‘తమ్ముడు.. మన గల్లీల గణపతి పండుగ మంచిగ జరగాలె.. అన్ని ఏర్పాట్లు మస్తు చేయాలె.. నవరాత్రులు ధూంధాంగా ఉండాలె.. ఏం ఉన్నా నేను చూస్కుంట.. మనోళ్లను మనం చూస్కోపోతే ఎట్ల.. నన్ను మాత్రం మర్చిపోవద్దు..’
బ్రదర్.. మన వీధిలో వినాయకుడికి మంచి క్రేజ్ ఉంది. నవరాత్రులు అన్నదానం నేనే స్పాన్సర్ చేస్తా.. కార్యక్రమం పెద్దఎత్తున చేయాలె.. నిమజ్జనం రోజున డీజే, ఇతర ఖర్చులు నేనే పెట్టుకుంటా.. యువత మొత్తం మన దిక్కు ఉండాలి.’
‘ఇటీవల ఓ ప్రజాప్రతినిధి తన అనుకున్న వారితో మేడారం ట్రిప్ వేశారు. అక్కడ ఖర్చులన్నీ సదరు ఆశావహుడిదే. వచ్చినోళ్లందరికీ మంచి దావత్. సుక్క, ముక్క తప్పనిసరి.. మంచి మర్యాదలు.. గ్రిప్‌లో పెట్టుకునేందుకు జిమ్మిక్కులు’
యాదాద్రి భువనగిరి, సెప్టెంబర్ 8 (నమస్తే తెలంగాణ) : పల్లెల్లో పంచాయతీ ఎన్నికల పాలిటిక్స్ అప్పుడే షురూ అయ్యాయి. గ్రామాల్లో స్థానిక సంస్థల ఎన్నికల సందడి మొదలైంది. ఆశావహులంతా ప్రజలను ప్రసన్న చేసుకునే పనిలో ఉన్నారు. వివిధ ప్రాంతాలకు తీసుకెళ్తూ దావత్ ఇస్తూ మచ్చిక చేసుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. తాజాగా పోటాపోటీగా వినాయక చందాలు, విగ్రహాలను ఇప్పించారు. డబ్బులకు వెనకాడకుండా లక్షల్లో ఖర్చు చేస్తున్నారు.
ఈ ఏడాది ఫిబ్రవరిలో సర్పంచుల పదవీ కాలం ముగిసింది. త్వరలో ఎన్నికలు నిర్వహించనున్నారు. ఇప్పటికే ఓటరు జాబితా షెడ్యూల్ విడుదల చేయగా, ఆ ప్రక్రియ కొనసాగుతున్నది. ఈ క్రమంలో ఆశావహులు ప్రజల్లో మంచి పేరు సంపాదించడమే లక్ష్యంగా ముందుకెళ్తున్నారు. జనాలను ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డారు.
చందాలు.. విగ్రహాలు.. డెకోరేషన్..
జిల్లా వ్యాప్తంగా గణేశ్ నవరాత్రులు ఘనంగా జరుగుతున్నాయి. వాడవాడలా, గల్లీగల్లీలా చిన్నాపెద్దా ఒక్క దగ్గరికి చేరి వైభవంగా నిర్వహిస్తున్నారు. దీన్నే అదునుగా భావించిన వివిధ పార్టీల నేతలు పబ్లిసిటీతోపాటు, మంచి పేరు సంపాదించుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. స్థానిక గణేశ్ నిర్వాహకులు ఎంత అడిగితే అంత చందాలు సమర్పించుకుంటున్నారు. ఇప్పటికే గణేశ్ విగ్రహాలను ఇప్పించారు. నేతల పేరు మీద అన్నదానం, లైటింగ్, డెకోరేషన్, ఇతర సాంస్కృతిక కార్యక్రమాలు షురూ చేశారు. వాడవాడలా తిరుగుతూ అందరినీ కలుస్తున్నారు. నిమజ్జనం రోజున డీజేలు, ఇతర ఖర్చులు తామే భరిస్తామని హామీ ఇస్తున్నారు. ఇంకొందరు నాగార్జునసాగర్, శ్రీశైలం, విజయవాడ తదితర టూరిస్ట్ ప్రాంతాలకు నిమజ్జనానికి ఫ్రీగా తీసుకెళ్తామని చెబుతున్నారు.
లక్షల్లో ఖర్చులు..
రానున్న ఎన్నికల్లో పోటీ చేసే ఆశావహులు ఖర్చు మాత్రం వెనుకాడటం లేదని తెలుస్తున్నది. ముఖ్యంగా అధికార కాంగ్రెస్ నేతలు తగ్గడం లేదు. ఆయా ఏరియాను బట్టి ఖర్చు చేస్తున్నారు. ఒక్కో నేత రూ.2 నుంచి 5లక్షల దాకా ఖర్చు చేస్తున్నట్లు సమాచారం. రూరల్ ఏరియాల్లో ఒక్కో నేత రెండు లక్షలు, అర్బన్ ప్రాంతాల్లో నాలుగైదు లక్షల దాకా ఖర్చు చేస్తున్నట్లు తెలుస్తున్నది.
టూర్లు.. దావత్‌లు
ఇప్పటికే పలువురు నేతలు తమ వారు అనుకున్న వాళ్లకు మంచి దావత్‌లు ఇస్తున్నారు. ఇతర పర్యాటక, ఆధ్యాత్మిక ప్రాంతాలకు తీసుకెళ్తున్నారు. కార్లు, డీసీఎంలలో తరలిస్తున్నారు. మేడారం, సిద్దులగుట్ట, కొండ పోచమ్మ సాగర్ వద్దకు తీసుకెళ్లి దావత్‌లు ఇస్తున్నారు. సుక్క, ముక్కకు కొదువ లేకుండా చూసుకుని.. మంచి మర్యాదలు చేస్తున్నారు. ఇక ఎన్నికల మరింత దగ్గర పడ్డాక గోవా, యానాం టూర్లకు ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే స్థానికులకు హామీలు ఇస్తున్నారు.