గట్టుప్పల్, జూన్ 15 : గట్టుప్పల్ మండల పరిధిలోని వెల్మకన్నే చెరువు ప్రాంతంలో మతి స్థిమితం లేని వృద్దురాలు మృతి చెందింది. ఎస్ఐ సంజీవరెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. గట్టుప్పల్కు చెందిన మునుకుంట్ల ఈశ్వరమ్మ (73) గ్రామంతో పాటు చుట్టుపక్క గ్రామాలలో మతి స్థిమితం లేకుండా తిరుగుతూ జీవనం కొనసాగిస్తుండేది. దాదాపుగా 20 రోజుల క్రితం వెల్మకన్నే గ్రామం నుంచి మండల కేంద్రానికి వచ్చే క్రమంలో చెరువు ప్రాంతంలో ఓ చెట్టు కింద నిద్రిస్తూ నిద్రలోనే మృతిచెందింది. సోమవారం గమనించిన చుట్టుపక్క ప్రాంత రైతులు, గొర్రెల కాపరి పోలీసులకు సమాచారం అందించడంతో హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకుని విచారించారు. మృతురాలు కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో వైద్యులతో శవ పరీక్ష నిర్వహించారు. కుటుంబ సభ్యుడు మునుకుంట్ల సత్తయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు తెలిపారు.