నల్లగొండ, సెప్టెంబర్ 30 : ఎలాంటి తప్పులు దొర్లకుండా జడ్పీటీసీ, ఎంపీటీసీ, గ్రామ పంచాయతీ ఎన్నికలను నిర్వహించాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి అధికారులను ఆదేశించారు. మంగళవారం నల్లగొండ జిల్లా కేంద్రంలోని దేవరకొండ రోడ్ లో ఉన్న ప్రతీక్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో గ్రామ పంచాయతీ ఎన్నికల ప్రెసిడింగ్ అధికారులకు ఏర్పాటు చేసిన ఎన్నికల శిక్షణ కార్యక్రమానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ఎన్నికల నిర్వహణ విషయమై ఇస్తున్న శిక్షణను సద్వినియోగం చేసుకోవాలని, ఎన్నికల నియమ, నిబంధనల పట్ల పూర్తి అవగాహన కలిగి ఉండాలన్నారు. పీఓ హాండ్ బుక్ ను క్షుణ్ణంగా చదవాలని చెప్పారు. పోలింగ్ కేంద్రంలోకి ఎలాంటి మొబైల్ ఫోన్లు, ఎలక్ట్రానిక్ వస్తువులకు అనుమతి ఉండదని, అలాగే ఎన్నికల కమిషన్ అనుమతించిన వారిని మాత్రమే పోలింగ్ కేంద్రంలోకి అనుమతించాలని చెప్పారు.
పోలింగ్ కేంద్రాల్లో కనీస సౌకర్యాలన్నీ ఉండాలని, ప్రత్యేకించి ఓటింగ్ కంపార్ట్మెంట్ పూర్తిగా లైటింగ్ ఉండేలా చూసుకోవాలన్నారు. ఎన్నికలకు సంబంధించిన స్టాచ్యుటరీ, నాన్ స్టాచ్యుటరీ సామగ్రి పట్ల పూర్తి జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు. ప్రత్యేకించి చెక్ లిస్టులను ఏర్పాటు చేసుకుని చెక్ లిస్ట్ ప్రకారం మెటీరియల్‌ను సరిపోల్చుకోవాలని సూచించారు. పోలింగ్‌కు సంబంధించిన సామగ్రి పోలింగ్ పూర్తయ్యే వరకు జాగ్రత్తగా పరిశీలించాలన్నారు. ఎన్నికల విధులకు కేటాయించిన ఉద్యోగులందరూ తప్పనిసరిగా విధులకు హాజరు కావాలని, లేనట్లయితే ఎన్నికల నియమ, నిబంధనల ప్రకారం చర్యలు తీసుకోవడం జరుగుతుందని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో స్థానిక సంస్థల ఎన్నికల శిక్షణ అధికారి, గృహ నిర్మాణ పీడీ రాజ్ కుమార్ పాల్గొన్నారు.
Nalgonda : స్థానిక సంస్థల ఎన్నికలను సమర్థవంతంగా నిర్వహించాలి : కలెక్టర్ ఇలా త్రిపాఠి