సమైక్య పాలనలో తీవ్ర నిరాదరణకు గురైన ప్రభుత్వ విద్యా వ్యవస్థ స్వరాష్ట్రంలో తిరిగి బలోపేతమవుతున్నది. వసతులను సమకూర్చుకుంటూ, పరిస్థితులను చక్కదిద్దుకుంటూ పేద విద్యార్థులకు మెరుగైన విద్యను అందిస్తున్నది. ప్రభుత్వ పాఠశాలల్లో సమస్యల పరిష్కారం, సౌలత్‌ల కల్పన కోసం రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టిన మన ఊరు – మన బడి పనులు ఉమ్మడి జిల్లావ్యాప్తంగా చకచకా సాగుతున్నాయి. అనేక చోట్ల ఇప్పటికే నూతన నిర్మాణాలు అందుబాటులోకి రాగా, కొన్నిచోట్ల చివరి దశలో ఉన్నాయి. మొదటి విడుతలో భాగంగా విద్యా శాఖ ఎంపిక చేసిన 1,097 పాఠశాలల్లో 12 రకాల మౌలిక వసతులు ఒక్కొక్కటిగా అందుబాటులోకి వస్తున్నాయి. అందుకోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.317కోట్లను ఖర్చు చేస్తుండడం విశేషం. వసతుల కల్పనపై విద్యార్థుల తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ఆంగ్ల మాధ్యమంలో బోధన చేసేందుకు గానూ టీచర్లకు శిక్షణ కార్యక్రమం నిర్విరామంగా కొనసాగుతున్నది.
మన ఊరు – మన బడిలో కొత్త రూపు సంతరించుకున్న మోత్కూరు ప్రాథమిక పాఠశాల
సూర్యాపేట, డిసెంబర్ 5 (నమస్తే తెలంగాణ) : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న మన ఊరు – మన బడి కార్యక్రమంతో జిల్లాలోని సర్కారు బడులు ప్రైవేటుకు దీటుగా రూపుదిద్దుకుంటున్నాయి. మరుగుదొడ్లు, అదనపు గదుల నిర్మాణాలతోపాటు భవనాలకు పెయింటింగ్ వేస్తూ ప్రత్యేక ఆకర్శణగా తీర్చిదిద్దుతున్నారు. బెంచీలు, గ్రీన్ చాక్ బోర్డులు, విద్యుత్ వెలుగులు, ఉద్యాన వనాలను తలపిస్తూ ఆహ్లాదాన్ని పంచే ప్రాంగణాలు, చదువుపై ఆసక్తిని పెంచేలా పెయింటింగ్‌తో కూడిన ప్రహరీలు, మౌలిక వసతులతో సర్కారు బడులు సర్వాంగ సుందరంగా తయారవుతున్నాయి.
12 రకాల మౌలిక వసతులు
విద్యా శాఖ ఎంపిక చేసిన పాఠశాలల్లో 12 రకాల మౌలిక వసతులు కల్పించాలని ప్రభుత్వం సంకల్పించింది. ఇందులో భాగంగా మన ఊరు – మన బడి కార్యక్రమం కింద ఎంపిక చేసిన బడుల్లో నీటి వసతితోపాటు మరుగుదొడ్లు, విద్యుత్, తాగునీరు, ఫర్నిచర్, పెయింటింగ్, మరమ్మతులు, గ్రీన్ చాక్ బోర్డులు, ప్రహరీలు, వంట గది, అదనపు తరగతి గదులు, ఉన్నత పాఠశాలల్లో డైనింగ్ హాల్, డిజిటల్ విద్య అమలుకు చర్యలు తీసుకుంది. ఇప్పటికే పలు స్కూళ్లలో ఈ సదుపాయాలు అందుబాటులోకి వచ్చాయి. మరో వారం, పది రోజుల్లో ఫర్నిచర్, గ్రీన్ చాక్ బోర్డులు తదితర ఎక్విప్మెంట్ పాఠశాలలకు చేరనున్నాయి.
