తిరుమలగిరి మే 29 : కస్టమ్ మిల్లింగ్ రైస్ (సీఎంఆర్)ను పక్కదారి పట్టించారన్న ఆరోపణలపై తిరుమలగిరి మండల కేంద్రానికి చెందిన సూర్యాపేట జిల్లా రైస్ మిల్లర్స్ అసోయేషన్ మాజీ అధ్యక్షుడు ఇమ్మడి సోమనర్సయ్య, ఆయన సోదరుడు సోమయ్యను పోలీసులు ఆదివారం అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. కాగా బుధవారం తిరుమలగిరి మండల కేంద్రంలోని వారి నివాసంతోపాటు తొండ గ్రామంలోని సంతోషి రైస్ మిల్, నాగారం మండల పరిధిలోని రఘురామ రైస్ మిల్ను అధికారులు సీజ్ చేసి తాళాలు వేళారు.
రూ.100 కోట్లకు పైగా ప్రభుత్వ ఖజానాకు వీరు గండి కొట్టినట్లు ఆరోపణలు ఉన్నాయి. 2020-21 సంవత్సరానికి సంబంధించి తొండ గ్రామంలోని సంతోషి రైస్ మిల్ నుంచి రూ. 91.31 కోట్లు, నాగారం మండల పరిధిలోని ప్రగతి నగర్ రఘురామ రైస్ మిల్ నుంచి రూ. 7.71 కోట్ల విలువైన ధాన్యం బకాయి ఉన్నట్లు అధికారులు గతంలో లెక్కలు చెప్పారు.