మునుగోడు, ఏప్రిల్ 24 : ఈ నెల 30న గట్టుప్పల్ మండల కేంద్రంలోని ఎస్వీఎల్ ఫంక్షన్ హాల్లో జరిగే అమరుల సంస్మరణ సభను జయప్రదం చేయాలని సిపిఎం నల్లగొండ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు బండ శ్రీశైలం కోరారు. గురువారం మునుగోడు మండల కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మండల సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. దున్నే వాడికి భూమి చెందాలని, వెట్టి చాకిరి విముక్తి కోసం ఎర్ర జెండాలను ఎత్తుకుని వేలాదిమంది కమ్యూనిస్టు కార్యకర్తలు తమ ప్రాణాలు అర్పించినట్లు తెలిపారు. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వారసత్వాన్ని పుణికి పుచ్చుకున్న మునుగోడు ప్రాంత సిపిఎం నాయకులు కమ్యూనిస్టు ఉద్యమ నిర్మాణంలో, ప్రజా ఉద్యమాల్లో అగ్రభాగాన ఉండి అమరులైనట్లు చెప్పారు.
మోదీ ప్రభుత్వం మూడోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత రాజ్యాంగానికి విరుద్ధంగా రైతులకు నష్టం కలిగించే మూడు నల్ల చట్టాలు, కార్మికులు సాధించుకున్న 44 కార్మిక చట్టాలను 4 లేబర్ కోడ్ లుగా మార్చి కార్మికులను కట్టు బానిసలుగా చేసేందుకు చుస్తున్నట్లు తెలిపారు. కేంద్ర ప్రభుత్వం పేద ప్రజలపై విపరీతమైన భారం మోపుతుందని దుయ్యబట్టారు. రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను అమలు చేయాలన్నారు. ప్రజలకు నష్టం కలిగించే విధానాలను ఎండగడుతూ, అమరవీరుల ఆశయాల కోసం సమరశీల పోరాటాలు నిర్వహించాలని రైతులకు, ప్రజలకు, కార్మికులకు ఆయన పిలుపునిచ్చారు.
కొనుగోలు కేంద్రాల్లో విక్రయించే సన్న, దొడ్డు రకం వడ్లకు ప్రభుత్వం బోనస్‌ను అందించాలన్నారు. ప్రభుత్వం రైతులకు రూ.2 లక్షల వరకు రుణమాఫీ చేస్తామని ప్రకటించి నేటికీ రూ.2 లక్షల లోపు రైతులకు రుణమాఫీ చేయకపోవడం దారుణమని మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో సిపిఎం మండల కార్యదర్శులు సాగర్ల మల్లేశ్, జేరిపోతుల ధనుంజయ గౌడ్, మండల కమిటీ సభ్యులు మిర్యాల భరత్, వరికుప్పల ముత్యాలు, యాస రాణి, శ్రీను, వడ్లమూడి హనుమయ్య, నారగోని నరసింహ, కొంక రాజయ్య, పగడాల కాంతయ్య, కట్ట లింగస్వామి, బొడ్డుపల్లి నరేశ్, యాట శ్రీకాంత్ పాల్గొన్నారు.