కొండమల్లేపల్లి, జూన్ 08 : బడీడు పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించాలని ఎంఈవో నాగేశ్వరరావు అన్నారు. అదివారం మండల పరిధిలోని గుడితండా, ఇస్లావత్తండాల్లో డోర్ టు డోర్ క్యాంపెయిన్ చేసి ప్రతి ఇంటిని సందర్శించి బడీడు పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించాలని కరపత్రాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా అయన మాట్లాడుతు ప్రభుత్వ పాఠశాలల్లో ట్రైనీ ఉపాధ్యాయులచే బోధనతో పాటు ఉచితంగా పాఠ్యపుస్తకాలు, బుక్కులు, యూనిఫామ్స్ అందజేస్తున్నామని తెలిపారు.
ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన మధ్యాహ్న భోజనం ఉంటుందని పేర్కొన్నారు. ప్రభుత్వం విద్యార్థులకు అన్ని వసతులను కల్పిస్తున్నదన్నారు. విద్యార్థుల తల్లిదండ్రులు వారి పిల్లలను ప్రైవేట్ స్కూల్స్‌కు పంపకుండా ప్రభుత్వ పాఠశాలల్లోనే చేర్పించాలని సూచించారు. ఉపాధ్యాయులపై నమ్మకంతో పిల్లలను బడిలో చేర్పిస్తే నాణ్యమైన విద్యను అందిస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు కట్టెబోయిన శ్రీనివాస్ యాదవ్, జాన్ నాయక్, సైదులు, గణేష్, గీతాంజలి పాల్గొన్నారు.