పెద్దఅడిశర్లపల్లి, సెప్టెంబర్ 18 : ఉపాధ్యాయులు, అధికారుల పనితీరును గుర్తించి ఉత్తమ పురస్కారాలను అందజేయడం ప్రశంసనీయమని దేవరకొండ ఎమ్మెల్యే నేనావత్ బాలు నాయక్ అన్నారు. లయన్స్ క్లబ్ ఆఫ్ పీఏ పల్లి నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారాన్ని పురస్కరించుకుని అంగడిపేట ఎక్స్ రోడ్ లోని వైష్ణవి ఫంక్షన్ హాల్ లో గురువారం నిర్వహించిన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా పెద్దఅడిశర్లపల్లి, గుడిపల్లి మండలాల్లోని ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేస్తున్న ఉత్తమ ఉపాధ్యాయులకు, క్లస్టర్ రిసోర్స్ పర్సన్ (సీఆర్పీ) లకు ఉత్తమ ఉపాధ్యాయ, సీఆర్పీ పురస్కారాలను అందజేసి శాలువాతో సత్కరించారు. అదేవిధంగా పంచాయతీ కార్యదర్శులు, ఇంజినీర్లు, పారిశుధ్య సిబ్బందికి పురస్కారాలు అందజేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. నిస్వార్థ సేవకు లయన్స్ క్లబ్ ప్రతీక అన్నారు. గ్రామీణ, మండల కేంద్రాల్లో సైతం లయన్స్ క్లబ్ ఏర్పాటు చేసి ప్రజలకు సేవ చేయడం శుభ పరిణామం అన్నారు. అంతకుముందు జరిగిన కార్యక్రమంలో లయన్స్ క్లబ్ ఆఫ్ పీఏ పల్లి అధ్యక్ష, కార్యదర్శులతో పాటు కార్యవర్గంచే ప్రమాణ స్వీకారం చేయించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ జిల్లా గవర్నర్ రేపాల మదన్ మోహన్, సతీష్ కుమార్, లయన్స్ క్లబ్ ఆఫ్ పీఏ పల్లి అధ్యక్షుడు ముచ్చర్ల ఏడుకొండలు, గుడిపల్లి ఎంఈఓ సముద్రాల శ్రీనయ్య, లయన్స్ క్లబ్ ప్రతినిధులు పాల్గొన్నారు.