కోదాడ, ఆగస్టు 07 : కోదాడ పట్టణ పరిధి చెరువు బజార్లో గురువారం ఓ వివాహిత ఆత్మహత్య చేసుకుంది. స్థానికులు, బంధువులు తెలిపిన వివరాల ప్రకారం.. చెరువు బజార్లో ఉండే ఉప్పుతల లక్ష్మి (40) అనే మహిళ తన ఇంట్లో ఫ్యాన్‌కు ఉరి వేసుకుని చనిపోయింది. సమాచారం అందుకున్న మహిళ కుటుంబ సభ్యులు సంఘటన స్థలానికి చేరుకుని బోరున విలపించారు. ఆమె భర్త శ్రీనునే కొట్టి చంపాడని మృతురాలి బంధువులు ఆరోపించారు. ఫిర్యాదు అందుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. సీఐ శివశంకర్ నేతృత్వంలో దర్యాప్తు చేపట్టారు.
మహిళ మృతిపై ఆమె తల్లిదండ్రులు మాట్లాడుతూ.. తమ కూతురు ఆత్మహత్య చేసుకునేంత పిరికిది కాదన్నారు. ఇది ముమ్మాటికీ హత్యేనని ఆరోపించారు. ఓ మహిళతో తన బిడ్డ భర్త శ్రీను వివాహేతర సంబంధం పెట్టుకుని గత కొన్నేండ్లుగా వేధిస్తున్నట్లు తెలిపారు. ఆమెనే పెండ్లి చేసుకుంటానని శారీరకంగా, మానసికంగా వేధిస్తూ నెల క్రితం ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం పెరిక సింగారం గ్రామంలోని తమ ఇంటికి పంపిన విషయాన్ని ఈ సందర్భంగా వారు గుర్తు చేసుకున్నారు. ఇరువురి మధ్య సయోధ్య కుదిర్చి బిడ్డను భర్త వెంట పంపినట్లు తెలిపారు. ఇక ప్రశాంతంగా కాపురం చేసుకుంటారులే అనుకునేంతలోనే ఇలా తమ బిడ్డను విగత జీవిలా మార్చాడని వారు కన్నీటి పర్యంతమయ్యారు.