కొంతమంది మిల్లర్ల అక్రమాల ఫలితం ఈ సీజన్లో రైతుల నుంచి కొనుగోలు చేసిన ధాన్యం సీఎంఆర్ కోసం పక్క జిల్లాలకు తరలాల్సిన దుస్థితి ఏర్పడింది. సూర్యాపేట జిల్లాలో సుమారు 90 మిల్లులు ఉండగా వందల కోట్ల రూపాయల ధాన్యం మాయం చేసిన 8 మిల్లులపై కేసులు నమోదు చేసి సీజ్ చేయగా మరో 23 మిల్లులు డీఫాల్ట్ కావడంతో మిగిలిన మిల్లులకు మాత్రమే సీఎంఆర్ ధాన్యం ఇస్తున్నారు. ఇప్పటికే జిల్లాలోని కొనుగోలు కేంద్రాల నుంచి జనగాం, యాదాద్రిభువనగిరి, వరంగల్ జిల్లాలకు దాదాపు 35వేల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని తరలించారు. ఇంకా కొంత ధాన్యాన్ని తరలించనున్నట్లు అధికారుల ద్వారా తెలిసింది.
రైతులు పండించిన ధాన్యాన్ని ప్రభుత్వం గ్రామాల వారీగా కేంద్రాలు ఏర్పాటు కొనుగోలు చేస్తుంది. ఆ ధాన్యాన్ని మిల్లింగ్ కోసం జిల్లా వ్యాప్తంగా ఉన్న మిల్లులకు కేటాయించడం సాధారణమే. మిల్లులకు ఇచ్చే ధాన్యాన్ని మిల్లింగ్ చేసిన అనంతరం తిరిగి బియ్యం తీసుకుంటారు. గతంలో జిల్లాలో కొంతమంది మిల్లర్లు, అధికారులు కుమ్మక్కై కొనుగోలు కేంద్రాల ద్వారా సేకరించిన ధాన్యాన్ని పక్కదారి పట్టించారు. ఆయా మిల్లులు రేయింబవళ్లు నడుస్తూ నెలనెలా లక్షలాది రూపాయల విద్యుత్ బిల్లులు ప్రభుత్వానికి చెల్లించగా బియ్యం మాత్రం సర్కారు ఇవ్వలేదు. ఆ బియ్యాన్ని బహిరంగ మార్కెట్లో విక్రయించుకున్నట్లు నిర్ధారణ అయింది. కేవలం ఎనిమిది మిల్లుల్లోనే దాదాపు రూ.600 కోట్ల విలువ చేసే ధాన్యం కుంభకోణానికి పాల్పడగా మరికొన్ని మిల్లులు కలిపి దాదాపు మరో రూ.300 కోట్ల వరకు ధాన్యం పక్కదారి పట్టినట్లు సమాచారం. ఇలా అక్రమార్కులు సూర్యాపేట జిల్లా పరువును బజారుకీడ్చారు.
మిల్లర్లు, అధికారుల పాపాలు.. జిల్లాకు శాపం
కొంతమంది మిల్లర్లు, అధికారులు చేసిన పాపాలు జిల్లాకు శాపంగా పరిణమించాయి. గతంలో సూర్యాపేట జిల్లాలో పండిన పంటలను ఇక్కడే మిల్లింగ్ చేయగా ప్రస్తుతం ఆ పరిస్థితి లేకుండా పోయింది. అక్రమాలకు పాల్పడిన మిల్లులు సీజ్ కావడం, డీఫాల్ట్ కావడంతో ధాన్యాన్ని ఇతర జిల్లాలకు తరలించాల్సిన దుస్థితి దాపురించింది. సూర్యాపేట జిల్లాలో సుమారు 80 మిల్లులు ఉండగా వీటిలో రూ.600 కోట్ల విలువ చేసే ధాన్యాన్ని పక్కదారి పట్టించిన ఎనిమిది మిల్లులతో పాటు డీఫాల్ట్ అయిన మరో 23 మిల్లులకు ఈ సీజన్లో ధాన్యం ఇవ్వడం లేదు. మిగిలిన మిల్లులకు ఆయా మిల్లుల సామర్థ్యాన్ని బట్టి ధాన్యం కేటాయించారు. అక్రమాలకు పాల్పడింది భారీ మిల్లులు కావడం, వారికి సీఎంఆర్ ధాన్యం ఇవ్వకపోవడంతో ఈ సీజన్లో ఇతర జిల్లాలకు తరలిస్తున్నారు. ఇప్పటి వరకు జిల్లాలో కొనుగోలు చేసిన ధాన్యంలో జనగాం జిల్లాకు 25వేల మెట్రిక్ టన్నులు, యాదాద్రిభువనగిరి, వరంగల్ జిల్లాలకు కలిపి 10వేల మెట్రిక్ టన్నుల ధాన్యం తరలించినట్లు తెలిసింది.
డీఫాల్ట్ లేకుంటే ధాన్యం జిల్లాకు సరిపోయేది
జిల్లాలో కొన్ని మిల్లులు సీజ్ చేయడం, మరికొన్ని డీఫాల్ట్ కావడంతో ఆయా మిల్లులకు సీఎంఆర్ ధాన్యం ఇవ్వడం లేదు. వాస్తవానికి అన్ని మిల్లులకు ధాన్యం ఇచ్చే అవకాశం ఉంటే ఇక్కడి ధాన్యం ఇక్కడి మిల్లులకు సరిపోయేది. కానీ తప్పని పరిస్థితుల్లో ధాన్యాన్ని ఉన్నతాధికారుల ఉత్తర్వుల మేరకు ఇతర జిల్లాలకు తరలిస్తున్నాం. అక్రమాలు జరుగకుండా రెవెన్యూ, సివిల్ సప్లయ్ అధికారులు తరుచూ మిల్లులను తనిఖీ చేస్తున్నారు.
– ప్రసాద్, సివిల్ సప్లయ్ సూర్యాపేట జిల్లా మేనేజర్