాల్లో తరచూ తాగునీటి బోర్లు కాలిపోవడం, పైపులైన్ల మరమ్మతులు, గేట్‌వాల్వ్ మార్చడం, పారిశుధ్య పనులు, వాటర్ ప్లాంట్ల మరమ్మతులు ఇలా అనేక పనులు చేయాల్సి వస్తుంది. ప్రభుత్వం స్పెషల్ ఆఫీసర్లను నియమించి చేతులు దులుపుకున్నది. పంచాయతీలకు మాత్రం నయాపైసా ఇవ్వడం లేదు. దీంతో సమస్యలపై ప్రజల నుంచి ఒత్తిడి పెరుగడం, కలెక్టర్‌కు ఫిర్యాదులు వెల్లువెత్తుతుండడంతో వెంటనే సమస్యను పరిష్కరించాలి.. నిధులు తరువాత పంపిస్తామంటూ అధికారులు పంచాయతీ సెక్రెటరీలకు ఆదేశాలు జారీ చేశారు.
ఈ క్రమంలో సెక్రటరీలు తమకు వచ్చే వేతనాలతోపాటు ఇతరుల నుంచి అప్పులు చేసి పనులు చేస్తూ వస్తున్నారు. ఇలా ఆయా పంచాయతీల్లో సెక్రెటరీలు చేసిన అప్పులు చిన్న, పెద్ద పంచాయతీల్లో రూ.50 వేల నుంచి రూ.3లక్షల వరకు జిల్లా వ్యాప్తంగా రూ.50లక్షలకు పైగా ఉన్నట్లు సమాచారం. అయితే.. ప్రభుత్వం ఇటీవల ఉద్యోగుల బదిలీలకు జీఓ తీసుకురావడంతో ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న పంచాయతీ సెక్రటరీలు తమ అర్హతను బట్టి ఎక్కడికి వెళ్లాలో వెతుక్కునే పనిలో పడ్డారు. మరోపక్క బదిలీ అయితే తాము చేసిన అప్పులు ఎప్పుడు వస్తాయో తెలియని పరిస్థితి నెలకొందని పలువురు సెక్రెటరీలు మదన పడుతున్నారు.
రెండు నెలల క్రితం డిస్ట్రిక్ మినరల్ ఫండ్ నుంచి నిధులు ఇస్తామని అధికారులు నమ్మబలికారని, దీంతో ఎక్కడా పెండింగ్ లేకుండా పనులు చేయగా ఇప్పటి వరకు అతీగతీ లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తక్షణమే ఏదో ఒక నిధులతో తమ బాకీలు తీర్చాలని వేడుకుంటున్నారు. ఫిబ్రవరిలో పదవీ కాలం పూర్తయినప్పటికీ లక్షల్లో బాకీలు ఉన్న సర్పంచులు ప్రభుత్వం చుట్టూ తిరుగుతున్నా బిల్లులు ఇవ్వకపోగా నేడు సెక్రెటరీలకు ఇస్తారా? అనేది ప్రశ్నార్థకంగా మారింది. పంచాయతీ కార్యదర్శులు డబ్బులు వెచ్చించి పనులు చేసింది వాస్తవమేనని జిల్లా పంచాయతీ అధికారి సురేశ్‌కుమార్ అన్నారు. వారి డబ్బులు ఎక్కడికీ పోవని, చేసిన పనులకు సంబంధించి బిల్లులు చేసి సబ్మిట్ చేస్తే వస్తాయని చెప్తున్నారు.