రామగిరి, పిబ్రవరి 15: ఓంకార నాదాలు …శివ నామస్మరణతో ఉమ్మడి నల్లగొండ జిల్లా వ్యాప్తంగా ముక్కంటి ఆలయాలు మార్మోగాయి. మహశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని ఆదివారం భక్తులు తెల్లవారు జామునుంచే ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. నల్లగొండ జిల్లా కేంద్రంలోని పానగల్‌లోని చారిత్రాత్మక ఛాయ, పచ్చల సోమేశ్వర ఆలయాలకు పెద్ద ఎత్తున భక్తులు తరలి వచ్చారు. సోమేశ్వరుని చెంత రోడ్డుపై కిలో మీటరు మేర భక్తులు బారులుతీరారు. పానగల్‌లోని ఆలయాలను రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, హైకోర్టు జడ్జి కె.సుజన, జిల్లా ప్రధాన న్యాయమూర్తి నాగరాజు, నల్లగొండ ఆర్డీవో అశోక్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు కంచర్ల భూపాల్‌రెడ్డి, చిరుమర్తి లింగయ్యతోపాటు పలువురు ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు పాల్గొని అభిషేకాలతోపాటు ప్రత్యేక పూజలు నిర్వహించారు. వాడపల్లిలోని మీనాక్షి అగస్త్యేశ్వరస్వామి దేవస్థానంలో ప్రముఖులు, ప్రజాప్రతినిధులు పూజలు చేశారు.
శివ నామస్మరణతో మార్మోగిన ఏలేశ్వరం గుట్ట
నందికొండ, ఫిబ్రవరి 15 : దక్షిణ కాశీగా, శ్రీశైల ఈశాన్య ద్వారంగా ప్రసిద్ధి చెందిన ఏలేశ్వరం ( మల్లయ్య ) గుట్ట ఆదివారం మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని శివనామస్మరణతో మార్మోగింది. ఏలేశ్వర గుట్టపై ఉన్న కాత్యాయనీ సమేత ఏలేశ్వర స్వామి ఆలయాలకు తెలంగాణ, ఆంధ్ర రాష్ర్టాల నుంచి వచ్చిన భక్తులతో జనసంద్రంగా మారింది. ఏలేశ్వరం గుట్టపై సుమారు కిలో మీటరు దూరంలో అతి ఎత్తైన ప్రాంతంలో సింహం ఆకారంలో ఉన్న గుట్ట చివరి భాగంలో ఉన్న ఆలయానికి భక్తులు కాలినడకన వెళ్లి మొక్కులు తీర్చుకున్నారు. తెలంగాణ పోలీసు శాఖ ఆధ్వర్యంలో భక్తులకు ఎటువంటి ఇబ్బందులు రాకుండా శాంతి భద్రతలను పర్యవేక్షించారు. నాగార్జునసాగర్‌లోని శివాలయం, మార్కండేయ స్వామి, బ్రహ్మంగారు, ఆంజనేయ స్వామి, కన్యకాపరమేశ్వరి, సత్యనారాయణ స్వామి, మల్లికార్జునస్వామి దేవాలయాల్లో మహా శివరాత్రి వేడుకలు ఘనంగా నిర్వహించారు.
శివనామ స్మరణతో మార్మోగిన శైవ ఆలయాలు
హాలియా, పిబ్రవరి 15: మహాశిరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకోని అనుముల మండలంలోని శైవ ఆలయాల్లో శివనామ స్మరణతో మార్మోగినాయి. తెల్లవారు జాము నుంచే భక్తులుశివాలయాలకు క్యూ కట్టారు. మండలంలో అతి పురాతనమైన పేరూరు భువనేశ్వరి సమేత శ్రీ స్వయంభూ సోమేశ్వరస్వామి ఆలయానికి, మల్లికార్జున స్వామి ఆలయానికి, మండలంలోని హాలియా, హాజారిగూడెం గ్రామాల్లోని శ్రీశ్రీశ్రీ జడల రామలింగేశ్వరస్వామి ఆలయాలకు భక్తులు క్యూ కట్టారు. కార్యక్రమంలో ఆలయ చైర్మన్లు రిక్కల కొండారెడ్డి, చేరుపల్లి ముత్యాలు, ఆర్చకులు రాకేశ్‌శర్మ, వినోద్శర్మలతో పాటు ఆలయ దర్మకర్తలు, భక్తులు, పాల్గొన్నారు.
పిల్లలమర్రిలో ఘనంగా మహాశివరాత్రి వేడుకలు
సూర్యాపేట రూరల్, ఫిబ్రవరి 15 : మహాశివ రాత్రి సందర్భంగా పట్టణ శివారులోని పిల్లలమర్రి గ్రామంలో వెలసిన పురాతన శివాలయంలో మహాశివరాత్రి వేడుకలను ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా శివాలయం చుట్టు పక్క గ్రామాల ప్రజలు తండోపతండాలుగా వచ్చి స్వామి వారిని దర్శించుకున్నారు. శివాలయంలో భక్తులు అర్చనలు, అభిషేకాలు చేసి మొక్కులు తీర్చుకున్నారు. భక్తులు ఎక్కువ సంఖ్యలో రావడంతో శివనామ స్మరణతో గ్రామమంతా మార్మోగిపోయింది. ఈ సందర్భంగా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్, ఎస్పీ నరసింహ శివాలయంలో ప్రత్యేక పూజలు చేసి స్వామి వారిని దర్శించుకున్నారు.