తుంగతుర్తి, ఏప్రిల్ 29 : సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండలంలో ఇందిరమ్మ ఇల్లు రాలేదని ఓ వ్యక్తి మంగళవారం వాటర్ ట్యాంక్ ఎక్కి ఆత్మహత్యా ప్రయత్నం చేశాడు. వెలుగుపల్లి గ్రామానికి చెందిన భయ్యా కనకయ్య (33) తనకు ఇందిరమ్మ ఇల్లు ఇప్పిస్తామని చెప్పి కొందరు కాంగ్రెస్ నాయకులు రూ.50 వేల డిమాండ్ చేసినట్లు తెలిపాడు. తాను అంతా ఇచ్చుకోలేనని బతిమిలాడగా రూ.20 వేలకు ఒప్పుకోగా ఆ నగదును ఫోన్ పే ద్వారా చెల్లించినట్లు వెల్లడించాడు.
అయితే ఇందిరమ్మ ఇండ్ల లిస్ట్‌లో తన పేరు లేకపోవడంతో తాను మోసపోయాయని మనస్థాపం చెంది ఆత్మహత్యకు యత్నించినట్లు తెలిపాడు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు న్యాయం చేస్తామని హామీ ఇవ్వడంతో కనకయ్య కిందకు దిగాడు. అనంతరం బాధితుడు విలేకరులతో మాట్లాడుతూ తాను నిరుపేద కుటుంబానికి చెందిన వ్యక్తినని, గుంట జాగ గాని, ఇల్లు గాని లేదని తెలిపాడు. కొందరు కాంగ్రెస్ నాయకులు, ఇందిరమ్మ కమిటీ సభ్యులు లంచాలు తీసుకుంటూ పేద ప్రజలకు అన్యాయం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశాడు. జిల్లా అధికారులు స్పందించిన న్యాయం చేయాలని కోరాడు.