రామగిరి, జూలై 28 : రాష్ట్ర వ్యాప్తంగా మధ్యాహ్న భోజన కార్మికులకు గత ఐదు నెలలుగా పెండింగ్లో ఉన్న వేతనాలు, అలాగే తొమ్మిది నెలల కోడిగుడ్ల బిల్లులను వెంటనే చెల్లించాలని తెలంగాణ మధ్యాహ్న భోజన పథకం సీఐటీయూ నల్లగొండ జిల్లా కార్యదర్శి పోలే సత్యనారాయణ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సోమవారం తెలంగాణ మధ్యాహ్న భోజన పథకం కార్మికుల యూనియన్ సీఐటీయూ రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా యూనియన్ జిల్లా అధ్యక్షురాలు ఎస్కే కరీమున్నిసా అధ్యక్షతన జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు కార్మికులతో కలిసి నిరసన తెలియజేశారు. ఈ సందర్భంగా సత్యనారాయణ మాట్లాడుతూ.. మధ్యాహ్న భోజన పథకంలో కార్మికులు ప్రభుత్వానికి పది నెలల నుంచి ఎదురు పెట్టుబడి పెట్టి బిల్లులు రాక కుటుంబాలను గడపలేని పరిస్థితి నెలకొందన్నారు. అప్పులు తెచ్చిన చోట అవమానాలను ఎదుర్కొంటున్నట్లు చెప్పారు.
ప్రభుత్వం గుడ్లకు ఇచ్చే ధర రెండు గుడ్లకు మాత్రమే సరిపోతుండగా మూడో గుడ్డు పెట్టాలని అధికారులు కార్మికులపై ఒత్తిడి చేయడం ఎంత వరకు సమంజసం అన్నారు. యుకుబేర్లో మీ బిల్లులు ఉన్నాయని, తమకు సంబంధం లేదని అధికారులు చేతులు దులుపుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. యూకుబేర్ నుండి మధ్యాహ్న భోజన బిల్లుల విడుదలను మినహాయించి, గ్రీన్ ఛానల్ ద్వారా కార్మికుల వ్యక్తిగత బ్యాంక్ ఖాతాలో జమ చేయాలన్నారు. మధ్యాహ్నం భోజనం నిర్వహణకు కట్టెల పొయ్యి వాడొద్దని, అన్ని పాఠశాలలలో గ్యాస్ సౌకర్యం ఉండాలని అధికారులు అంటున్నారు. ఒకపక్క ప్రభుత్వం స్టవ్ మాత్రమే ఇస్తాం, సిలిండర్లు కార్మికులే కొనుక్కోవాలని చెబుతుండడం చాలా అన్యాయం అన్నారు.
కేటాయించిన బడ్జెట్ పాత మేనుకే సరిపోవడం లేదని, కొత్త మెనూ ఎలా పెడుతరని ఆయన ప్రశ్నించారు. పెరుగుతున్న ధరలకు అనుగుణంగా వేతనాలు, పిల్లలకి ఇచ్చే మెనూ చార్జీలు పెంచి తదనుగుణంగా బడ్జెట్ కేటాయించాలనిర పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో యూనియన్ జిల్లా సహాయ కార్యదర్శి అల్లి అనురాధ, జిల్లా నాయకులు నోముల వసంత, కొప్పు ఆండాలు, ఒంటెపాక సైదమ్మ, బి శారద, దండ పుష్పలత, డి సరోజ, గద్దపాటి లక్ష్మమ్మ, ఎల్లయ్య, లలిత, లక్ష్మమ్మ, వేముల రేవతి, పోలే నాగమ్మ, మల్లమ్మ పాల్గొన్నారు.