నల్లగొండ విద్యా విభాగం (రామగిరి), మార్చి 17 : సకల శాస్త్రాలకు మూలం అని, ఆ దిశగా విద్యార్థులు డిగ్రీ స్థాయిలోనే గణితంపై పట్టు సాధించి భవిష్యత్‌లో ఉత్తమ పరిశోధనలు చేసేలా అధ్యాపకులు ప్రోత్సహించాలని ఐఐటి బొంబాయి ప్రొఫెసర్ శివాజీ గణేషన్ అన్నారు. నల్లగొండలోని మహాత్మా గాంధీ యూనివర్సిటీలో వర్సిటీ డిపార్ట్మెంట్ ఆఫ్ మ్యాథమెటిక్స్ ఆధ్వర్యంలో ఎంపీటీఎస్ ట్రస్ట్, నేషనల్ బోర్డు ఫర్ మ్యాథమెటిక్స్ సహకారంతో ఈ నెల 17 నుంచి 22 వరకు ఆరు రోజుల పాటు నిర్వహించే రెసిడెన్షియల్ శిక్షణను సోమవారం ఎంజీయూ వీసీ ప్రొఫెసర్ ఖాజా అల్తాఫ్ హుస్సేన్‌తో కలిసి ఆయన ప్రారంభించారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ.. శిక్షణ ప్రతి ఒక్కరిలో ఆలోచన నైపుణ్యాలతో పాటు సబ్జెక్టుపై పట్టు సాధించేందుకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందన్నారు. అనంతరం గణిత సబ్జెక్టులోని ఆల్జీబ్రా రియల్ ఎనాలసిస్ లపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ తో వివరించి విద్యార్థుల్లో స్ఫూర్తినింపారు. వర్సిటీ వీసీ ప్రొఫెసర్ ఖాజా అల్తాఫ్ హుస్సేన్ మాట్లాడుతూ.. ఎంజీయూ నిర్వహించే శిక్షణకు దేశవ్యాప్తంగా విద్యార్థులు హాజరు కావడం అభినందనీయమన్నారు.
శిక్షణ కోఆర్డినేటర్ డాక్టర్ జి ఉపేందర్ రెడ్డి మాట్లాడుతూ.. మహాత్మాగాంధీ యూనివర్సిటీలో తొలి పర్యాయం రెసిడెన్షియల్ విధానంలో డిగ్రీ ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు నిర్వహించే శిక్షణకు దేశవ్యాప్తంగా 51 మంది విద్యార్థులు హాజరైనట్లు తెలిపారు. ఐఐటి బొంబాయి, హైదరాబాద్, శివనాడు యూనివర్సిటీ న్యూఢిల్లీ ప్రొఫెసర్లచే ప్రతిరోజు ఉదయం 8 నుంచి సాయంత్రం 6 గంటల వరకు షెడ్యూల్ ప్రకారం శిక్షణ ఉంటుందన్నారు. రెసిడెన్షియల్ విధానం శిక్షణకు పూర్తిస్థాయిలో ఎంజీయూలో సహకారం అందిస్తున్న రిజిస్టర్ ప్రొఫెసర్ అలవాల రవి, హాస్టల్స్ డైరెక్టర్ డాక్టర్ దోమల రమేశ్‌కు ఆయన ప్రత్యేక అభినందనలు తెలిపారు.
శివనాడు యూనివర్సిటీ న్యూఢిల్లీ ప్రొఫెసర్ సత్యనారాయణ రెడ్డి, ఐఐటి హైదరాబాద్ ప్రొఫెసర్ సుకుమార్ పలు అంశాలపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ తో శిక్షణ అందించారు. విద్యార్థులకు వచ్చిన సందేహాలను అప్పటికప్పుడు నివృత్తి చేస్తూ వారిలో చైతన్యం నింపారు. మహాత్మా గాంధీ యూనివర్సిటీ దళిత విభాగం అధిపతి డాక్టర్ పసుపుల మద్దిలేటి అధ్యక్షతన జరిగిన శిక్షణలో ఎంజీయూ సైన్స్ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ ప్రేమ్ సాగర్, గణిత విభాగం అసిస్టెంట్ ప్రొఫెసర్లు డాక్టర్ బి హైమావతి, డాక్టర్ ఏ శ్రీనివాస్, డాక్టర్ ఎన్.కిరణ్ కుమార్, డాక్టర్ రామచంద్రన్ తో పాటు వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన విద్యార్థులు పాల్గొన్నారు.
Mathematics : సకల శాస్త్రాలకు మూలం గణితం : ఐఐటి బొంబాయి ప్రొఫెసర్ శివాజీ గణేషన్