అదిగో.. ఇదిగో అంటూ నాలుగో విడుతల వరకూ నెట్టుకు వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇప్పటికీ సంపూర్ణంగా రుణమాఫీ చేసేందుకు మనస్సు రాలేదు. ఆగస్టు 15 వరకు మూడు విడుతలుగా రుణమాఫీ చేయగా, అప్పటికీ ఉమ్మడి నల్లగొండ జిల్లాలో కనీసం మరో రెండు లక్షలకు పైగా రైతులు రుణమాఫీకి దూరంగా ఉన్నారు. వారంతా మరో విడుతలో మాఫీ అవుతుందని ఎదురుచూస్తూనే ఉన్నారు. మూడున్నర నెలల తర్వాత నాలుగో విడుత మాఫీని ప్రకటించినా అందులోనూ మరో 50 వేల మంది వరకే మోక్షం కలిగింది. మిగతా వారికి రుణమాఫీ జరుతుందా, లేదా అన్నది సందేహంగా మారింది. ఆది నుంచి రుణమాఫీ విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం లబ్ధిదారుల సంఖ్యను, వారి కోసం వెచ్చించాల్సిన డబ్బును ఎంత వీలైతే అంత కుదించేందుకు ప్రయత్నిస్తున్నది. పలు రకాల సర్వేల తర్వాత కూడా అందరికీ రుణమాఫీ కాకపోవడంతో రైతులు తీవ్రంగా మండిపడుతున్నారు.
మూడు విడుతల అనంతరం రుణమాఫీ కాని వారిలో రేషన్‌కార్డు లేని వాళ్లు, ఒక కుటుంబంలో ఉన్న వ్యక్తులకు రెండు లక్షలకు మించి రుణం ఉన్నవాళ్లు, ఆధార్, బ్యాంకు అకౌంట్, పట్టాదారు పాస్‌పుస్తకం నెంబర్లతోపాటు పేర్లు సరిపోలకపోవడం వంటి సమస్యల వాళ్లు ఉన్న విషయం తెలిసిందే. నిజానికి రుణమాఫీ కాకపోవడానికి 31 కారణాలు ఉన్నాయని స్వయంగా రాష్ట్ర వ్యవసాయ శాఖనే గుర్తించి ప్రభుత్వానికి నివేదించింది. అలాంటి వారంతా రుణమాఫీ కోసం అప్పట్లో రోడ్లెక్కారు. బీఆర్ఎస్, ఇతర విపక్ష నేతలు, రైతు సంఘాల ఆధ్వర్యంలో ఆందోళనలకు దిగారు. దాంతో ప్రభుత్వం తప్పనిసరి పరిస్థితుల్లో రుణమాఫీ కాని వారి వివరాల సేకరణ పేరుతో సర్వేకు ఆదేశాలిచ్చింది.
ముందుగా రేషన్ కార్డు లేని వారి కుటుంబ నిర్ధారణ కోసం ఫొటోలు దింపుతూ వివరాలు సేకరించింది. సాంకేతిక కారణాలు, పేర్లు, అకౌంట్లుల్లో తప్పులు ఉన్న వారి నుంచి తగిన ఆధారాలు తీసుకుంఇది. దాంతో వారంతా నాలుగో విడుత రుణమాఫీపై ఆశలు పెట్టుకున్నారు. తీరా ఐదు రోజుల కిందట వచ్చిన జాబితాలోనూ అతికొద్దిమందికే మాఫీ చేస్తున్నట్లు ప్రకటించడంతో విస్తుపోయారు. ఇందులో ఎక్కువగా రేషన్ కార్డు లేకుండా 2లక్షల వరకు రుణమాఫీ ఉన్న వారికే మాఫీ చేసినట్లుగా జాబితాలు స్పష్టం చేస్తున్నాయి. మరో లక్షన్నర మంది రైతులు ఉమ్మడి జిల్లాలో మరోవిడత రుణమాఫీ కోసం ఎదురుచూడక తప్పడం లేదు.
