సూర్యాపేట, మార్చి 30: కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయకుంటే తగిన గుణపాఠం తప్పదని సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యురాలు మల్లు లక్ష్మి హెచ్చరించారు. ప్రజా సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ సీపీఎం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో సోమవారం సూర్యాపేటలోని ప్రధాన వీధుల గుండా కలెక్టరేట్ వరకు రెండు కిలో మీటర్ల మేర ర్యాలీ నిర్వహించి కలెక్టరేట్‌ను ముట్టడించారు. అనంతరం కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లవుతున్నా ఏ ఒక్క వర్గానికి న్యాయం చేయలేదని, రైతులకు పూర్తి స్థాయిలో నేటికీ రుణమాఫీ కాలేదన్నారు. రైతు భరోసా ఎకరానికి రూ. 15వేలు ఇస్తామని చెప్పి రూ.6వేలు మాత్రమే ఇచ్చి చేతులు దులుపుకుందన్నారు. ఇందిరమ్మ ఇండ్లు కాంగ్రెస్ కార్యాకర్తలకే ఇస్తున్నారని, గృహనిర్మాణ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి హుజూర్‌నగర్‌కే మంత్రా..? అని ప్రశ్నించారు. ఉపాధి హామీ పథకాన్ని పాత పద్ధతిలోనే కొనసాగించాలని ఎర్రటి ఎండలో కష్టపడి పని చేస్తే ఫొటో క్యాప్చర్ పెట్టి కూలీలను దొంగల్లా చూస్తారా అని ధ్వజమెత్తారు.
ఉపాధి హామీని నీరుగార్చే కుట్రను మానుకోవాలని, పెంచిన గ్యాస్ ధరను తగ్గించాలన్నారు. వేసవిలో తాగునీటి సమస్య తీవ్రంగా ఉండడంతో అనేక గిరిజన తండాలు, దళిత కాలనీలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నాయని, ప్రభుత్వం మంచినీటి సమస్య పరిష్కారానికి ముందస్తు చర్యలు చేపట్టాలన్నారు. మహా ధర్నాలో సీపీఎం నాయకులు నెమ్మాది వెంకటేశ్వర్లు, కొలిశెట్టి యాదగిరి రావు, ముల్కలపల్లి రాములు, మట్టిపల్లి సైదులు, కోట గోపి, చెరుకు ఏకలక్ష్మి, జిల్లపల్లి నర్సింహారావు, ధనియాకుల శ్రీకాంత్, వేల్పుల వెంకన్న, వరబోయిన రవి, మద్దెల జ్యోతి, కందాల శంకర్‌రెడ్డి, మేకనబోయిన శేఖర్, దండ వెంకటరెడ్డి, బుర్ర శ్రీనివాస్, కొప్పుల రజిత, ఎల్గూరి గోవింద్, పల్లె వెంకటరెడ్డి, షేక్ యాకూబ్ తదితరులు పాల్గన్నారు.