తెలుగు నూతన సంవత్సరం ఉగాదికి ఒక్కరోజే మిగిలి ఉన్నా సూర్యాపేట జిల్లాలో ఇప్పటికీ మామిడి కాత కనిపించడం లేదు. వాతావరణ మార్పులు, అడుగంటిన భూగర్బ జలాలు, అధిక ఊష్ణోగ్రతలతో పూత, కాత ఆశాజనకంగా లేదని రైతులు వాపోతున్నారు. రెండు దశల్లోనూ రాలిపోతుండడంతో దిక్కుతోచని స్థితిలో పడ్డారు. సూర్యాపేట జిల్లాలో 21 మండలాల్లో 11,600 ఎకరాల్లో మామిడి తోటలు ఉన్నాయి. ప్రధానంగా నూతనకల్, తుంగతుర్తి, చివ్వెంల, పెన్పహడ్, కోదాడ, గరిడేపల్లి, అర్వపల్లి మండలాల్లో ఎక్కువ విస్తీర్ణంలో రైతులు సాగు చేస్తున్నారు. కాగా, అతికొద్ది చోట్ల మాత్రమే కాత కాస్త బాగుంది. అనేక చోట్ల పూత దశలోనే రాలిపోగా, పిందె దశలో విపరీతంగా నేలకు పడుతున్నది.
ఉగాది పండుగలో మామిడి స్థానం ప్రత్యేకమైంది. ఏటా దాదాపు ఈ పండుగ నుంచే మామిడి కోతలు ప్రారంభమవుతాయి. కానీ ఈ సంవత్సరం అలాంటి పరిస్థితి కనిపించడం లేదు. సాధారణంగా ప్రతి సంవత్సరం నవంబర్, డిసెంబర్లో మామిడి పూత వస్తుంది. కానీ ఈసారి అకాల వర్షాలు, ఊష్ణోగ్రతల్లో మార్పులు, భూగర్భజలాలు అడుగంటి పోవడంతో 70 శాతం మామిడి చెట్లకు జనవరి, ఫిబ్రవరిలో మాత్రమే పూత వచ్చింది. పైగా, పూత దశలో విపరీతంగా రాలిపోయినట్లు ఉద్యానవన శాఖ అధికారులు చెప్తున్నారు. వేసవి ప్రారంభం నాటికి పిందెలు పెరిగి ఓ మోస్తరు కాయ సైజుకు వస్తే బాగుంటుంది. కానీ, ప్రస్తుతం మార్చి నెలాఖరుకు వచ్చినా చిన్న చిన్న పిందెలుగానే ఉంది. చాలా చోట్ల ఇంకా పూత కనిపిస్తున్నది. ప్రధానంగా జిల్లాలోని తుంగతుర్తి, సూర్యాపేట, కోదాడ నియోజకవర్గాల పరిధిలో గోదావరి నీళ్లు రాకపోవడంతో భూగర్బ జలాలు అడుగంటిపోయాయి. ఆ ప్రభావం వరిపై విపరీతంగా పడి దాదాపు 80శాతం పంట ఎండిపోయిన సంగతి తెలిసిందే. మామిడి తోటలపైనా అంతేస్థాయిలో తీవ్రత కనిపిస్తున్నది. ఓవైపు ఎండలు ముదురుతుండడం, మరో వైపు కరెంటు కోతలు, ఆగిఆగి పోస్తున్న బోర్లతో మామిడి పూత చెట్టు మీద నిలబడడం లేదని రైతులు వాపోతున్నారు. ఇవి చాలదన్నట్లు తేనె మంచు పురుగు వంటి చీడపీడలు సోకుతున్నాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దిగుబడిపై ఆశలు వదులుకోవాల్సిన దుస్థితి ఏర్పడిందని ఆవేదన చెందుతున్నారు.
మామిడి పూత పూసి కాత దశకు వచ్చే సమయంలో ఎండలు ఎక్కువవుతున్నయి. భూగర్భ జలాలు అడుగంటుతుండడంతో బోరు బావులు ఎండిపోయి నీళ్లు అందడం లేదు. దాంతో చెట్లకు సరిపడా నీళ్లు లేక పూత రాలిపోయి తీవ్ర నష్టాలు వస్తున్నయి. ఈ ఏడాది పరిస్థితి మరింత దారుణంగా ఉంది. నేను మామిడి తోటను కాపాడుకునేందుకు మూడు బోర్లు వేసిన. అవి రెండు రోజులు పోసి ఎండిపోయినయ్.
నాకు ఐదెకరాల్లో మామిడి తోట ఉంది. ఏటా పాదులు తవ్వించడం, మందులకు పిచికారీ చేసేందుకు అధికంగా ఖర్చు అవుతున్నది. అయినా ఫలితం ఉండడం లేదు. పూత రాలి కాత రాక తీవ్రంగా నష్టపోతున్నాం. ఎండలు పెరుగుతుండడంతో బోర్ల నుంచి నీళ్లు సరిగ్గా రాక తోటలకు అందించలేక పోతున్నాం. దాంతో పూత రాలి పిందె పట్టడం లేదు. ఈసారి నష్టం ఎక్కువ ఉండేట్టు కనిపిస్తున్నది.