యాదగిరిగుట్ట, ఫిబ్రవరి23 : యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహ స్వామి అనుబంధ పర్వతవర్ధనీ సమేత రామలింగేశ్వర స్వామివారి ఆలయంలో మహా శివరాత్రి ఉత్సవాలను వచ్చే నెల 5నుంచి 10 వరకు నిర్వహించనున్నట్లు ఆలయ ఈఓ రామకృష్ణారావు తెలిపారు. 5న ఉదయం 10.30 గంటలకు స్వస్తివాచనం, 6న ఉదయం ధ్వజారోహణం, భేరీపూజ, దేవతాహ్వానం, అగ్నిప్రతిష్ఠ నిర్వహించనున్నామని పేర్కొన్నారు. 7వ తేదీ రాత్రి 7 గంటలకు పర్వతవర్ధనీ సమేత రామలింగేశ్వర స్వామివారి కల్యాణోత్సవం,
8న మహాశివరాత్రి సందర్భంగా అభిషేకం, రాత్రి లింగోద్భవ కాలంలో మహాన్యాస పూర్వక శత రుద్రాభిషేకం, 9న ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు లక్ష బిల్వార్చన, 10న మధ్యాహ్నం పూర్ణాహుతి, రాత్రి డోలోత్సవం జరిపించనున్నట్లు తెలిపారు. కల్యాణంలో పాల్గొనే భక్తులు రూ. 516, మహాశివరాత్రి రోజున జరిగే అభిషేకానికి రూ 300, శతరుద్రాభిషేకానికి రూ. 516, లక్ష బిల్వార్చనలో పాల్గొనే భక్తులు రూ. 516 చెల్లించాల్సి ఉంటుందని పేర్కొన్నారు.