రామగిరి, ఆగస్టు 06 : నల్లగొండలోని మహాత్మాగాంధీ విశ్వవిద్యాలయంలో తెలంగాణ ఉద్యమ సిద్ధాంతకర్త, ఆచార్య కొత్తపల్లి జయశంకర్ జయంతిని బుధవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వర్సిటీ వీసీ ప్రొఫెసర్ ఖాజా అల్తాఫ్ హుస్సేన్ మాట్లాడుతూ.. ఆచార్య కొత్తపల్లి జయశంకర్ తెలంగాణ ఆర్థతను, ఆర్తిని అక్షరీకరించి ఆత్మగౌరవ నినాదంగా మలిచి, ఉద్యమ భూమికను సిద్ధపరచిన తాత్వికుడని కీర్తించారు. జయశంకర్ సార్ తెలంగాణ ఉన్నత విద్య, తెలంగాణ ఉద్యమంలో చెరగని ముద్ర వేసినట్లు తెలిపారు. ఆయన స్ఫూర్తితో విద్యార్థులు ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో రిజిస్ట్రార్ ప్రొఫెసర్ అల్వాల రవి, యూనివర్సిటీ సోషల్ సైన్స్ విభాగం డీన్ ప్రొఫెసర్ కొప్పుల అంజిరెడ్డి, యూనివర్సిటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డైరెక్టర్ ప్రొఫెసర్ ఆకుల రవి, యూనివర్సిటీ స్పోర్ట్స్ బోర్డ్ అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ ఆర్.మురళి, ఇంజినీరింగ్ విభాగం డీన్ ప్రొఫెసర్ రేఖ, వివిధ విభాగాల అధికారులు, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.
నల్లగొండ సమీపంలోని చర్లపల్లిలో గల తెలంగాణ సాంఘీక సంక్షేమ గురుకుల మహిళా డిగ్రీ కళాశాలలో జయశంకర్ సార్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఆయన చిత్రపటానికి కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్.పవిత్ర వాణి కర్ష పూలమాల వేసి నివాళి అర్పించారు. ఈ కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాల్ ఏ.నీలిమ రెడ్డి, ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్ షేక్ సుల్తానా, ఎన్.ఎస్.ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్స్ ఎన్.అపర్ణ, ఎస్.కే సుల్తానా, శ్రీప్రియా, సునితారాణి, బోధనేతర సిబ్బంది పాల్గొన్నారు.
Nalgonda : ‘తెలంగాణ ఆర్థత, ఆర్తిని అక్షరీకరించిన తాత్వికుడు ఆచార్య జయశంకర్’