సూర్యాపేట, డిసెంబర్ 12 : తెలంగాణ సర్వీస్ పబ్లిక్ కమిషన్ ఆధ్వర్యంలో డిసెంబర్ 15, 16వ తేదీల్లో జరిగే గ్రూప్-2 పరీక్షలను జిల్లాలో పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ గురువారం అధికారులకు సూచించారు. పరీక్ష కోసం జిల్లా వ్యాప్తంగా 49 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. సూర్యాపేట రీజనల్ పరిధిలో 30 పరీక్ష కేంద్రాలు, కోదాడ పరిధిలో 19 ఏర్పాటు చేసినట్లు చెప్పారు. దాదాపు 16,857 మంది అభ్యర్థులు పరీక్షకు హాజరు కానున్నట్లు తెలిపారు.
డిసెంబర్ 15వ తేదీన ఉదయం 10 నుంచి మధ్యాహ్నం12:30 గంటల వరకు పేపర్-1, మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 5:30 గంటల వరకు పేపర్-2 పరీక్ష ఉంటుందని పేర్కొన్నారు. 16వ తేదీ ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు పేపర్-3, మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు పేపర్-4 నిర్వహించనున్నట్లు తెలిపారు. రెండ్రోజులు నాలుగు పేపర్ల చొప్పున పరీక్ష ఉంటుందని తెలిపారు. ఇన్విజిలేటర్లు, శాఖా పరమైన అధికారులు, ఫ్లయింగ్ స్వాడ్ బృందాలను నియమించేందకు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. పరీక్ష పత్రాలను పూర్తి బందోబస్తుతో తీసుకెళ్లాలని సూచించారు.
పరీక్ష కేంద్రాల పరిసరాల్లో 163 బీఎన్ఎస్ఎస్ సెక్షన్ అమల్లో ఉంటుందని తెలిపారు. పరీక్ష కేంద్రాల వద్ద వైద్య శిబిరంతో పాటు నిరంతరం విద్యుత్ సరఫరా జరిగేలా ఆయా శాఖల అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు. అభ్యర్థుల సౌకర్యం కోసం బస్సుల సమయాలను మార్చాలని ఆర్టీసీ సిబ్బందిని కోరారు. ఎలాంటి ఇబ్బందులు ఉన్నా హెల్ప్ లైన్ నంబర్లకు ఫోన్ చేయాలని కోరారు. 040-67445566, 040-222335566, కంట్రోల్ రూం నంబర్ 040-24746887, 040, 24746888లను సంప్రదించాలని కోరారు.