రామగిరి, జూలై 25 : తెలంగాణకు జలగండంగా మారే బనకచర్ల ప్రాజెక్ట్ నిర్మాణాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముందుకు తీసుకెళ్లడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు నల్లగొండలోని మహాత్మాగాంధీ విశ్వవిద్యాలయ బీఆర్ఎస్వీ విద్యార్థి నాయకుడు వాడపల్లి నవీన్ తెలిపారు. శుక్రవారం వర్సిటీలోని ఇంజినీరింగ్ కళాశాలలో జరిగిన సదస్సులో విద్యార్థులకు “తెలంగాణ నీటి హక్కులు” పై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బనకచర్ల ప్రాజెక్ట్ ద్వారా గోదావరిలోని తెలంగాణ వాటాను దోచుకోవడమే లక్ష్యంగా ఏపీ ప్రభుత్వం పని చేస్తుందని దుయ్యబట్టారు. ఇది తెలంగాణ ప్రజల ఆహారం లాక్కోవడమే అని విమర్శించారు.
గత బీఆర్ఎస్ ప్రభుత్వ కాలంలో కేసీఆర్ నేతృత్వంలో తెలంగాణ పచ్చని పంట పొలాలతో సస్యశ్యామలంగా మారితే, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్య పాలన వల్ల గోదావరిలో తెలంగాణ హక్కులు ఖూనీ అవుతున్నాయన్నారు. ఈ విషయంపై రాష్ట్ర ప్రభుత్వం, ఎంపీలు నోరు మెదపకపోవడం దుర్మార్గమన్నారు. పునర్విభజన చట్టాన్ని తుంగలో తొక్కి 200 టీఎంసీల నీళ్లను రాయలసీమకు తరలించే ప్రయత్నాన్ని అంతా ఖండించాలన్నారు. ఈ కార్యక్రమంలో యూనివర్సిటీ విద్యార్థి నాయకులు మాచర్ల సుధీర్, తరుణ్, చందు పాల్గొన్నారు.