ఆంగ్ల బోధనకు శిక్షణ
మన ఊరు-మన బడి కార్యక్రమంలో భాగంగా ఆంగ్ల మాధ్యమం ప్రవేశ పెడుతున్న నేపథ్యంలో ఉపాధ్యాయులకు ప్రత్యేకంగా శిక్షణ ఇస్తున్నారు. ఇప్పటికే పలువురికి శిక్షణ ఇవ్వగా.. మరికొందరికి కొనసాగుతున్నది. అంతే కాకుండా ఆంగ్ల విద్య కోసం స్వచ్ఛంద సంస్థలు ముందుకొస్తున్నాయి. జిల్లాలో 56స్కూళ్లను టీచ్ ఫర్ ఛేంజ్ అనే సంస్థ దత్తత తీసుకున్నది.
రూ.17లక్షలతో పీపల్‌పహాడ్ స్కూల్ మరమ్మతులు
చౌటుప్పల్ రూరల్ : మన ఊరు మన బడి కార్యక్రమం కింద మండలంలోని పీపల్‌పహాడ్ జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాల మరమ్మతులకు రూ.17.లక్షలు మంజూరయ్యాయి. ఇప్పటికే రూ.1.64లక్షలతో ఎలక్ట్రికల్ పనులు పూర్త్తి కాగా, రూ.6.30లక్షలతో ప్రహరీ పనులు చేపడుతున్నారు. మిగతా డబ్బుతో డైనింగ్ హాల్, తరగతి గదులకు పెయింటింగ్, టాయిలెట్లు, ఫర్నిచర్ మరమ్మతులు, కిచెన్ షెడ్డు విస్తరణ పనులు చేయనున్నారు.
రూ.68లక్షలతో హాలియా స్కూల్ అభివృద్ధి
హాలియా : మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 470 మంది విద్యార్థులు చదువుతున్నారు. మన ఊరు మన బడి కార్యక్రమం కింద ఈ పాఠశాల అభివృద్ధికి ప్రభుత్వం రూ.68.32 లక్షలు మంజూరు చేసింది. ఇందులో 9.55లక్షలతో విద్యుత్ వ్యవస్థ మెరుగు, రూ.7.8లక్షలతో ప్రహరీ నిర్మాణం, రూ.17.18 లక్షలతో మూత్రశాలలు, రూ.17.28 లక్షలతో డైనింగ్ హాల్, 14.55 లక్షలతో కొత్త, పాత భవనాల మరమ్మతులు, లక్షా 81 వేల రూపాయలు తాగునీటి సౌకర్యం కోసం ఖర్చు చేయాలని నిర్ణయించారు. ఈ సర్కారు బడిని కార్పొరేట్ స్కూల్‌ను తలదన్నేలా సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతున్నారు. అన్ని తరగతి గదుల్లో విద్యుత్ లైట్లు, ఫ్యాన్లు ఏర్పాటు చేస్తున్నారు. ప్రస్తుతం పనులు ముమ్మరంగా జరుగుతున్నాయి.
మర్రిగూడ పాఠశాల పనులు ముమ్మరంగా..
తిప్పర్తి : మన ఊరు – మన బడి మొదటి విడుతలో మండలంలో 15 పాఠశాలలను ఎంపిక చేశారు. ఇందులో మర్రిగూడ ప్రాథమిక పాఠశాలలో రూ.8లక్షలతో మరుగుదొడ్ల నిర్మాణం, విద్యుత్ సౌకర్యం, తాగునీటి పనులు చేపడుతున్నారు. ఇప్పటికే 80శాతం పూర్తి కాగా, మిగతా పనులు ముమ్మరంగా జరుగుతున్నాయి.
నల్లగొండ జిల్లాలో 517 పాఠశాలల అభివృద్ధి
రామగిరి, డిసెంబర్ 5 :నల్లగొండ జిల్లా వ్యాప్తంగా 1,483 ప్రభుత్వ పాఠశాలలుండగా మన ఊరు మన బడి తొలి విడుతలో 517 పాఠశాలలను ఎంపిక చేశారు. వాటి అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.152కోట్లు కేటాయించింది. అందులో 396 పాఠశాలల్లో రూ.30లక్షల్లోపు నిధులతో విద్యాశాఖ గుర్తించిన పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. 101 స్కూళ్లలో రూ.30లక్షలకు పైగా వ్యయంతో పనులు జరుగుతున్నాయి. మరో 30 పాఠశాలల్లో పనులు దాదాపు పూర్తికాగా ప్రారంభోత్సవానికి సిద్ధం చేశారు. 17 బడులకు అడ్మిన్ పర్మిషన్ రావాల్సి ఉన్నట్లు జిల్లా విద్యాశాఖ అధికారులు వెల్లడించారు.