సాంకేతిక కారణాలతో పెండింగ్‌లో ఉన్న రూ.30వేలు, 40 వేల రుణాలున్న రైతులవి సైతం మాఫీ కాకపోవడం విస్మయం కలిగిస్తున్నది. ఇక రూ.2లక్షలకు పైబడి రుణాలున్న రైతులవి సైతం రూ.2లక్షల వరకు మాఫీ చేస్తామని ప్రభుత్వ పెద్దలు చెప్పారు. వారివి కూడా ఇప్పటికీ పెండింగ్‌లోనే ఉన్నాయి. మూడో విడత అనంతరం రూ.2లక్షలకు పైబడి రుణం ఉన్న రైతులకు అదనంగా ఉన్న అప్పును బ్యాంకులకు చెల్లిస్తే మాఫీ చేస్తామని చెప్పడంతో అప్పట్లోనే చాలామంది రైతులు అప్పుసొప్పు చేసి డబ్బులు కట్టారు. కానీ ఇలాంటి రైతుల రుణమాఫీ ప్రస్తావన నాలుగో విడతలోనూ ఊసేలేదు. నిర్ధిష్టమైన గడువు ఏదీ పెట్టలేదు. ప్రభుత్వానికి రుణమాఫీ విషయంలో చిత్తశుద్ధి లేకపోవడంతోనే రైతులు ఇబ్బందికి గురవుతున్నారన్నది నిజం. ఎంత వీలైతే అంత సాగదీయడమే లక్ష్యమన్నట్లుగా ప్రభుత్వ వ్యవహారశైలి కనిపిస్తున్నదని రైతు సంఘాల నాయకులు విమర్శిస్తున్నారు. తిరిగి తిరిగి విసిగి వేసారి చివరకు రైతులే రుణమాఫీపై ఆశలు వదులుకునేలా చేయడమే ప్రభుత్వ వ్యూహమన్నట్లుగా తెలుస్తున్నది.
కేసీఆర్ హయాంలో ఇలా…
గతేడాది ఆగస్టులో కేసీఆర్ సర్కార్ చేసిన రుణమాఫీలో ఇలాంటి చిక్కులేవీ లేవు. 2018 ఎన్నికల హామీలో భాగంగా కేసీఆర్ ప్రకటించిన లక్ష రూపాయల రుణమాఫీలో రూ.99,999 వరకు చేశారు. అప్పట్లో పాస్పుస్తకమే ప్రామాణికంగా రుణమాఫీ చేయడంతో దాదాపు రుణాలు తీసుకున్న రైతులందరికీ రుణమాఫీ లబ్ధి చేకూరింది. కేసీఆర్ పాలనలో రూ.99,999 వరకు రుణమాఫీని అమలు చేస్తేనే ఉమ్మడి జిల్లాలో 4,00,518 మంది రైతులకు మొత్తం రూ.2159.77 కోట్ల ప్రయోజనం జరిగింది. ప్రస్తుతం నాలుగు విడుతల్లో కలిపి రూ.2లక్షల వరకు రుణాలు మాఫీ చేసినా రైతుల సంఖ్య నాలుగు లక్షలకు చేరుకోలేదు. కేసీఆర్ హయాంలో లక్ష లోపు రుణమాఫీ జరిగిన రైతుల సంఖ్యనే ప్రస్తుతం రెండు లక్షల రుణమాఫీ జరిగిన రైతుల సంఖ్య కంటే ఎక్కువ ఉండడం గమనార్హం.
రైతులను ముంచుతున్న రేవంత్ సర్కారు
ఎన్నికల ముందు 2 లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పిన రేవంత్ రెడ్డి సీఎం అయ్యాక రైతులు నిండా ముంచుతున్నాడు. నేను లక్షా 61 వేల 650 రూపాయలు వ్యవసాయ రుణం తీసుకున్నా. ప్రభుత్వ నిబంధనల కటాఫ్ డేట్లోనే ఉంది. రేషన్ కార్డు లేదు. కుటుంబ నిర్ధారణ లిస్టులో పేరు వస్తే సంబంధిత పత్రాలను అధికారులకు ఇచ్చా. మూడో లిస్టులో రుణమాఫీ అవుతుందనుకున్నా. కానీ ప్రభుత్వం ప్రకటించిన జాబితాలో నా పేరు రాలేదు. వ్యవసాయాధికారులు, బ్యాంకు అధికారులను అడిగినా సమాధానం లేదు. కాంగ్రెస్ ప్రభుత్వం చేతగాని మాటలు చెప్తూ రైతులను మోసం చేస్తున్నది.
– ఎర్రమాద నితీశ్‌కుమార్‌రెడ్డి, పెద్దసూరారం, నల్లగొండ మండలం
రుణమాఫీ కాలేదు
నాకు ఐదెకరాల భూమి ఉంది. సిండికేట్ బ్యాంకులో లక్ష రూపాయల రుణం తీసుకున్నాను. మొదటి విడుతలో ప్రకటించిన రుణమాఫీ జాబితాలో నా పేరు రాలేదు. రెండో విడుతలో అవుతుందేమోనని ఆశగా ఎదురు చూశాను. అయినా కాలేదు. అధికారులను ఎన్నిసార్లు అడిగినా ఫలితం లేకపోయింది. ఇప్పటికీ నా లోన్ మాఫీ కాలేదు.
-పందిరి నాగయ్య, రైతు, గంగానగర్, గరిడేపల్లి మండలం