మూసీ సుందరీకరణ పేరిట ఖరీదైన భూములే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకెళ్తున్నది. మూసీ ప్రాజెక్టు పేరిట ఇప్పటికే పరీవాహక ప్రాంతాల్లోని పలుచోట్ల సర్వేలు, నోటిఫికేషన్లు వెలువరించి ప్రజలను
తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారు. రోజుకో విభాగం అధికారులు ఆయా ప్రాంతాలకు వెళ్తూ ప్రజలను భయాందోళనలకు గురి చేస్తున్నారు. బాధిత ప్రజలు ఎక్కడికక్కడ అధికారులను అడ్డుకుంటూ నిలదీస్తున్నా సర్వేలు, నోటిఫికేషన్లు ఆపడం లేదు. తాజాగా సోమవారం మూసీ పేరిట భూసర్వేను రంగారెడ్డి జిల్లా గండిపేట మండలం హిమాయత్‌సాగర్, కిస్మత్పూర్ ప్రాంతాల్లో సర్వే చేశారు. రెవెన్యూ అధికారులు సర్వేకోసం వచ్చారని తెలుసుకున్న భూముల యజమానులు.. ఆ ప్రాంతానికి చేరుకుని అధికారులను అడ్డుకునేందుకు ప్రయత్నించారు. దీంతో అధికారులు, బాధితుల మధ్య వాగ్వాదం చోటుచేసుకున్నది. బాధితులను పోలీసులతో నిలువరించి అధికారులు మాత్రం సర్వే పూర్తి చేశారు. కిస్మత్పూర్ గ్రామ పరిధిలోని సర్వే నంబర్లు 115 నుంచి 126 వరకు ఉన్న 19.13 ఎకరాల భూమికి సర్వేయర్లతో కలిసి ఆర్ఐ సూజిత్రెడ్డి మార్కింగ్ చేశారు.
సిటీబ్యూరో/ బండ్లగూడ, ఫిబ్రవరి 23(నమస్తే తెలంగాణ): గండిపేట రెవెన్యూ అధికారులు సర్వే కోసం వచ్చారని తెలిసి భూ యజమానులు పదుల సంఖ్యలో అక్కడికి చేరుకున్నారు. తమ భూముల్లో ఎందుకు సర్వే చేస్తున్నారంటూ నిలదీశారు. ఏ నిబంధనల ప్రకారం తమ భూముల్లో సర్వే చేస్తారని అడ్డుకుని కోపోద్రిక్తులయ్యారు. మూసీ నుంచి కిలోమీటర్ దూరంలో ఉన్న భూములు మీకెందుకని ఆగ్రహం వ్యక్తం చేశారు. మా భూములను ఇవ్వబోమని, ఇక్కడికి అధికారులెవరూ రావొద్దని వాగ్వాదానికి దిగారు. ఇటీవలి గ్రామ సభల్లోనూ భూములను ఇవ్వమని తేల్చిచెప్పినట్లు గుర్తు చేశారు. తమ అభ్యంతరాలపై వివరణ ఇవ్వకుండా దొంగచాటుగా వచ్చి ఎలా సర్వే చేస్తారని నిలదీశారు. ఈక్రమంలో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అధికారులు, బాధితుల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకున్నది. మూసీ ప్రాజెక్టుకు సంబంధించిన నియమనిబంధనలు, డీపీఆర్ లేకుండానే భూములను ఏలా స్వాధీనం చేసుకుంటారని ప్రశ్నించారు. తక్షణమే ఇక్కడి నుంచి వెళ్లి పోవాలని హెచ్చరించారు. దీంతో ఉన్నతాధికారులతో ఫోన్లో మాట్లాడి వెనుదిరిగారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

మూసీ సుందరీకరణకు మా భూములెందుకు?
మూసీ సుందరీకరణ చేయాలనుకుంటే మరింత లోతుకు తవ్వి మురుగును కలవనీయకుండా చేయండి. రీటెయినింగ్ వాల్స్ కట్టి పర్యాటకంగా అభివృద్ధి చేయండి. కానీ మూసీకి కిలోమీటర్ పైగా దూరమున్న మా భూములను స్వాధీనం చేసుకోవడమేంటి? రియల్ ఎస్టేట్ వ్యాపారులకు కట్టబెట్టేందుకే మా భూములను లాక్కునేందుకు ప్రయత్నిస్తున్నారు. కష్టపడి రూపాయి రూపాయి కూడబెట్టుకుని కట్టుకున్న ఒక్క ఇంటిని కూల్చుస్తామంటే చూస్తూ ఊరుకోం. మా ఇండ్లను, మా భూములను స్వాధీనం చేసుకోనివ్వం. ప్రజల ఇండ్లను కూల్చి అభివృద్ధి చేయడమేంటో అర్థం కావడం లేదు. గతంలో కేసీఆర్ ఒక్క ఇంటిని కూడా ముట్టుకోలేదు. రేవంత్‌రెడ్డి వచ్చినప్పటి కూల్చడం తప్ప చేసిందేమీ లేదు.
– మూసీ బాధితుడు, కిస్మత్పూర్