అర్వపల్లి, అక్టోబర్ 10 : మానసిక ఒత్తిడి అనారోగ్య సమస్యలకు దారితీస్తుందని అర్వపల్లి మండల వైద్యాధికారి భూక్య నగేష్ నాయక్ అన్నారు. శుక్రవారం ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం సందర్భంగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. చెడు అలవాట్లకు గురికాకుండా మానసిక ప్రశాంతత కోసం ప్రతిరోజూ వ్యాయామం, యోగా, మెడిటేషన్ చేయాలన్నారు. ప్రభుత్వ నిపుణులైన వైద్యులచే కౌన్సిలింగ్ నిర్వహించే 14416 ఫోన్ నంబర్ ను సంప్రదించి సమస్యను పరిష్కరించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సామాజిక ఆరోగ్య అధికారి బిచ్చు నాయక్, డాక్టర్ సౌజన్య, నర్సింగ్ ఆఫీసర్లు సునీత, మాధవి, చొక్కయ, అనూష, ఆరోగ్య సిబ్బంది, ఆశ కార్యకర్తలు పాల్గొన్నారు.