హైదరాబాద్, ఫిబ్రవరి23 (నమస్తే తెలంగాణ) : నాగర్‌కర్నూల్ జిల్లా కుమ్మెర జాతరలో చోటుచేసుకున్న అగ్రకుల పెత్తందారుల దాడిపై రాష్ట్రంలోని బీసీ కులసంఘాల నేతలు, మేధావులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రేవంత్‌రెడ్డి సర్కార్ తీరుపై, పోలీసుల ఉదాసీనతపై నిప్పులు చెరుగుతున్నారు. కుమ్మెరలో జరిగిన మల్లయ్య జాతర సందర్భంగా రజక కుటుంబానికి ఆలయ ప్రవేశాన్ని నిరాకరించడంతోపాటు, వారిని నిర్బంధించి దాడికి పాల్పడటం, ఈ క్రమంలో రెండు నెలల పసికందు ప్రాణాలను కోల్పోయిన అమానవీయ ఘటనను రాష్ట్రవ్యాప్తంగా బీసీ సంఘాలు, కుల సంఘాలు ముక్తకంఠంతో ఖండిస్తున్నాయి. ఆ రజక కుటుంబాన్ని గంటల పాటు గదిలో నిర్బంధించి చితకబాదడం దారుణమని మండిపడ్డారు. 8 మంది అగ్రకుల దురహంకారులను రక్షించే విధంగానే పోలీసులు వ్యవహరిస్తూ బాధితులపైనే అక్రమ కేసులు బనాయించడంపై మండిపడుతున్నారు.
కేవలం నలుగురిని మాత్రమే అరెస్ట్ చేశారని, హత్య జరిగినా హత్యాయత్నం కేసు మాత్రమే నమోదు చేయడంపై బీసీలు భగ్గుమంటున్నారు. ఈ ఘటన అనంతరం కలెక్టర్, ఎస్పీ ఆ గ్రామాన్ని ఇంతవరకూ ఎందుకు సందర్శించలేదని ప్రశ్నిస్తున్నారు. నిందితులకు నాగర్‌కర్నూల్ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలతో బంధుత్వాలు ఉన్నాయని, అందువల్లే పోలీసులు కేసును నిర్లక్ష్యం చేస్తున్నారని కులసంఘాల నేతలు మండిపడుతున్నారు. తక్షణమే హంతకులందరినీ అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు. దాడిని నిరసిస్తూ సోమవారం దళిత బహుజన సంఘాలు, ప్రజా సంఘాలు, కేవీపీఎస్ (కులవివక్ష పోరాట సమితి), వివిధ బీసీ సంఘాలు, రజక సంఘాలు, కుల సంఘాలు రాష్ట్రవ్యాప్తంగా పలుచోట్ల పెద్ద ఎత్తున నిరసన ప్రదర్శనలు చేపట్టాయి. ఘటనపై డీజీపీ శివధర్‌రెడ్డిని మాజీ మంత్రి వీ శ్రీనివాస్‌గౌడ్ నేతృత్వంలో బీఆర్ఎస్ బృందం, బీసీ జేఏసీ చైర్మన్ జాజుల శ్రీనివాస్‌గౌడ్ బృందం ఫిర్యాదులు చేశాయి. నిందితులను తక్షణమే అరెస్టు చేయాలని వారు డీజీపీని కోరారు.
కుమ్మెర ఘటనపై తెలంగాణ బీసీ కమిషన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేసింది. కులవివక్షకు గురిచేస్తూ, రజక కుటుంబంపై దాడిని ఖండించింది. ఈ ఘటనలో రెండు నెలల చిన్నారి మృతిపై తీవ్రంగా స్పందించింది. ఘటనకు సంబంధించిన పూర్తి నివేదికను మూడు రోజుల్లోగా ఇవ్వాలని నాగర్‌కర్నూల్ జిల్లా కలెక్టర్, ఎండోమెంట్ డిపార్ట్మెంట్ కమిషనర్‌ను ఆదేశించింది. ఈ మేరకు బీసీ కమిషన్ చైర్మన్ లేఖలు రాశారు. గ్రామాన్ని మంగళవారం బీసీ కమిషన్ చైర్మన్ నిరంజన్, కమిషన్ సభ్యులతో కలిసి సందర్శించనున్నారు. బాధితులతో మాట్లాడి వివరాలను సేకరించనున్నారు.