రైతు రుణ మాఫీ అమలు సంపూర్ణం చేసే దిశగా సర్కారు చర్యలు మొదలు పెట్టింది. 2018 ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం ఒక్కో రైతు కుటుంబానికి లక్ష రూపాయల వరకు రుణ మాఫీ జరుగనున్నది. గురువారం నుంచి వచ్చే నెల రెండో వారం లోపు అర్హులైన రైతులందరికీ విడుతల వారీగా రుణమాఫీ డబ్బును ఖాతాల్లో జమ చేయాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు. 45 రోజుల్లో ప్రక్రియ పూర్తి కావాలని స్పష్టం చేశారు. ఇప్పటికే రూ.37వేల వరకు రుణాలు తీసుకున్న వారికి రుణ మాఫీ వర్తింపు చేశారు. లక్ష రూపాయల వరకు రుణం తీసుకున్న మిగిలిన వారికి ప్రయోజనం చేకూరనున్నది. ఇప్పటికే సంబంధిత రైతుల వివరాలన్నీ ప్రభుత్వం వద్ద సిద్ధంగా ఉన్నాయి. సర్కారు నిర్ణయంతో ఉమ్మడి నల్లగొండ జిల్లాలో సుమారు ఐదున్నర లక్షల మంది రైతులకు లబ్ధి జరుగనున్నట్లు అంచనా. తాజాగా సీఎం కేసీఆర్ ఆదేశాలపై ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. రైతు పక్షపాతి అయిన సీఎం కేసీఆర్‌తోనే ఇలాంటివన్నీ సాధ్యమని ప్రశంసిస్తున్నారు. గురువారం జిల్లా వ్యాప్తంగా రైతులతో కలిసి బీఆర్ఎస్ శ్రేణులు సంబురాలు నిర్వహించాలని ఆ పార్టీ నల్లగొండ జిల్లా అధ్యక్షుడు రమావత్ రవీంద్రకుమార్ పిలుపునిచ్చారు.
ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా లక్ష రూపాయల లోపు రుణాలు తీసుకున్న రైతులకు సీఎం కేసీఆర్ శుభవార్త చెప్పారు. 2018 ఎన్నికల సమయంలో సీఎం కేసీఆర్ రైతుల గురించి ఆలోచన చేస్తూ లక్ష రూపాయల వరకు రుణమాఫీ పథకాన్ని ప్రకటించిన విషయం తెలిసిందే. 2018 డిసెంబర్11 నాటికి రాష్ట్రంలోని ఏదైనా బ్యాంక్ నుంచి లక్ష రూపాయల వరకు వ్యవసాయ రుణాలు పొంది ఉన్న రైతులందరికీ రుణమాఫీని వర్తింపజేయనున్నట్లు ప్రకటించారు. మొత్తం నాలుగు విడుతల్లో దశలవారీగా దీన్ని పూర్తి చేయనున్నట్లు కూడా అధికారంలోకి రాగానే ప్రకటించారు. 2019 ఫిబ్రవరిలో జరిగిన రాష్ట్ర బడ్జెట్ సమావేశంలో తొలి విడుత రుణమాఫీ కోసం ప్రత్యేకంగా రూ.6వేల కోట్లను కేటాయించారు. ఆ మేరకు అదే ఏడాది తొలి విడుతలో రూ.25వేల రూపాయల వరకు రుణాలు తీసుకున్న రైతులందరికీ రుణమాఫీని వర్తింపజేశారు. ఆ తర్వాత ఏడాది రెండో విడుత రుణమాఫీని అమలు చేసే క్రమంలో కేంద్ర ప్రభుత్వం నోట్ల రద్దు, కరోనా విపత్తు లాంటివి తలెత్తిన విషయం తెలిసిందే. 2020 మార్చిలో కరోనా తీవ్ర రూపం దాల్చడం, రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ స్తంభించడంతో ఇబ్బందులు తలెత్తాయి. 