నల్లగొండ జిల్లా: బీఅర్ఎస్ పార్టీ తిరిగి అధికారంలోకి రావడం ఖాయమని మాజీ శాసన సభ్యులు రమావత్ రవీంద్ర కుమార్ అన్నారు. ఆదివారం నేరడుగొమ్ము మండలం ధర్మారేఖ్య తండాకు చెందిన పలువురు కాంగ్రెస్ పార్టీ నుంచి బీఆర్ఎస్ పార్టీలో చేరారు. వారికి పార్టీ గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ 22నెలల పాలనలో సబ్బండవర్గాలు ఇబ్బందులు పడ్డాయన్నారు.
ప్రజాపాలన అంటూ ఎన్నికల్లో ఊదరగొట్టిన హస్తం పార్టీ నేతలు తెలంగాణలో సమస్యలను చెప్పుకునేందుకు కూడా అవకాశం లేకుండా చేశారని మండిపడ్డారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను ఎప్పుడో అటకెక్కించిన ప్రభుత్వ పెద్దలు బీఆర్ఎస్ హయాంలో ఇచ్చిన సంక్షేమ పథకాలకూ తిలోదకాలిచ్చారని విమర్శించారు.
నమ్మించి నట్టేట ముంచిన సర్కారుపై ప్రజల్లో అడుగడుగునా ఆగ్రహావేశాలు పెల్లుబికుతున్నాయన్నారు. రైతులు ఇబ్బంది పడుతున్నా ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి దున్నపోతు మీద వాన పడ్డట్టు ఉందని విమర్శించారు. రేవంత్ రెడ్డి చేసిన అప్పుతో ఢిల్లీకి మూటలు కట్టుడు తప్ప ఏం చేశాడో చెప్పాలన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు అభిషేక్ నాయక్, మాజీ సర్పంచ్ చెన్న నాయక్, బషీర్,తదితరులు ఉన్నారు.