మునుగోడు, డిసెంబర్ 10 : గ్రామ పంచాయతీ ఎన్నికల సామగ్రి పంపిణీలో భాగంగా దూరంగా ఉన్న పోలింగ్ కేంద్రాలకు ముందుగా మెటీరియల్ను పంపించాలని నల్లగొండ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి ఎన్నికల సిబ్బందికి సూచించారు. బుధవారం మునుగోడు మండల కేంద్రంలోని సెయింట్ జోసెఫ్ పాఠశాలలో ఏర్పాటు చేసిన గ్రామ పంచాయతీ ఎన్నికల డీఆర్సీ కేంద్రాన్ని ఆమె తనిఖీ చేశారు. ఎన్నికల పోలింగ్ సామగ్రి పంపిణీ, స్వీకరణకు చేసిన ఏర్పాట్లను పరిశీలించారు. పోలింగ్ సిబ్బందికి సామగ్రి పంపిణీ చేసే సమయంలో స్టాట్యూటరీ, నాన్ స్టాట్యూటరీ పేపర్ల ప్రాధాన్యతను తెలియజేయాలన్నారు.
అలాగే ప్రతి పోలింగ్ టీం వారికి సంబంధించిన జోనల్ అధికారి, రూట్ అధికారుల ఫోన్ నంబర్లు కలిగి ఉండాలని తెలిపారు. ప్రిసైడింగ్ అధికారులు పీఓ డైరీ నిర్వహణ, టెండర్, ఛాలెంజ్ ఓట్ల విషయంలో తీసుకునే జాగ్రత్తలు మరోసారి తెలియజేయాలని చెప్పారు. పోలింగ్ కేంద్రాలలో సిబ్బందికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా అన్ని సౌకర్యాలు కల్పించాలన్నారు. ఒకవేళ మెటీరియల్ సరిపోకపోతే తక్షణమే ఎంపీడీఓ దృష్టికి తీసుకురావాలన్నారు. కలెక్టర్ వెంట జిల్లా పంచాయతీ అధికారి వెంకయ్య, జడ్పీ సీఈఓ శ్రీనివాసరావు, డీఆర్డీఓ శేఖర్ రెడ్డి, చండూరు ఆర్డీఓ శ్రీదేవి ఉన్నారు.