యాదగిరిగుట్ట, ఆగస్టు 21 : అర్హులందరికీ రుణమాఫీ చేయాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఆలేరు పట్టణంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద రుణమాఫీ రాని 3వేల మంది రైతులతో మహాధర్నాకు దిగుతున్నట్లు మాజీ ప్రభుత్వ విప్ గొంగిడి సునీత, డీసీసీబీ మాజీ చైర్మన్ గొంగిడి మహేందర్‌రెడ్డి తెలిపారు.
గురువారం ఉదయం 10 గంటలకు ప్రారంభమయ్యే ధర్నాలో మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌రావు, దేశపతి శ్రీనివాస్‌తోపాటు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొననున్నట్లు చెప్పారు. బుధవారం యాదగిరిగుట్ట పట్టణంలో మీడియాతో వాళ్లు మాట్లాడారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో డిసెంబర్ 9న భేషరతుగా రైతులందరికీ రూ.2 లక్షల రుణమాఫీ చేస్తామని రేవంత్‌రెడ్డి హామీనిచ్చి ఇప్పుడు మోసం చేశారన్నారు.
అధికారంలోకి వచ్చి 8 నెలలైనా 60 శాతం మంది రైతులకు కూడా రుణమాఫీ చెయ్యకుండా చేతులు దులుపుకొన్నారని మండిపడ్డారు. రుణమాఫీ కాని రైతులు బ్యాంకులు, వ్యవసాయ కార్యాలయాల చుట్టూ తిరుగుతూ నానా ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వరంగల్ సభలో రాహుల్ గాంధీ సమక్షంలో ప్రకటించిన రైతు డిక్లరేషన్ ఏమైందని ప్రశ్నించారు. రుణమాఫీకి రూ.40వేల కోట్లు ఖర్చవుతుందని చెప్పి ఆ తర్వాత రూ. 31 వేల కోట్లు అని మాట మార్చి బడ్జెట్లో రూ.26 వేల కోట్లు మాత్రమే కేటాయించారని అన్నారు. విడుదలకు వచ్చే సరికి అది రూ.18 వేల కోట్లు అయ్యిందని దుయ్యబట్టారు.
దీనిపై రైతులకు రేవంత్‌రెడ్డి సమాధానం చెప్పాలన్నారు. రుణమాఫీ మాఫీ జరుగని రైతులంతా మహాధర్నాకు తరలివచ్చి విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు కర్రె వెంకటయ్య, మదర్ డెయిరీ చైర్మన్ లింగాల శ్రీకర్‌రెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ ఇమ్మడి రామిరెడ్డి, బీఆర్ఎస్ పార్టీ పట్టణ సెక్రటరీ జనరల్ పాపట్ల నరహరి, మాజీ జడ్పీటీసీ పల్లా వెంకట్‌రెడ్డి, మార్కెట్ కమిటీ మాజీ వైస్ చైర్మన్ గ్యాదపాక నాగరాజు, మాజీ ఉప సర్పంచ్ మారెడ్డి కొండల్‌రెడ్డి, ఎంపీటీసీ బీర్ల మహేశ్, రైతుబంధు మాజీ డైరక్టర్ మిట్ట వెంకటయ్య, బీఆర్ఎస్ నాయకులు అశోక్ పాల్గొన్నారు.