కోదాడ, డిసెంబర్ 26 : ప్రజలే కేంద్ర బిందువుగా ప్రజా సమస్యలే ఆలంబనగా సాహిత్యం రూపాంతరం చెందాలని తెలంగాణ సాహితీ రాష్ట్ర కమిటీ సభ్యుడు కుకడాల గోవర్ధన్ అన్నారు. శుక్రవారం కోదాడ పబ్లిక్ క్లబ్ ఆవరణలో సూర్యాపేట జిల్లాకు చెందిన కవులు, రచయితలు, సాహితీ ప్రియులు, సాహిత్యాభిమానులైన ఉపాధ్యాయ మిత్రులతో నిర్వహించిన సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ప్రజలే కేంద్ర బిందువుగా సాహిత్యం ఉండాలని ప్రజా కవులు, రచయితలు అందుకోసమే పని చేయాలని సూచించారు. ప్రపంచీకరణ దాటికి కుదేలవుతున్న స్థానిక కళలు, భాషలు సంస్కృతులను కాపాడుకోవడంలో కవులు, రచయితల పాత్ర కీలకమన్నారు. ప్రజల మధ్య ఉన్న వివక్షతలతో పాటు వాటికి కారణమైన పరిస్థితులను అన్వేషించి పరిష్కారాలను సూచించడంలో సాహిత్యం ప్రధాన ఆయుధంగా ఉండాలని, మనుషులను విభజించడం కాక మనుషులందరినీ కలిపి ఉంచే విధానాలు ఇప్పటి పరిస్థితులలో అవసరమన్నారు.
అభ్యుదయ సాహిత్యాన్ని అందిస్తూ శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందించే కవిత్వం ఉండాలని ప్రతి ఒక్కరి ఆలోచనలు నూతన సమాజాభివృద్ధి దిశలో ఉండాలన్నారు. దోపిడీకి గురయ్యే వర్గం, దోపిడీ చేసే వర్గం ఈనాడు సమాజంలో ఉన్నాయని కొత్తగా రచనలు చేస్తున్న వారిని ప్రోత్సహించాలని సాహిత్య రంగంలో దేశవ్యాప్తంగా ప్రపంచ వ్యాప్తంగా ఒకే రకమైన ఆలోచనలతో ముందుకు పోతే అభివృద్ధి జరుగుతుందన్నారు. సాహితీరంగంలో మానవ సంబంధాలను మెరుగుపరిచే సాహిత్యాన్ని విస్తృత పరచాలని, బాల్య దశ నుండే నైతిక విలువలను పెంపొందించడంలో పాఠ్య పుస్తకాలు రూపొందించాలన్నారు. కవులు, రచయితలు తమ రచనల ద్వారా సంస్కృతి సాంప్రదాయాలను కాపాడాలన్నారు
ఈ కార్యక్రమంలో ప్రముఖ బాల సాహితీవేత్త, యువ కవి ముక్కామల జానకిరామ్, దురుసోజు శ్రీనివాసాచారి, ఉయ్యాల నరసయ్య, చిట్యాల ఉపేందర్, పరిమి వెంకటనారాయణ, తుమ్మా రాజా, గుంటుపల్లి వెంకటేశ్వర్లు, కోడిరెక్క విజయకుమార్ పాల్గొన్నారు. అనంతరం రాష్ట్ర కమిటీ సభ్యుడు కుకూడాల గోవర్ధన్ పర్యవేక్షణలో తెలంగాణ సాహితీ సూర్యాపేట జిల్లా కమిటీ కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా పుప్పాల కృష్ణమూర్తి, ప్రధాన కార్యదర్శిగా దురుసోజు శ్రీనివాసాచారి, ఉపాధ్యక్షులుగా ముక్కామల జానకిరామ్, మెంతబోయిన సైదులు, సహాయ కార్యదర్శులుగా ఉయ్యాల నరసయ్య, చిట్యాల ఉపేందర్ తోపాటు కార్యవర్గ సభ్యులను ఎన్నుకున్నారు.