నల్లగొండ రూరల్, జులై 10 : క్యాబినేట్ సమావేశంలోనే ఎన్నికల ముందు చెప్పిన కామారెడ్డి డిక్లరేషన్ , 42 శాతం బీసీ రిజర్వేషన్‌కు చట్టబద్దత కల్పించిన తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని బీసీ ప్రజా ప్రతినిధుల ఫోరం ప్రతినిధులు డిమాండ్ చేశారు. బీసీ ప్రజా ప్రతినిధుల ఫోరం అధ్వర్యంలో ఈ నెల 15న హైదరాబాద్‌లో తలపెట్టిన మహాదర్నా పోస్టర్‌ను నల్లగొండ జిల్లా కేంద్రంలోని గడియారం సెంటర్లో వారు ఆవిష్కరించి మాట్లాడారు. 33 శాతం మహిళా రిజర్వేషన్లలో కూడా బీసీ మహిళలకు అవకాశం ఇవ్వాలన్నారు. ప్రభుత్వం ఈ డిమాండ్లను అమలు చేయని పక్షంలో పార్టీలకు అతీతంగా పోరాటం చేయనున్నట్లు చెప్పారు. ఇందులో రాష్ట్రంలోని బీసీ సామాజిక ప్రజా ప్రతినిధులతో పాటు ప్రజలను భాగస్వామ్యం చేయనున్నట్లు వెల్లడించారు.
ఇందిరా పార్క్ వద్ద తలపెట్టిన మహాధర్నాకు వార్డు మెంబర్ నుండి ఎమ్మెల్యే స్థాయి వరకు బీసీ బిడ్డలు పెద్ద ఎత్తున హాజరై విజయవంతం చేయాలని కోరారు. అప్పటికీ ప్రభుత్వం స్పందించకపోతే సకలజనుల సమ్మె తరహాలో మరో ఉద్యమం చేపట్టనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఎంపీటీసీల సంఘం అధ్యక్షుడు గడిల కుమార్, వర్కింగ్ ప్రెసిడెంట్ దేవి రవీందర్, రాష్ట్ర సర్పంచుల సంఘం జేఏసీ అధ్యక్షుడు సుర్వి యాదయ్య, ప్రణీల్ చందర్, గుండెబోయిన జంగయ్య, ప్రకాశ్, వీరేశ్, రాజేశ్, సాగర్, మల్లేశ్ గౌడ్, యాదయ్య పాల్గొన్నారు.