యాదగిరిగుట్ట, ఏప్రిల్ 25 : విరేచనాలతోపాటు కడుపునొప్పితో ప్రైవేట్ దవాఖానలో చేరిన ఓ వ్యక్తి చికిత్స పొందుతూ చెందాడు. ఆస్పత్రి నిర్వాహకుడైన ఆర్ఎంపీ వైద్యుడి నిర్లక్ష్యమే కారణమంటూ మృతుడి బంధువులు ఆందోళన చేశారు. ఈ సంఘటన యాదగిరిగుట్ట పట్టణంలో శుక్రవారం చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం పట్టణానికి చెందిన అన్నారం శివశంకర్(27) పట్టణంలోని యోగానంద నిలయం వెనుక ప్రాంతంలో హెయిర్ కటింగ్ సెలూన్తో జీవనం సాగిస్తున్నాడు. అతనికి భార్య, ఒక కూతురు ఉన్నారు. శుక్రవారం ఉదయం విరేచనాలు కావడంతో పాటు కడుపునొప్పిగా ఉందని స్థానికంగా ప్రశాంత్ నర్సింగ్ హోమ్‌కు వచ్చాడు. అందులోని ఆర్ఎంపీ వైద్యుడు ఉపేందర్ విరేచనాలు, కడుపునొప్పికి గ్లూకోస్ ఎక్కించడంతోపాటు రెండు ఇంజెక్షన్లు కూడా ఇచ్చాడు.
కడుపునొప్పి తగ్గడంతో మూత్రం వస్తుందని శిశశంకర్ బెడ్‌పై నుంచి లేచి వెళ్తున్న క్రమంలో ఒక్కసారి కుప్పకూలాడు. అతనికి వెంటే ఆక్సిజన్ అందిస్తూ గంట పాటు పరిశీలనలో పెట్టగా నొప్పి తగ్గకపోవడంతోపాటు చాతి కుడి వైపు విపరీతంగా నొప్పితో అపస్మారకస్థితికి చేరుకున్నాడు. దీంతో అప్రమత్తమైన ఆర్ఎంపీ వైద్యుడు ఉపేందర్ తన కుమారుడైన డాక్టర్ ప్రశాంత్‌తో విషయం తెలియజేసి వీడియో కాల్లో మాట్లాడాడు. ఆ తర్వాత శివశంకర్‌కు గుండెనొప్పని పసిగట్టి మెరుగైన చికిత్స నిమిత్తం భువనగిరికి తరలించాలని ఆర్పీ వైద్యుడు చెప్పాడు. శివశంకర్ బంధువులు 108కు ఫోన్ చేయగా అక్కడికి ఆలస్యంగా చేరుకుంది. ఆ తర్వాత భువనగిరి ప్రభుత్వాసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు. ఆర్ఎంపీ వైద్యుడు ఉపేందర్ నిర్లక్ష్యంతోనే శివశంకర్ మృతి చెందాడని బంధువులు ఆరోపించారు. సకాలంలో గుండెకు సంబంధించిన చికిత్సను అందిస్తే బతికేవాడంటూ మృతదేహంతో ప్రశాంత్ నర్సింగ్ హోం వద్ద బైఠాయించి ఆందోళన చేశారు. దీనిపై విచారణ జరిపి న్యాయం చేయాలని మృతుడి భార్య శ్రావణి పోలీసులకు ఫిర్యాదు చేసింది.
ప్రశాంత్ నర్సింగ్ హోం ఆర్ఎంపీ ఉపేందర్ కుమారుడైన డాక్టర్ ప్రశాంత్ పేరిట ఉంది. కానీ అక్కడ మాత్రం వైద్యుడు ప్రశాంత్ మాత్రం అందుబాటులో ఉండడని స్థానికులు తెలిపారు. డాక్టర్ ప్రశాంత్ హైదరాబాద్‌లో ఉంటూ పీజీ కోర్సును చేసేందుకు సిద్ధపడుతున్నట్లు సమాచారం. నర్సింగ్ హోంలో ఉపేందర్ అందుబాటులో ఉంటూ వైద్యాన్ని అందిస్తున్నాడని, ఏదైనా సీరియస్ రోగి వస్తే మాత్రం తన కుమారుడైన ప్రశాంత్‌కు వీడియో కాల్ చేసి పరిస్థితిని వివరించి వైద్యం చేస్తాడని తెలుస్తున్నది.