నార్కట్‌పల్లి జూన్ 30 : తల్లీ బిడ్డల ఆరోగ్య రక్షణకు ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకుంటున్నా సంపూర్ణ ఫలితం దక్కడం లేదు. ప్రతియేటా పౌష్టికారం లోపం ఉన్న పిల్లలు అనారోగ్య సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారు. పౌష్టికాహార లోపం, తక్కువ బరువు, ఎత్తుకు తగిన బరువు లేకపోవడం వంటి కారణాలను చిన్నారులు ఎదుర్కొంటున్నారు. వీరంతా పేద, మధ్య తరగతులకు చెందినవారే. ఫలితంగా తరచుగా అనారోగ్యానికి గురవుతున్నారు. తక్కువ బరువుతో పుట్టన పిల్లల్లో వయసు పెరిగే కొద్దీ అనారోగ్య సమస్యలు పెరుగుతాయి. ఐదేళ్లలోపు చిన్నారులను రక్తహీనత వెంటాడుతన్నది. దీని కారణంగా చిన్నారుల్లో ఉత్సాహం, చురుకుదనం కనిపించకపోగా పిల్లలు ఆటపాటలకు దూరమవుతున్నారు. ఇటువంటి వారిని గుర్తించి పౌష్టికాహారం అందించి అనారోగ్య సమస్యల నుంచి చిన్నారులను కాపాడటంలో అధికార యంత్రాంగం విఫలమవుతున్నది.
జాతీయ పౌష్టికాహార సంస్థ సూచించిన మార్గదర్శకాలకు అనుగుణంగా చిన్నారుల ఆరోగ్య రక్షణకు ప్రభుత్వం బాలామృతం, కోడిగుడ్లు, భోజనం, పాలు సరఫరా చేస్తూనే ఉంది. ఏడు నెలల నుంచి మూడేళ్లలోపు పిల్లలకు నెలకు 16 గుడ్లు, రెండున్నర కేజీల బాలామృతం ప్యాకెట్లు అందిస్తున్నది. తీవ్ర పౌష్టికాహారం లోపం ఉన్న పిల్లలకు సూపర్వైజర్ ఫీడింగ్ కింద భోజనం పెడుతున్నది. 3-6 యేళ్లలోపు పిల్లలకు భోజనం, స్నాక్స్‌తో పాటు రోజుకు ఒకటి చొప్పున నెలకు 30 కోడిగుడ్లు సరఫరా చేస్తున్నది. వీటిని పిల్లలకు అంగన్వాడీ కేంద్రాల్లో ఉడికించి ఇవ్వాల్సి ఉంటుంది. కానీ ఇంటికి పంపించడం వల్ల సక్రమంగా పోషకాహారం అందడం లేదనే వాదనలు ఉన్నాయి.
గర్భిణులు..బాలింతలు, చిన్నారులు ఆరోగ్యంగా ఉండాలనేదే సర్కారు లక్ష్యం. ఫ్రీ స్కూల్ ఎడ్యుకేషన్, బాలామృతం, ఆరోగ్య లక్ష్మి, హెల్త్ చెకప్ వంటి కార్యక్రమాలు అంగన్వాడీ కేంద్రాల పరిధిలోనే ఉంటాయి. గర్భం దాల్చినప్పటి నుంచి పుట్టిన బిడ్డకు ఐదేళ్లు నిండే వరకు అంగన్వాడీ కేంద్రాల ద్వారా వారికి పౌష్టికాహారం అందిస్తున్నది. అలాగే వారి ఆరోగ్య సంరక్షణ బాధ్యత కూడా అంగన్వాడీ కేంద్రాలదే. అయితే అధికారులు పర్యవేక్షణ పూర్తి స్థాయిలో లేకపోడం కారణంగా సత్ఫలితాలు అందడం లేదని చర్చ వినిపిస్తున్నది. కేవలం వారోత్సవాలు, ప్రభుత్వ ఆదేశాలను అమలు చేసే సమయంలో తప్ప అధికారులు మిగతా సమయంలో పట్టించుకోవడం లేదని విమర్శలు వస్తున్నాయి.
పౌష్టికాహార సక్రమ వినియోగంపై ప్రభుత్వం యేటా పౌష్టికాహార వారోత్సవాలు నిర్వహిస్తున్నది. ఆయినా ప్రయోజనం లేకుండా పోతున్నది. కార్యక్రమాల నిర్వహణలో అధికారులకు చిత్తశుద్ధి ఉండటం లేదని, కేవలం విధి నిర్వహణలో భాగంగా నామమాత్రపు పర్యవేక్షణతో అధికారులు సరిపెడుతున్నారనే అరోపణలు ఉన్నాయి. ఎన్ని కార్యక్రమాలు చేపట్టినా అధికారుల్లో చిత్తశుద్ధి లేనప్పుడు ఏమి ప్రయోజనమని తల్లిదండ్రులు పేర్కొంటున్నారు.
బాల్య వివాహాలు, అనారోగ్యం, పేదరికం, అవగాహన లేమి తదితర కారణలతో చిన్నారుల్లో అనేక సమస్యలు వస్తున్నాయి. చిన్న వయసులో గర్భం దాల్చిన మహిళలు నెలలు నిండకుండానే ప్రసవిస్తున్నారు. అటువంటి పిల్లలకు పుట్టుకలోనే అనేక రుగ్మతలు తలెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో అంగన్వాడీ కేంద్రాల్లో గర్భిణులు, చిన్నారులకు అందిచే పౌష్టికాహారం సక్రమంగా తీసుకోకపోవడం. పోషకాహార లోపం వల్ల కలిగే ఇబ్బందులను అర్ధమయ్యేలా గర్భిణులకు, బాలింతలకు అవగాహన కల్పించలేకపోవడం, క్షేత్రస్థాయిలో ఐసీడీఎస్ అధికారుల పర్యవేక్షణ లేకపోవడం మరో ప్రధాన కారణం.
పిల్లలు ఆరోగ్యంగా ఉండాలంటే పౌష్టికాహారం క్రమం తప్పకుండా తీసుకోవాలి. అంగన్వాడీ కేంద్రాల్లో అందించే పాలు, గుడ్లతో పౌష్టికాహారం లభించడంతో సంపూర్ణ ఆరోగ్యం లభిస్తుంది. ముఖ్యంగా రక్తహీనత లేకుండా ఆకు కూరలు, పాలు, గుడ్లు ఇవ్వాల్సి ఉంటుంది. నిర్లక్ష్యం చేస్తే పౌష్టికాహార లోపంతో పిల్లల్లో అనారోగ్య సమస్యలు వస్తాయి.
– డాక్టర్ విజయ్‌కుమార్, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం