యాదగిరిగుట్ట టెంపుల్ డెవలప్మెంట్ అథారిటీ (వైటీడీఏ) పరిధి పెంపుపై రాష్ట్ర ప్రభుత్వం సమాలోచన చేస్తున్నది. రానున్న రోజుల్లో తిరుమల తరహాలో అభివృద్ధి చెందే అవకాశం ఉన్నందున విస్తరించేందుకు దృష్టి సారించింది. పది రోజుల క్రితం వైటీడీఏ అధికారులతో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి సమీక్ష నిర్వహించి పలు అభివృద్ధి కార్యక్రమాలపై ఆరా తీశారు. ఈ సందర్భంగా వైటీడీఏ పరిధిలోని నాలుగు గ్రామాలు పూర్తిగా యాదగిరిగుట్టకు సమీపంలో ఉండటంతో పలు అభివృద్ధి పనులు చేపట్టినట్టు, మిగతా మండలాలను సైతం వైటీడీఏలో విలీనం చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేయనున్నట్టు అధికారులు సీఎస్‌కు వివరించారు. ఈ మేరకు వైటీడీఏ, రెవెన్యూ అధికారులు విస్తరించే పనిలో పడ్డారు.
యాదాద్రి భువనగిరి జిల్లాలోని భువనగిరి పట్టణం మినహా భువనగిరి, యాదగిరిగుట్ట, మోటకొండూర్, తుర్కపల్లి, రాజాపేట, ఆలేరు మండలాలతోపాటు జనగామ జిల్లాలోని జనగామ, రఘునాథపల్లి మండలాలను సైతం వైటీడీఏ పరిధిలోకి తీసుకురానున్నారు. దీంతోపాటు వైటీడీఏ పరిధి విస్తరిస్తున్న నేపథ్యంలో ఆయా ప్రాంతాల్లో ఉన్న ప్రసిద్ధ, పురాతన ఆలయాలను అభివృద్ధి చేసేందుకు అధికారులు సమాయత్తమవుతున్నారు. ఇప్పటికే వైటీడీఏ అధికారులు డ్రాఫ్ట్ సిద్ధం చేస్తున్నట్టు సమాచారం. ప్రస్తుతం 104.58 చదరపు కిలోమీటర్ల పరిధి ఉండగా దీనిని 1,650.69 చదరపు కిలోమీటర్లకు విస్తరించే అవకాశం ఉన్నది. వైటీడీఏ పరిధి మరింత పెరిగితే భూముల ధరలు పెరిగే అవకాశం ఉన్నది.
– యాదగిరిగుట్ట, మే 12
యాదగిరిగుట్ట, మే 12 : యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామివారి ఆలయ పునఃప్రారంభానంతరం భక్తుల సంఖ్య విపరీతంగా పెరుగుతూ వస్తున్నది. రోజుకు సుమారు 20వేల నుంచి 30వేలు, సెలవు దినాల్లో 40వేల నుంచి 50వేల మంది భక్తులు స్వామివారిని దర్శించుకుంటున్నారు. ఈ క్రమంలో వైటీడీఏ పరిధిని మరింతగా విస్తరించాలని ప్రభుత్వం నిర్ణయించగా.. ఆ మేరకు సీఎస్ శాంతికుమారి సమీక్షించి విస్తరణకు ఆదేశాలు జారీ చేశారు. దీంతో రంగంలోకి దిగిన వైటీడీఏ, రెవెన్యూ అధికారులు విస్తరణ పనిలో పడ్డారు. ప్రస్తుతం 104.58 చదరపు కిలోమీటర్లు ఉండగా దీనిని 1,650.69 చదరపు కిలోమీటర్లకు విస్తరించే అవకాశం ఉంది. వైటీడీఏ పరిధి విస్తరిస్తున్న నేపథ్యంలో ఆయా ప్రాంతాల్లో ఉన్న ప్రసిద్ధ, పురాతన ఆలయాలను అభివృద్ధి చేసేందుకు అధికారులు సమాయత్తమవుతున్నారు. ఇప్పటికే వైటీడీఏ అధికారులు డ్రాఫ్ట్ సిద్ధం చేస్తున్నట్టు సమాచారం. వైటీడీఏ పరిధి మరింత విస్తరిస్తే భూముల ధరలు పెరిగే అవకాశం ఉన్నది.
యాదాద్రి భువనగిరి జిల్లాలో 6 మండలాలు..
యాదాద్రి భువనగిరి జిల్లాలోని భువనగిరి పట్టణంతోపాటు బీబీనగర్, బొమ్మలరామారం, చౌటుప్పల్, భూదాన్ పోచంపల్లి మండలాలను హెచ్ఎండీఏలో విలీనం చేశారు. యాదగిరిగుట్ట ఆలయానికి పక్క మండలంతోపాటు జిల్లా కేంద్రం కావడంతో ఇప్పటికే హెచ్ఎండీఏలో ఉన్న భువనగిరి పట్టణాన్ని మినహాయించి మిగతా గ్రామాలను వైటీడీఏ పరిధిలోకి తీసుకురానున్నారు. ఇప్పటికే వైటీడీఏ పరిధిలో ఉన్న గ్రామాలతోపాటు భువనగిరి రూరల్, యాదగిరిగుట్ట, ఆలేరు, మోటకొండూర్, తుర్కపల్లి మండలాలు, పక్కనే ఉన్న జనగామ జిల్లాలోని జనగామ, రఘునాథపల్లి మండలాలను వైటీడీఏలో విలీనం చేసే పనిలో
అధికారులు ఉన్నారు.
వైటీడీఏ పరిధిలోకి కొత్తగా వచ్చే మండలాలు, విస్తీర్ణం వివరాలు..
మాస్టర్ ప్లాన్ తయారీలో అధికారులు
వైటీడీఏ పరిధిలో నిర్మించే వెంచర్లు, పరిశ్రమలు, భవనాలు, రోడ్లు, ప్లాంట్లు మరో 50 ఏండ్లపాటు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండేలా మాస్టర్ ప్లాన్‌ను అధికారులు సిద్ధం చేస్తున్నారు. ఇందులో ప్రతిపాదిత భూమి వినియోగం, నివాసం, వాణిజ్యం, పారిశ్రామిక, పబ్లిక్, సెమీ పబ్లిక్, రవాణాతోపాటు నీటి వినియోగం, రిజర్వ్ ఫారెస్ట్, కన్జర్వేషన్ జోన్, బఫర్ జోన్, ఆర్గనైజబుల్ ఏరియా, ప్రత్యేక అభివృద్ధి ప్రాంతాలకు భూమిని కేటాయించనున్నారు. మరో 50 నుంచి 60 ఏండ్లపాటు చెక్కు చెదరకుండా ఉండేలా నివాస, వాణిజ్య, పారిశ్రామిక వాడలకు అనుమతులు ఇచ్చేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. చెరువులు, కుంటలు, ప్రభుత్వ భూములు, అటవీ భూములు కబ్జాకు గురి కాకుండా పక్కాగా ప్లాన్ రూపొందిస్తున్నారు. వెంచర్లు, భవన నిర్మాణ అనుమతులను పకడ్బందీగా ఇచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. పార్కులు, బోటింగ్, పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేసి మరింత సుందరంగా తీర్చిదిద్దనున్నారు.
వైటీడీఏ ప్రస్తుత పరిధి..
యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామివారి ఆలయ పునర్నిర్మాణంలో భాగంగా సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు 2015 ఫిబ్రవరి 27న యాదగిరిగుట్ట ఆలయ అభివృద్ధి ప్రాధికార సంస్థ (వైటీడీఏ)ను ఏర్పాటు చేశారు. దీనికి ముఖ్యమంత్రి కేసీఆర్ చైర్మన్‌గా వ్యవహరిస్తుండగా, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి, శిల్పారామం సృష్టికర్త కిషన్‌రావుకు వైస్ చైర్మన్ బాధ్యతలు అప్పగించారు. యాదగిరిగుట్ట మున్సిపాలిటీతోపాటు మల్లాపురం, దాతారుపల్లి, సైదాపురం, బస్వాపూర్, రాయగిరి, గంగసానిపల్లి, జమ్మాపురం, వడాయిగూడెం, ముత్తిరెడ్డిగూడెం గ్రామాలతో కలిపి 104.58 చదరపు కిలోమీటర్ల పరిధిలో వైటీడీఏ ఏర్పడింది.
శిథిలావస్థలో ఉన్న ఆలయాలకు మహర్దశ
వైటీడీఏ పరిధిలోకి రానున్న ప్రాంతంలో శిథిలావస్థలో ఉన్న ప్రసిద్ధ, చారిత్రాత్మక ఆలయాలను అభివృద్ధి చేసేలా వైటీడీఏ అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. అప్పటి రాజుల కాలంలో దైవ చింతనతో తులతూగిన ఆలయాలు, వాటి అస్థిత్వాలను కాపాడుకునేలా అధికారులు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఇప్పటికే ఆలేరు మండలంలోని కొలనుపాక గ్రామంలో క్రీ.శ. 5-15 శతాబ్దాల కాలం నాటి చారిత్రాత్మక కట్టడాలను వైటీడీఏ పునర్నిర్మిస్తున్నది.
అద్భుతమైన కొలనుపాక అస్థిత్వాన్ని కాపాడేందుకు రూ.1.79 కోట్ల వైటీడీఏ నిధులతో అభివృద్ధి పనులు చేపట్టారు. దీంతోపాటు వైటీడీఏ పరిధికి రానున్న చారిత్రాత్మక ఆలయాలను పునర్నిర్మించేందుకు వివరాలు సేకరిస్తున్నారు. ఆలేరు పట్టణంలోని రంగనాయక దేవాలయం, రాఘవపురంలో కాశిబుగ్గ దేవాలయం, మోటకొండూర్ మండల కేంద్రంలోని రామలింగేశ్వర స్వామి ఆలయం, తుర్కపల్లి మండలం వెంకటాపురంలో యాదగిరిగుట్ట దేవాలయ దత్తత ఆలయమైన వేంకటగిరి లక్ష్మీనరసింహస్వామివారి ఆలయం, గుండాల మండలంలోని సుద్దాల వేణుగోపాలస్వామి ఆలయంతోపాటు మొత్తం 8 మండలాల్లోని పురాతన దేవాలయాలు పూర్వవైభవం సంతరించుకోనున్నాయి.