2021 సంవత్సరం చివరి వరకు కూడా కరోనా వెంటాడుతూనే వచ్చింది. వీటితోపాటు నిధుల విడుదలపై కేంద్ర ప్రభుత్వ ఆంక్షలు, ఎఫ్ఆర్బీఎం నిధుల్లో కోతలు.. ఇలా అనేక ప్రతికూల పరిస్థితులు తలెత్తాయి. ఈ నేపథ్యంలో ఇతర పలు పథకాలతోపాటు రుణమాఫీ అమలుపైనా ప్రభావం పడింది. ఇన్ని ఇబ్బందుల నడుమ వ్యవసాయం సక్రమంగా సాగేందుకు రైతుబంధు, రైతుబీమా, ఉచిత విద్యుత్, పంటల కొనుగోలు లాంటి పథకాలను సీఎం కేసీఆర్ పట్టుదలతో కొనసాగిస్తూ వస్తున్నారు. రుణమాఫీకి ఆర్థికంగా కొంత వెసులుబాటు కోసం వేచి చూశారు. ప్రస్తుతం ఆర్థిక పరిస్థితి తిరిగి గాడిలో పడుతున్న క్రమంలో గతంలో ఇచ్చిన హామీ మేరకు లక్ష రూపాయల వరకు రుణమాఫీని తక్షణమే వర్తింపజేసేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. దాంతో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా సుమారు ఐదున్నర లక్షల మంది లబ్ధిదారులకు ప్రయోజనం కలుగనున్నది.
రైతు రుణమాఫీపై గొప్ప నిర్ణయం తీసుకున్న సీఎం కేసీఆర్‌కు మద్దతుగా గురువారం నల్లగొండ జిల్లాలోని అన్ని గ్రామాలు, మండల కేంద్రాలు, పట్టణాల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ ఫ్లెక్సీలు, చిత్రపటాలకు పెద్ద ఎత్తున క్షీరాభాషేకాలు చేయాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ పిలుపునిచ్చినట్లు జిల్లా అధ్యక్షుడు రమావత్ రవీంద్రకుమార్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఎంపీపీలు, జడ్పీటీసీలు, బీఆర్ఎస్ మండలాధ్యక్షులు, రైతుబంధు సమితి అధ్యక్షులు, మున్సిపల్ కౌన్సిల్ సభ్యులు, సర్పంచులు, ఎంపీటీసీలు బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు ప్రత్యక్షంగా పాల్గొని రైతులతో కలిసి కార్యక్రమాలు చేపట్టి విజయవంతం చేయాలని సూచించారు.
ఇప్పటికే రూ.37వేల వరకు అమలు
ప్రభుత్వం ఇప్పటివరకు రెండు విడుతలుగా రుణమాఫీని అమలు చేసింది. తొలి విడుతలో రూ.25వేల వరకు రుణం తీసుకున్న చిన్న రైతులకు రుణమాఫీ పూర్తయ్యింది. రెండో విడుతలో 50వేల రూపాయల వరకు రుణాలు తీసుకున్న వారికి మాఫీ కోసం ప్రభుత్వం సన్నాహాలు చేసింది. అయితే రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని బట్టి ఇప్పటివరకు రూ.37వేల వరకు తీసుకున్న వారికి కూడా రుణమాఫీని వర్తింపజేశారు. ఇక మిగిలిన వారికి త్వరలోనే రుణమాఫీ పథకాన్ని అమలు చేయనున్నారు. 2019లోనే లక్ష రూపాయల వరకు రుణం తీసుకున్న రైతుల వివరాలను బ్యాంకుల నుంచి ప్రభుత్వం సేకరించింది.
