పెన్పహాడ్, మే 20 : కొనుగోలు కేంద్రాల నుంచి వచ్చిన ధాన్యం బస్తాలను మిల్లర్లు వేగంగా దిగుమతి చేసుకోవాలని సూర్యాపేట జిల్లా కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్ అన్నారు. మంగళవారం పెన్పహాడ్ మండల పరిధిలోని మాచారం గ్రామంలోని శ్రీ వెంకటసాయి రైస్ మిల్ను ఆయన ఆకస్మిక తనిఖీ చేశారు. మిల్లులకు తరలించిన లారీలకు హమాలీల కొరత తలెత్తకుండా అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. అధికారులు మిల్లుల వద్ద సకాలంలో ధాన్యం నిల్వలను దిగుమతి చేసుకునేలా పకడ్బందీగా పర్యవేక్షణ చేయాలన్నారు.
వెంకట సాయి మిల్లు సామర్ధ్యంను జిల్లా సివిల్ సప్లయ్ అధికారి ప్రసాద్ ను అడిగి తెలుసుకున్నారు. మండలంలోని కొనుగోలు కేంద్రాల్లో ఉన్న ధాన్యం మొత్తాన్ని వెంకట సాయి మిల్లు కు టాగింగ్ చేయించి ధాన్యం కొనుగోళ్లను రెండు మూడు రోజుల్లో పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో డీఎం.ప్రసాద్, తాసీల్దార్ లాలు నాయక్, ఏపీఎం అజయ్ నాయక్ పాల్గొన్నారు.