మిర్యాలగూడ, జూలై 16 : సికింద్రాబాద్- గుంటూరు మార్గంలో ప్రయాణించే విశాఖ, చెన్నై, గుంటూరు మార్గంలో ప్రయాణించే విశాఖ, చెన్నై, నారాయణాద్రి ఎక్స్‌ప్రెస్ రైళ్లను మిర్యాలగూడ, నడికుడి, పిడుగురాళ్ల రైల్వే స్టేషన్లలో ఈ నెల 19 నుంచి స్టాప్‌ను మళ్లీ ఎత్తివేస్తున్నట్లు రైల్వే శాఖ ఉన్నతాధికారులు మంగళవారం ఆదేశాలు జారీ చేశారు. కరోనా సమయంలో ఈ రైళ్లకు స్టాప్‌లు ఎత్తివేయడంతో రెండేండ్ల పాటు ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.
దాంతో మాజీ ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్‌రావు మిర్యాలగూడలో రైళ్లు నిలపాలంటూ రైల్వే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లడంతో గతేడాది జూలై నుంచి ఆయా రైళ్లను మిర్యాలగూడతోపాటు నడికుడి, పిడుగురాళ్ల స్టేషన్లలో ఒక నిమిషం పాటు ఆగేలా అనుమతించారు. ఆదేశాలు ఇచ్చిన సమయంలోనే ఏడాదిపాటు రైళ్లు నిలుపుతామని ఉత్తర్వులు ఇవ్వడంతో ప్రస్తుతం ఏడాది సమయం పూర్తికావడంతో ఈ నెల 19 నుంచి ఆయా స్టాప్‌లను రైల్వే అధికారులు ఎత్తివేశారు. ఉమ్మడి జిల్లాలోని వేలాది మంది ప్రయాణికులు సికింద్రాబాద్- గుంటూరు మార్గంలో ఆంధ్రప్రదేశ్, ఒడిషా వంటి ప్రాంతాలకు వెళ్తుంటారు. రైల్వే అధికారుల నిర్ణయంతో తాము తీవ్ర ఇబ్బందులు పడతామని, మిర్యాలగూడలో రైళ్లను నిలిపేలా ప్రజాప్రతినిధులు కృషి చేయాలని పలువురు ప్రయాణికులు కోరుతున్నారు.