నేటి నుంచి ప్రక్రియ పునఃప్రారంభం
ఇప్పటికే బ్యాంకుల నుంచి సేకరించిన వివరాల ప్రకారం మిగిలిన అందరికీ నేటి నుంచి రుణమాఫీని దశల వారీగా వర్తింపజేయనున్నారు. రైతుబంధు తరహాలోనే చిన్న రైతుల నుంచి మొదలుకుని పెద్ద రైతుల వరకు, రూ.37వేల నుంచి మొదలు లక్ష వరకు రుణం తీసుకున్న రైతులకు దీన్ని అమలు చేయనున్నారు. సెప్టెంబర్ రెండో వారం నాటికి అర్హులైన ప్రతి ఒక్కరికీ రుణమాఫీని చేసేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ముఖ్యమంత్రి నిర్ణయంతో రైతుల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. కొంత ఆలస్యమైనా ఇచ్చిన మాట ప్రకారం సీఎం కేసీఆర్ రుణమాఫీ చేసేందుకు నిర్ణయించడం సంతోషకరమని పేర్కొంటున్నారు. స్వరాష్ట్రంలో సీఎం కేసీఆర్ పాలనలో వ్యవసాయం పండుగలా సాగుతుందని చెబుతున్నారు. ఇప్పటికే అనేక పథకాలు అమలు చేస్తూ తమకు వెన్నుదన్నుగా నిలుస్తున్నారని, రుణమాఫీతో మరింత అభయాన్ని కల్పించినైట్లెందని కొనియాడుతున్నారు.
రైతులకు ఇచ్చిన మాట నెరవేరుస్తున్న నాయకుడు సీఎం కేసీఆర్ సార్. రైతులకు ఏం కావాలో అన్నీ చేస్తున్నరు. ఎకరాకు 10 వేల రూపాయల పెట్టుబడి, వ్యవసాయానికి 24 గంటల కరెంట్ ఇస్తున్నరు. పండిన వడ్లను మద్దతు ధరకు కొంటున్నరు. బ్యాంకుల్లో తీసుకొచ్చిన అప్పు ఉండొద్దన్న తాపత్రయంతో రైతులకు రూ.లక్ష రుణమాఫీ చేస్తున్నరు. రైతుల కష్టాలు తెలిసిన నాయకుడు కాబట్టే ఇంత మంచి పనులు చేస్తున్నరు. సీఎం కేసీఆర్ సల్లగుండాలె. ఆయన ముఖ్యమంత్రిగా ఉంటేనే రైతులు
ఆర్థికంగా నిలదొక్కుకుంటరు.
– పోతుగంటి దానేలు, రైతు, రాగడప, త్రిపురారం
రైతుల పాలిట దేవుడు సీఎం కేసీఆర్
ఇచ్చిన మాట ప్రకారం రైతు రుణమాఫీ పునఃప్రారంభించి పూర్తిచేయాలని సీఎం కేసీఆర్ తీసుకున్న నిర్ణయంతో రైతుల జీవితాల్లో వెలుగులు నిండాయి. రైతుబంధు తరహాలో విడుతల వారీగా రుణమాఫీ చేపట్టి 45 రోజుల్లో పూర్తి చేయాలని నిర్ణయించడం హర్షణీయం. రైతులు ఆర్థికంగా బలోపేతం అయ్యేవరకు విశ్రమించే ప్రస్తక్తే లేదన్న ముఖ్యమంత్రి ఉక్కు సంకల్పం అభినందనీయం. రైతులకు సకాలంలో రైతుబంధు, రైతుబీమా, సబ్సిడీ ఎరువులు, విత్తనాలు, 24 గంటల ఉచిత విద్యుత్, రుణమాఫీ అందించి రైతుల పాలిట దేవుడిగా సీఎం కేసీఆర్ నిలిచారు. రాష్ట్ర రైతాంగమంతా సీఎం కేసీఆర్‌ను, బీఆర్ఎస్ పార్టీని గుండెల్లో పెట్టుకుని చూసుకుంటుంది. రైతుల సంక్షేమానికి కృషి చేస్తున్న సీఎం కేసీఆర్‌కు జీవితాంతం రుణపడి ఉంటాం.
