నల్లగొండ సిటీ, ఏప్రిల్ 21:దేవరకొండలోని స్టేట్ బ్యాం కు ఆఫ్ ఇండియాలోని అగ్రికల్చరల్ కమర్షియల్ బ్రాంచ్ (ఎసీబీ)లో జరిగిన భారీ కుంభకోణాన్ని నల్లగొండ జిల్లా పోలీసులు ఛేదించారు. ఈ కేసులో ప్రధాన నిందితుడైన హౌస్ కీపింగ్ ఉద్యోగితో పాటు మరో ముగ్గురిని అరెస్టు చేసినట్లు ఎస్పీ శరత్ చంద్ర పవార్ మంగళవారం వెల్లడించారు. నిందితుల నుంచి రూ. 2,42,10,000 నగదు, 6 స్మార్ట్ ఫోన్లు, ఒక ల్యాప్ టాప్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
మోసం వెలుగు చూసింది ఇలా..
ఈ నెల 13న తమ బ్యాంకు ద్వారా రూ.2.65 కోట్లు నిధులను మళ్లించినట్లు దేవరకొండ ఎస్బీఐ ఏసీబీ బ్రాంచి మేనేజర్ ఫణీంద్ర పోలీసులకు ఫిర్యాదు చేశారు. బ్యాంకులో కాంట్రాక్టు ప్రాతిపదికన పని చేస్తున్న హౌస్ కీపింగ్ ఉద్యోగి లెండల చక్రపాణి వాడకంలో లేని ఖాతాల వివరాలను దుర్వినియోగం చేసి, ఈ నిధులను మళ్లించినట్లు ఫిర్యాదులో పేరొన్నారు. హైదరాబాద్ కోఠి బ్రాంచ్‌కు చెందిన పల్లటి నరేందర్ అనే ఖాతాదారుని కేవైసీ వివరాలు అక్రమంగా అప్డేట్ అయినప్పుడు అతడికి ఈ-మెయిల్ అలర్ట్ రావడంతో ఈ మోసం బయటపడింది.
నిందితుల వివరాలు..
ఈ కేసులో దేవరకొండ ఎస్బీఐలో హౌస్ కీపింగ్ ఉద్యోగిగా పనిచేస్తున్న లెండల చక్రపాణి ప్రధాన నిందితుడు కాగా సూర్యాపేట ఎస్బీఐలో మేనేజర్‌గా పనిచేస్తున్న పుట్ట వెంకట రామాంజనేయులు, మిర్యాలగూడకు చెం దిన ఎస్బీఐ రికవరీ ఏజెంట్ కేతావత్ రాంలాల్, దేవరకొండకు చెందిన ఫొటోగ్రాఫర్ మారేపల్లి శివ మిగిలిన నిందితులు.
పకా ప్లాన్‌తో దోపిడీ..
ఐదేళ్లుగా బ్యాంకులో పనిచేస్తున్న చక్రపాణికి కంప్యూటర్ పరిజ్ఞానం ఉండటంతో సిబ్బందికి సాయం చేస్తూ బ్యాంకు అంతర్గత వ్యవస్థపై అవగాహన పెంచుకున్నాడు. అప్పుల బాధ నుంచి గట్టెకేందుకు సూర్యాపేట బ్రాంచి మేనేజర్ రామాంజనేయులుతో చేతులు కలిపాడు. రామాంజనేయులు తనకున్న ఎంఐఎస్ యాక్సెస్‌తో ఏళ్ల తరబడి నిరుపయోగంగా ఉన్న 10 ఖాతాల వివరాలు సేకరించాడు. కాగా ఆన్లైన్ సైట్ల ద్వారా నకిలీ ఆధార్, పాన్ కార్డులు సృష్టించారు. అయితే బ్యాంకు సిబ్బంది లాగిన్ వివరాలను దొంగతనంగా సేకరించి, రద్దీ సమయాల్లో ఖాతాలకు కొత్త మొబైల్ నంబర్లు అప్ డేట్ చేశారు. యోనో యాప్ ద్వారా కొత్త పిన్ నంబర్లు సృష్టించి నగదును ఇతర ఖాతాలకు బదిలీ చేశారు. రాంలాల్, శివ తమ పరిచయస్తులకు కమీషన్ ఆశ చూపి వారి ఖాతాల ద్వారా నగదు డ్రా చేసినట్లు వెల్లడించారు.
చాకచక్యంతో వ్యహరించిన పోలీసులు
జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు దేవరకొండ డీఎస్పీ శ్రీనివాసరావు పర్యవేక్షణలో సీఐ వెంకట్‌రెడ్డి, ఎస్ఐ రాజు తదితరులతో కూడిన బృందం సాంకేతిక ఆధారాలతో నిందితులను పట్టుకున్నారు. కేసును వేగంగా ఛేదించిన పోలీసు అధికారులను, సిబ్బందిని ఎస్పీ ప్రత్యేకంగా అభినందించారు. నిందితులపై కేసులు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.