సూర్యాపేట జిల్లాలో 329 ..
మన ఊరు – మన బడి కార్యక్రమంలో మొదటి విడుతలో సూర్యాపేట జిల్లాలో మొత్తం 872 పాఠశాలలకు గాను 329 పాఠశాలలను ఎంపిక చేశారు. వాటిల్లో మౌలిక సదుపాయాల కల్పనకు 117.08 కోట్ల రూపాయలను ప్రభుత్వం విడుదల చేసింది. ఇప్పటికే 15కు పైగా పాఠశాలల్లో పనులు పూర్తి కాగా, మిగిలిన పాఠశాలల్లో పనులు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. మన ఊరు – మన బడి కార్యక్రమంలో ప్రభుత్వ పాఠశాలల పునర్ధ్దురణలో భాగంగా 12 రకాల పనులు చేపడుతున్నారు. మరుగుదొడ్లు, విద్యుదీకరణ, తాగునీరు, ఫర్నిచర్, పెయింటింగ్, మరమ్మతులు, ఆకుపచ్చ రాత బోర్డులు, ప్రహరీ, వంట గది, నూతన తరగతి గదులు, భోజనశాల, డిజిటల్ సౌకర్యాలు కల్పిస్తున్నారు. జిల్లాలో రూ.30 లక్షల పనుల కంటే తక్కువ ఉన్న పాఠశాలలు 265 ఉండగా, రూ.30 లక్షలకు పైగా అవసరమైన పాఠశాలలు 59 ఉన్నట్లు గుర్తించారు. ఈ నెల చివరి నాటికి లక్ష్యంలో సగానికి పైగా పనులు పూర్తి చేసేలా యుద్ధ ప్రాతిపదికన జరుగుతున్నాయి.
పనులు శరవేగంగా సాగుతున్నాయి
మన ఊరు-మన బడిలో జిల్లా వ్యాప్తంగా 517 ప్రభుత్వ పాఠశాలలు ఎంపిక చేయగా.. ప్రభుత్వం రూ.152 కోట్లు కేటాయించింది. ఉన్నతాధికారుల ఆదేశాలతో ఆయా పాఠశాలల్లో పనులు జరుగుతున్నాయి. కొన్ని పాఠశాలల్లో పనులు పూర్తయి ప్రారంభానికి సిద్ధంగా ఉన్నాయి. కార్పొరేట్‌కు దీటుగా ప్రభుత్వ బడుల్లో మౌలిక వసతులు, నాణ్యమైన విద్య అందుతుంది. సర్కారు బడుల్లో అన్ని వసతులు అందుబాటులోకి రావడంతో విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు సర్వత్రా హర్షం వ్యక్తం చేస్తున్నారు.
– బి.భిక్షపతి, నల్లగొండ డీఈఓ
త్వరలోనే పనులన్నీ పూర్తి
మన ఊరు – మన బడి కార్యక్రమంలో భాగంగా జిల్లాలో 251బడులను ఎంపిక చేశాం. రూ.30లక్షల్లోపు ఖర్చు అయ్యే స్కూళ్ల పనులు చివర దశకు వచ్చాయి. ఇప్పటికే 50దాకా పాఠశాలల్లో పనులు పూర్తయ్యాయి. త్వరలోనే మిగతా వాటిల్లోనూ పూర్తయ్యేలా చర్యలు తీసుకుంటున్నాం. నాలుగైదు రోజుల్లో ఫర్నిచర్, గ్రీన్ చాక్ బోర్డు తదితర ఎక్విప్మెంట్ రానుంది.
– నారాయణరెడ్డి, డీఈఓ, యాదాద్రి భువనగిరి జిల్లా