యాదగిరిగుట్ట, ఫిబ్రవరి12: యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయానికి అనుబంధంగా కొనసాగుతున్న శ్రీపర్వతవర్ధినీ సమేత శ్రీరామలింగేశ్వరస్వామి ప్రధానాలయంలో మహా శివరాత్రి ఉత్సవాలకు శివాలయ ప్రధానార్చకులు, ప్రధాన పూజారులు గురువారం శ్రీకారం చుట్టారు. ఆరు రోజుల పాటు జరిగే ఈ ఉత్సవాల్లో తొలిరోజు ఆలయంలో ఉదయం 11.30 గంటలకు స్వస్తివాచనం నిర్వహించారు. విశ్వశాంత్యర్థం ఈ వేడుక నిర్వహిస్తారు. స్వస్తివాచనంతో లోకంలోని సర్వవిఘ్నాలు, సర్వవిధ దోషాలు తొలగి ఈశ్వరానుగ్రహం కలగాలని, శైవాగమ సాంప్రదాయ రీతిలో ఈ వేడుక జరిపించారు.
అనంతరం విఘ్వేశ్వర ఆరాధన జరిపించారు. శుద్ధమైన, పవిత్రమైన జలంతో వేదమంత్ర పఠనంతో పూజ ద్రవ్యాలను ఆలయ పరిసర ప్రాంతాల్లో ప్రోక్షణ గావించి శుద్ధి పుణ్యాహావచన కార్యక్రమం చేపట్టారు. మహాశివరాత్రి ఉత్సవాల్లో భాగంగా రక్షా బంధనాలకు శాస్ర్తోక్తంగా పూజాదికాలు నిర్వహించి, పార్వతీపరమేశ్వరులకు ధరింపజేసి,అనంతరం ఉత్సవాలు పరమేశ్వర అనుగ్రహంతో సక్రమంగా జరగాలని ఆలయ ఈవో భవానీ శంకర్, అనువంశిక ధర్మకర్త నరసింహమూర్తి, యాజ్ఞీకులు, ఆలయ అర్చకులు, భక్తులను రక్షబంధనాలను ధరింపజేశారు.
మహా శివరాత్రి ఉత్సవాలలో భాగంగా సాయంత్రం పారాయణీకులచే నమక, చమక పారాయణాలు, మంత్రపుష్ప పఠనం, అంకురారోపణం, సోమకుంభ, కలశ స్థాపన, దేవతారాధన వంటి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం భక్తులకు తీర్థప్రసాద వితరణ గావించారు. ఈ వేడుకల్లో ఆలయ ఈవో భవానీ శంకర్, అనువంశిక ధర్మకర్త నరసింహమూర్తి, శివాలయం ప్రధాన పూజారి గౌరిభట్ల సత్యనారాయణ శర్మ, శివాలయ ప్రధానార్చకులు గౌరిభట్ల నరసింహ్మరాముల శర్మ, ఆలయ అర్చకులు పాల్గొన్నారు. నేడు దేవతాహ్వానం.. ఉత్సవాల్లో భాగంగా అనుంబంధ పర్వతవర్థినీ రామలింగేశ్వరస్వామి ఆలయంలో శుక్రవారం ధ్వజ పటారోహణం, భేరీ పూజ దేవతాహ్వానం, అగ్ని ప్రతిష్ఠ వంటి పూజలు జరుగనున్నాయి.