నల్లగొండ : తెలంగాణపై మోదీ వ్యాఖ్యలపై టీఆర్ఎస్ శ్రేణులు భగ్గుమన్నాయి. జిల్లాకేంద్రంలో తీవ్ర నిరసనలు వ్యక్తం చేశారు. టీఆర్ఎస్ శ్రేణుల పెద్ద సంఖ్యలో నిరసన ర్యాలీలో కదం తొక్కారు. వందలాది మంది ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి ఆధ్వర్యంలో ర్యాలీకి తరలివచ్చారు.
ముందుగా పట్టణంలోని పార్టీ కార్యకర్తలు, అభిమానులు మర్రిగూడ చౌరస్తా కు చేరుకున్నారు. అక్కడి నుంచి ఎమ్మెల్యే నేతృత్వంలో నల్లజెండాలతో భారీ బైక్ ర్యాలీగా పట్టణంలోకి వచ్చారు. వివేకానంద విగ్రహం, ఉడిపి హోటల్, ఎన్జీ కాలేజీ మీదుగా క్లాక్ టవర్ వరకు మోడీ సర్కారు కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ర్యాలీ నిర్వహించారు.
నల్లజెండాలు, భారీ సంఖ్యలో నిర్వహించిన ర్యాలీ పట్టణ ప్రజలను ఆకట్టుకుంది. క్లాక్ టవర్ సెంటర్ లో కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ మోడీ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణపై బీజేపీ నేతల అక్కసు మోదీ మాటల్లో మరోసారి స్పష్టం అయిందన్నారు.
స్వరాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని ఓర్వలేక మోదీ కుట్రలు పన్నుతున్నారని ఆరోపించారు.
తెలంగాణ జోలికి వస్తే ఊరుకునేది లేదని ఈ సందర్భంగా భూపాల్ రెడ్డి బీజేపీ నేతలను, కేంద్ర సర్కారును హెచ్చరించారు. అన్ని వర్గాల ప్రజలు మోదీ ప్రభుత్వ తీరును వ్యతిరేకించాలని పిలుపునిచ్చారు.
ఇంకా ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ సైదిరెడ్డి, వైస్ చైర్మన్ అబ్బగోని రమేష్, పట్టణ అధ్యక్షకార్యదర్శులు. పిల్లి రామరాజు, బోనగిరి దేవేందర్, ఫ్లోర్ లీడర్ అభిమన్యు శ్రీనివాస్, ఇతర నేతలు పాల్గొన్నారు.