-తాటికొండ వెంకట్‌రెడ్డి, రైతు, మఠంపల్లి
కేసీఆర్ సార్ వ్యవసాయ విప్లవ పితగా నిలిచిపోతారు
రైతుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని వారిని ఎల్లవేళలా ఆదుకున్న ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కింది. రుణమాఫీ రైతుల పాలిట వరం. సీఎం కేసీఆర్ పెద్దన్న పాత్ర పోషించడం గర్వించదగ్గ విషయం. నేటి నుంచి రుణమాఫీ అమలుకు సీఎం కేసీఆర్ ఆదేశించడంపై రైతులంతా హర్షం వ్యక్తం చేస్తున్నారు. దేశంలో ఇతర ఏ రాష్ట్రంలో లేని విధంగా మన రాష్ట్రంలో రైతు సంక్షేమ ప్రభుత్వం ఉండడం రాష్ట్ర ప్రజల అదృష్టం. రుణమాఫీతో సీఎం కేసీఆర్ రైతులకు మరో వ్యవసాయ విప్లవ పితగా చిరకాలం గుర్తుండిపోతారు. ఎన్ని ఇబ్బందులు ఎదురైనా రైతుల సంక్షేమాన్ని విస్మరించకపోవడం సీఎం కేసీఆర్‌కే చెల్లింది.
-ఎర్రబెల్లి నర్సిరెడ్డి, రైతుబంధు సమితి మండలాధ్యక్షుడు, కనగల్
రుణమాఫీ సంకల్పం గొప్పది
రైతు కష్టాలు తెలిసిన నాయకుడు సీఎం కేసీఆర్. ఇచ్చిన మాట ప్రకారం రైతులకు రుణమాఫీ చేస్తున్నందుకు ఎంతో సంతోషంగా ఉంది. కరోనాతో రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితి దెబ్బతిన్నా, కేంద్ర ప్రభుత్వం సహకరించకపోయినా రైతులను ఆదుకోవాలన్న సంకల్పంతో రుణమాఫీ చేస్తున్న రైతు బాంధవుడు సీఎం కేసీఆర్. రాష్ట్ర రైతులంతా ఆయనకు రుణపడి ఉంటాం. రైతుల పక్షాన ముఖ్యమంత్రికి ప్రత్యేక ధన్యవాదాలు.
– శాగం కోటిరెడ్డి, రైతు సంఘం గ్రామ అధ్యక్షుడు, తిరుమలగిరి(సాగర్)
ముఖ్యమంత్రి కేసీఆర్‌ను ఎప్పటికీ మరువం
ముఖ్యమంత్రి కేసీఆర్ రుణమాఫీ చేయాలని నిర్ణయించడం రైతుల అదృష్టం. రైతుల కష్టాలు తెలిసిన ముఖ్యమంత్రి కేసీఆర్‌ను ఎన్నటికీ మరువం. ఆరుగాలం కష్టపడి వ్యవసాయం చేసే రైతులను ముఖ్యమంత్రి ఎన్నడూ చిన్నచూపు చూడలేదు. రైతుల పాలిట దేవుడు లాంటి ముఖ్యమంత్రి దేశంలోనే ఇతర ఏ రాష్ట్రంలో లేడు. రెండోసారి అధికారంలోకి వచ్చాక కరోనా కష్టాలు వచ్చినప్పటికీ రైతుల సంక్షేమాన్ని మరువకుండా రుణమాఫీ చేయాలని నిర్ణయించడం హర్షణీయం. వచ్చే ఎన్నికల్లోనూ రైతుల సంపూర్ణ మద్దతు సీఎం కేసీఆర్‌కే ఉంటుంది.
-నేనావత్ నర్సింహ, రైతు, కట్టకొమ్ముతండా, దేవరకొండ