– 634 బస్తాల ధాన్యానికి 14.65 క్వింటాళ్ల షార్టేజ్
– న్యాయం చేయాలని రైతుల డిమాండ్
కట్టంగూర్, జూన్ 10 : కట్టంగూర్ మండలంలోని అయిటిపాముల ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రంలో ధాన్యం విక్రయించిన రైతులకు నిర్వాహకులు తీవ్ర నష్టం చేకూర్చారు. రైతులు గాదరి ప్రసాద్ 524 బస్తాలు, పెద్ది ఎల్లమ్మ 82 బస్తాలు, మామిడి గోపయ్య 27 బస్తాలు కలిపి మొత్తం 634 బస్తాల ధాన్యాన్ని కొనుగోలు కేంద్రంలో ఈ నెల 6న నిర్వాహకులు ఒక్కోబస్తాకు 42 కేజీల చొప్పున తూకం వేసి సుమారు 266 క్వింటాళ్ల ధాన్యాన్ని నమోదు చేసి ఒక లారీలో చెర్వుఅన్నారం సమీపంలోని శివసాయి రైస్ మిల్లుకు తరిలించారు. దిగుమతి సమయంలో మిల్లులో 2 కేజీల తరుగు తీసేసీ 40 కేజీల చొప్పున తిరిగి తూకం వేసి 14.65 క్వింటాళ్ల ధాన్యం షార్టేజీ చూపించడంతో రైతులు ఆందోళనకు గురయ్యారు.
కొనుగోలు కేంద్రంలో నమోదైన తుకానికి మిల్లులో చూపిన తూకానికి ఇంత భారీ వ్యత్యాసం ఎలా వచ్చిందని రైతులు ప్రశ్నిస్తున్నారు. ఇదే విషయాన్ని రైతులు మిల్లు యాజమాన్ని ప్రశ్నించగా కొనుగోలు కేంద్రం నిర్వాహకులను అడగాలని, కేంద్రం నిర్వాహకులను ప్రశ్నిస్తే తమకు ఏమీ తెలియదంటూ నిర్లక్ష్యంగా సమాదానం ఇస్తూ తప్పించుకుంటున్నారని రైతులు వేదన వ్యక్తం చేశారు. ఒకరి పై ఒకరు నెట్టుకుంటూ రైతులను తీవ్రంగా నష్టపరుస్తున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. ఇదే విషయంపై సివిల్ సప్లయ్ డీటీ జ్యోతిని సంప్రదించగా ఇంత భారీ షార్టేజ్ రాదని మిల్లు యాజమాన్యం, కేంద్రం నిర్వాహకులతో మాట్లాడుతామని తెలిపారు.
కేంద్రంలో తూకం వేసిన ధాన్యానికి, మిల్లులో చూపిన తూకానికి భారీ తేడా ఉంది. 14.65 క్వింటాళ్ల ధాన్యం షార్టేజ్ చూపించడంతో తీవ్రంగా నష్టపోయాం. ఇంత పెద్ద మొత్తంలో షార్టేజీ ఎలా వచ్చిందని మిల్లు యాజమాన్యం, కేంద్రం నిర్వాహకులను అడిగితే ఒకరి మీద ఒకరు చెప్పుకుంటూ నిర్లక్ష్యంగా సమాధానం ఇస్తున్నారు. ధాన్యం తుకాంలో జరిగిన వ్యత్యాసంపై అధికారులు వెంటనే విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకుని తగిన న్యాయం చేయాలి.