నల్లగొండ,/నల్లగొండ రూరల్, జూలై 17 : రైతు రుణమాఫీకి ప్రభుత్వం సిద్ధం చేసింది. తొలి విడుతలో రూ. లక్షలోపు రుణాలు తీసుకున్నోళ్లకు మాఫీ చేయనున్నది. ప్రభుత్వం విడుదల చేసిన జాబితాలో 82,999 మంది రైతులు ఉన్నారు. జిల్లాలో 5.60 లక్షల మంది రైతులు పలు బ్యాంకుల్లో పంట రుణాలు తీసుకున్నారు. తొలి విడుతలో రూ.లక్ష లోపు ఉన్న వారికి, ఈ నెలాఖరు వరకు రూ.1.5 లక్షలు, ఆగస్టు మొదటి వారంలో రూ.రెండు లక్షల రుణ మాఫీ చేయనున్నట్లు సర్కారు ప్రకటించింది.
రుణమాఫీలో ప్రభుత్వం కోతలు పెట్టింది. ఇంట్లో ఉద్యోగస్తులు ఉన్న వారిని, ఆదాయపు పన్ను కడుతున్న వారిని పక్కకు పెట్టింది. ఈ మాఫీ డిసెంబర్ 12, 2018 నుంచి డిసెంబర్ 9, 2023 వరకు తీసుకున్న వారికి వర్తించనుంది. రుణమాఫీపై గురువారం సాయంత్రం రైతు వేదికల్లో కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఇందుకోసం వ్యవసాయ శాఖ అన్ని ఏర్పాట్లు చేస్తున్నది.
రైతు వేదికల్లో కార్యక్రమాలు
అసెంబ్లీ ఎన్నికల ముందు రెండు లక్షల రుణమాఫీ చేస్తామని కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది. మొత్తం మాఫీ ఒకేసారి చేస్తామని గతంలో కాంగ్రెస్ ప్రకటించినా.. ఇప్పుడు మాత్రం విడుతల వారీగా చేస్తున్నది. మూడు విడుతల్లో చేస్తామని చెబుతున్నది. తొలుత రూ.లక్షలోపు రుణాలు ఉన్నోళ్లకు మాఫీ చేస్తామని ప్రకటించింది. దీంతో గురువారం సాయంత్రం రూ. లక్ష వరకు రుణాలు ఉన్న రైతులకు మాత్రమే రుణాలు మాఫీ కానున్నాయి. రుణమాఫీలో భాగంగా జిల్లా వ్యాప్తంగా రైతు వేదికల్లో రైతులు, ప్రజాప్రతినిధులతో కార్యక్రమాలను ఏర్పాటు చేయనున్నారు.
ఇందుకోసం క్లస్టర్ వారీగా ప్రత్యేకంగా అధికారులను నియమించారు. టెలీ కాన్ఫరెన్స్ ద్వారా సాయంత్ర నాలుగు గంటలకు సీఎం రేవంత్ రెడ్డి ప్రసంగించారు. ఎవరైనా రైతులు కూడా మాట్లాడే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. రుణమాఫీ అనంతరం సంబురాలు నిర్వహించే అవకాశం ఉంది. రుణమాఫీపై నిర్వహించే కార్యక్రమాలకు ఏర్పాట్లు చేయాలని నల్లగొండ కలెక్టర్ సి. నారాయణరెడ్డి బుధవారం జిల్లా వ్యవసాయ శాఖ జాయింట్ డైరెక్టర్, మండల వ్యవసాయ అధికారులతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. జిల్లా కేంద్రంలో ఎంఎన్ఆర్ గార్డెన్స్‌లో నిర్వహించే కార్యక్రమానికి రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి మధ్యాహ్నం 2 గంటలకు హాజరుకానున్నారు.
రుణాలు కట్టినోళ్ల సంగతేంది..?
రాష్ట్ర ప్రభుత్వం రుణమాఫీకి 2018 కటాఫ్‌గా నిర్ణయించింది. గత ప్రభుత్వం రూ.లక్షలోపు రుణాలను 70శాతం వరకు మాఫీ చేసింది. ఎన్నికల కోడ్ కారణంగా మిగతా వారికి మాఫీ కాలేదు. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం 2018 వరకు తీసుకునోళ్లకే అని చెబుతుండటంతో వారంతా నష్టపోయే ప్రమాదం ఉంది. మరోవైపు బ్యాంకుల ఒత్తిడితో కొందరు రైతులు రుణాలు చెల్లించారు. ఇప్పటికే రుణాలు చెల్లించిన వారికి సర్కారు ఇస్తుందా..? లేదా అనేది స్పష్టత లేదు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో మాత్రం ముందుగా రుణాలు చెల్లించినా.. తర్వాత ప్రభుత్వం వారికి డబ్బులు సమకూర్చింది.