కోదాడ, ఆగస్టు 29 : స్థానిక సంస్థల ఎన్నికల్లో 42 శాతం రిజర్వేషన్లు అమలు చేస్తూ ఎన్నికలు నిర్వహించాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం సూర్యాపేట జిల్లా అధ్యక్షుడు పొనుగోటి రంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మునగాల మండల కేంద్రంలో శుక్రవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ నెల 31న హైదరాబాద్లోని రవీంద్రభారతిలో బీసీల యుద్ధభేరి నిర్వహిస్తున్నట్లు చెప్పారు. పార్టీ పరంగా 42 శాతం టికెట్లు ఇస్తామంటే ఒప్పుకునేది లేదని, చట్టపరమైన హక్కుగా 42 శాతం రిజర్వే షన్లు ఇవ్వాలన్నారు. సీఎం రేవంత్ రెడ్డి బీసీ రిజర్వేషన్లు పెంచే విషయంలో ఘర్షణ వైఖరి అవలంభించకుండా సాధించే మార్గాలు పరిశీలించాలన్నారు.
అఖిలపక్ష సమావేశాలు, బీసీ సంఘాల సమావేశాలు, న్యాయ నిపుణులు, అడ్వకేట్లతో సమావేశాలు జరిపి పరిష్కార మార్గాలు సాధించాలని కోరారు. బీసీల యుద్ధభేరికి వివిధ బీసీ సంఘాల నాయకులు, బీసీ ఉద్యమకారులు, మేధావులు, విద్యార్థి సంఘాల నాయకులు అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. సమావేశంలో బీసీ విద్యార్థి సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు పోలోజు మహేశ్ చారి, కోదాడ నియోజకవర్గం బీసీ యువజన సంఘం అధ్యక్షుడు గడ్డం లక్ష్మీనారాయణ, జిల్లా నాయకులు వీరయ్య, మహేశ్, ప్రవీణ్ పాల్గొన్నారు.